ఒకప్పుడు ప్రేమ.. పెళ్లి.. అత్యంత వ్యక్తిగత విషయాలుగా ఉండేవి. అయితే, ఇప్పుడు సెలబ్రిటీలు మొదలు సాధారణ వ్యక్తులూ తమ జీవితంలోని అతి ముఖ్యమైన ఈ రెండు విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. తమ ఫాలోవర్లు, అభిమానులను కూడా తమ సంతోషంలో భాగం చేయాలనే ఉద్దేశంతో కొందరు.. హోదాను, రిలేషన్‌షిప్ స్టేటస్‌ను చాటి చెప్పుకొనేందుకు మరి కొంతమంది ఇలాంటి పోకడలకు పోతున్నారు.
అయితే, నెట్టింట ఇందుకు సానుకూల కామెంట్ల కంటే.. ప్రతికూల, చెత్త కామెంట్లే ఎక్కువసార్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళా సెలబ్రిటీలపై శ్రుతిమించిన స్థాయిలో ట్రోల్స్ వస్తున్నాయి. ఇటీవలి కాలంలో భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ పెళ్లి వాయిదా- ఆపై రద్దు నేపథ్యంలో సోషల్ మీడియాలో జరిగిన రచ్చ ఇందుకు నిదర్శనం.

కాబోయే ‘బావగారి’ని ఆటపట్టిస్తూ..
ఆరేళ్లుగా వారిద్దరు ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. హల్ది, సంగీత్, మెహందీ అంటూ స్మృతి- పలాష్ ముందస్తు పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. సహచర ప్లేయర్లు జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్ తదితరులు కాబోయే ‘బావగారి’ని ఆటపట్టిస్తూ, అతడితో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలు కూడా బాగా వైరల్ అయ్యాయి.

‘ప్రైవేటు సంభాషణ’ బహిర్గతం
అయితే, అనూహ్య రీతిలో స్మృతి- పలాష్ పెళ్లి వాయిదా పడింది. వివాహ తంతుకు కొన్ని గంటల ముందు స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆ వెంటనే పలాష్ కూడా ఆస్పత్రి పాలయ్యాడు. ఈ పరిణామాలు సందేహాలకు తావిచ్చాయి. ఇందుకు తోడు ఓ అమ్మాయి పలాష్ తనతో చాట్ చేశాడంటూ ‘ప్రైవేటు సంభాషణ’ను బహిర్గతం చేసింది.
ఇంకేముంది.. సోషల్ మీడియాలో చిన్నగా అంటుకున్న ఈ ‘మంట’ దావానంలా వ్యాపించింది. మెజారిటీ మంది పలాష్‌ను తప్పుపడితే.. మరికొంత మంది స్మృతిని కూడా ట్రోల్ చేశారు. ఆరేళ్ల ప్రేమలో అతడి గురించి ఏమీ తెలియలేదా?.. పెళ్లికి ముందు రోజు రాత్రే.. ‘అఫైర్’ ఉందని తెలిసిందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

పలాష్ అక్కపైనా ట్రోలింగ్
మరోవైపు.. పలాష్‌పై తీవ్ర స్థాయిలో నెగటివ్ కామెంట్లు వచ్చాయి. దెబ్బకు అతడు బృందావనంలోని ఓ ఆశ్రమానికి వెళ్లి సేదదీరాడు. ఈ విషయంలో కాబోయే వధూవరులతో పాటు ట్రోలింగ్‌కు గురైన మరో వ్యక్తి పాలక్ ముచ్చల్. పలాష్ అక్క, బాలీవుడ్ సింగర్‌గా ప్రాచుర్యం పొందిన పాలక్ సమాజ సేవలోనూ ముందే ఉంటుంది.
ఎంతో మంది చిన్నారులకు తన ఎన్‌జీవో ద్వారా గుండె ఆపరేషన్లు చేయించి ప్రాణదాతగా నిలిచింది పాలక్. అయితే, పలాష్ వ్యక్తిత్వాన్ని ప్రస్తావిస్తూ పాలక్‌ను కూడా కొంత మంది విపరీతపు వ్యాఖ్యలతో ట్రోల్ చేశారు.
డబ్బు, అందం ఉందన్న కారణంగానే స్మృతి వెంటపడమని సలహా ఇచ్చిందని.. అసలు విషయం బయటపడేసరికి ఆస్పత్రి పాలయ్యాడంటూ తమ్ముడికి సానుభూతి వచ్చేలా చేయాలని చూసిందని ఇష్టారీతిన ఆమెను నిందించారు.

