ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్‌కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) తమ కోచింగ్ స్టాప్‌లో కీలక మార్పులు చేసింది. తమ జట్టు కొత్త హెడ్ కోచ్‌గా తమిళనాడు మాజీ క్రికెటర్ మలోలన్ రంగరాజన్‌ను ఆర్సీబీ యాజమాన్యం నియమించింది.
రెగ్యూలర్ హెడ్ కోచ్ ల్యూక్ విలియమ్స్ బిగ్ బాష్ లీగ్ (BBL)లో అడిలైడ్ స్ట్రైకర్స్‌తో ఒప్పందం కుదర్చుకోవడంతో రాబోయే డబ్ల్యూపీఎల్ ఎడిషన్‌కు దూరంగా ఉండనున్నాడు. ఈ క్రమంలోనే విలియమ్స్ స్ధానాన్ని రంగరాజన్‌తో ఆర్సీబీ భర్తీ చేసింది. రంగరాజన్ గతంలో ఆర్సీబీ పురుషుల, మహిళల జట్లకు స్కౌట్, ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేశారు.
మరోవైపు ఇంగ్లండ్ మాజీ నేసర్ అన్యా ష్రబ్సోల్ (Anya Shrubsole)ను తమ బౌలింగ్ కోచ్‌గా ఆర్సీబీ ఎంపిక చేసింది. అన్యా గతంలో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధానతో కలిసి 'ది హండ్రెడ్'లో సదరన్ బ్రేవ్ తరఫున ఆడింది. ష్రబ్సోల్..గత సీజన్ వరకు బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన సునేత్ర పరంజాపే స్థానంలో బాధ్యతలు చేపట్టనుంది.
ష్రబ్సోల్ ఇంగ్లండ్ తరఫున 86 వన్డేలు, 79 టీ20లు, 8 టెస్ట్‌లు ఆడింది. ఇక బ్యాటింగ్ కోచ్‌గా ఆర్ మురళీధర్, హెడ్ ఫిజియోగా నవనీత గౌతమ్ తమ పదవుల్లో కొనసాగనున్నారు. కాగా ఈ నెలాఖరులో డబ్ల్యూపీల్ మినీ వేలం జరగనుంది. నవంబర్ 5లోపు ఆయా ఫ్రాంచైజీలు ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను సమర్పించాలి.
చదవండి: బిగ్‌బాష్ లీగ్ నుంచి అశ్విన్ ఔట్


