దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో తమిళనాడు జట్టుకు చెందిన ఓ ఆటగాడు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఏకంగా 333కు పైగా స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టాడు. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సోషల్ మీడియాలో సన్నీ లియోన్ (Sunny Leone) ఫొటో షేర్ చేశాడు.
అసలు.. ఆ ఆటగాడికి.. అశూ ఈ పోస్ట్ పెట్టడానికి సంబంధం ఏమిటి అంటారా?!... సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT)లో భాగంగా తమిళనాడు జట్టు సోమవారం సౌరాష్ట్రతో తలపడింది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా.. టాస్ గెలిచిన ఆతిథ్య సౌరాష్ట్ర తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.
ఓపెనర్ విశ్వరాజ్ జడేజా మెరుపు అర్ధ శతకం (39 బంతుల్లో 70)తో చెలరేగగా.. సమ్మార్ గజ్జార్ (42 బంతుల్లో 66) ధనాధన్ దంచికొట్టాడు. తమిళనాడు బౌలర్లలో సీలం బరాసన్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఇసక్కిముత్తు రెండు వికెట్లు తీశాడు. ఆర్. రాజ్‌కుమార్, సన్నీ సంధు చెరో వికెట్ దక్కించుకున్నారు.
సాయి సుదర్శన్ మెరుపు శతకం
ఇక సౌరాష్ట్ర విధించిన 184 లక్ష్య ఛేదనకు దిగిన తమిళనాడు 18.4 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. ఓపెనర్, టీమిండియా స్టార్ సాయి సుదర్శన్ మెరుపు శతకం (55 బంతుల్లో 101 నాటౌట్, 10 ఫోర్లు, 4 సిక్సర్లు)తో దుమ్ములేపాడు.
తొమ్మిది బంతుల్లోనే 30 పరుగులు
మరోవైపు.. ఎనిమిదో స్థానంలో వచ్చిన బౌలర్ సన్నీ సంధు (Sunny Sandhu) కేవలం తొమ్మిది బంతుల్లోనే 30 పరుగులు రాబట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉండటం విశేషం. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగానే తమిళనాడు... సౌరాష్ట్రపై మూడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.
అసలు విషయం ఇదీ!
ఈ నేపథ్యంలో తమిళనాడు క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ తనదైన శైలిలో ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. నటి సన్నీ లియోన్ ఫోటోకు.. చెన్నైలోని సంధు స్ట్రీట్ ఫోటోను జతచేసి షేర్ చేశాడు. దీంతో నెటిజన్లు గందరగోళానికి గురయ్యారు. అశూ ఇలాంటి పోస్ట్ చేశాడని ఎందుకు చర్చించుకున్నారు.
అయితే, అంతలోనే మరికొంత మంది అశూ పోస్ట్ వెనుక ఉన్న అర్థాన్ని పసిగట్టారు. సౌరాష్ట్రతో మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన సన్నీ సంధును ప్రశంసించే క్రమంలోనే అశూ ఈ మేరకు పోస్ట్ పెట్టాడని, దీనిని తాము సులభంగానే డీకోడ్ చేశామంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా అశూ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
చదవండి: మంధానతో పెళ్లి క్యాన్సిల్.. పలాష్ ముచ్చల్ ఏమన్నాడంటే?
👀 👀 pic.twitter.com/BgevYfPyPJ
— Ashwin 🇮🇳 (@ashwinravi99) December 9, 2025