గోప్యతకు భంగం కలిగించవద్దని విజ్ఞప్తి
నిజానికి ప్రేమ- పెళ్లి.. స్మృతి- పలాష్‌లకు సంబంధించినది. ఈ విషయంలో కుటుంబ సభ్యులు కూడా అతిగా జోక్యం చేసుకునే వీలు ఉండకపోవచ్చు. నిజానికి స్మృతి మీద ఉన్న అభిమానం.. అనేకంటే దురభిమానమే పాలక్ మీద కామెంట్ల దాడికి కారణమైందని చెప్పవచ్చు.
మరోవైపు.. పలాష్‌కు మద్దతు పలికేవాళ్లు స్మృతిని తక్కువ చేసేలా మాట్లాడటం తెలిసిందే. ఆఖరికి తమ పెళ్లిని రద్దు చేసుకున్నట్లు ఇరువురూ స్పందించి.. తమ గోప్యతకు భంగం కలిగించవద్దని విజ్ఞప్తి చేసేదాకా వచ్చింది.

తప్పు ఎటువైపు ఉన్నా.. బాధితులు వారే
మొత్తం మీద తప్పు ఎటువైపు ఉందో తెలియకపోయినా.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారిన పడేది అమ్మాయిలే అన్నది ఈ ఘటన ద్వారా మరోసారి నిరూపితమైంది. నైతిక విలువలకు పాతరేసి మహిళలను కించపరిచే ఈ ‘సంస్కృతి’ని నీచమైనదిగా అభివర్ణించవచ్చు. ఇలాంటి ట్రోల్స్ వేసే వాళ్లలో చాలామందికి తమ వ్యక్తిగత జీవితంపై ఓ అవగాహనా, స్పష్టత ఉండదు.
స్మృతి, సమంత, శోభిత
అయినప్పటికీ పక్కవాళ్ల జీవితంలోకి చొచ్చుకుపోయి మరీ ఇలా దిగజారుడుగా వ్యవహరిస్తారు. ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సినీ హీరోయిన్ సమంతపై కూడా కొంతమంది నీచంగా కామెంట్లు చేశారు. ఆమె పాత జీవితాన్ని తెర మీదకు తెస్తూ మోసగత్తెగా అభివర్ణిస్తూ రాక్షసానందం పొందారు.
అంతేకాదు.. సమంత మాజీ భర్త నాగ చైతన్యపై కూడా విడాకుల సమయంలో.. అతడి రెండో పెళ్లి విషయంలోనూ విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. ముఖ్యంగా అక్కడ చైతూ భార్య శోభిత ధూళిపాళ వాళ్లకు ప్రధాన టార్గెట్‌గా మారింది. ఈ రెండు సందర్భాల్లోనూ ఇటు శోభిత.. అటు సమంత.. ఇలా ఇద్దరు మహిళలు బాధితులుగా మారారు.
మరోవైపు.. సెలబ్రిటీలను ఫాలో చేస్తూ వారి అనుమతి లేకుండా వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు తీసే పాపరాజీలపై టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
తన ప్రేయసి, మోడల్ మహీక శర్మను తీయకూడని యాంగిల్లో ఫొటో తీశారని.. కాస్తైన బుద్ధి ఉండాలంటూ పాపరాజీలకు పాండ్యా చురకలు అంటించాడు. కాగా హార్దిక్ పాండ్యాతో డేటింగ్ మొదలుపెట్టిన నాటి నుంచి మహీకపై నెట్టింట ట్రోల్స్ వస్తున్న విషయం తెలిసిందే.
మహీక, ధనశ్రీ, నటాషా
మరోవైపు.. హార్దిక్ మాజీ భార్య నటాషా స్టాంకోవిక్‌ను సైతం అతడి దురభిమానులు వదిలిపెట్టలేదు. డబ్బు కోసమే ప్రేమ నటించి, పిల్లాడిని కని భారీ స్థాయిలో భరణం గుంజాలనే స్కెచ్ వేసిందని ఆమెపై నిందలు వేశారు.
ఇక టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ మాజీ భార్య, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మపై కూడా ‘గోల్డ్ డిగ్గర్’ (డబ్బు కోసం సంబంధం పెట్టుకునే స్త్రీ అనే అర్థంలో) అంటూ నీచస్థాయిలో ట్రోల్ చేశారు.
ఇతరులతో పోల్చుకోవడం, ఈర్ష్య, అసూయ.. ముఖ్యంగా తరతరాలుగా మెదళ్లలో పాతుకుపోయిన పితృస్వామ్య భావజాలమే మహిళల పట్ల సోషల్ మీడియాలో వికృత వాంతి రూపంలో బయటకు వస్తోందనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే, కొంతమంది మహిళలు సైతం ఇలాంటి ట్రోల్స్‌కు మద్దతు పలకడం విషాదకరం.
చదవండి: మంధానతో పెళ్లి క్యాన్సిల్.. పలాష్ ముచ్చల్ ఏమన్నాడంటే?


