నేడు డబ్ల్యూపీఎల్ వేలం
73 ఖాళీల కోసం 277 మంది క్రికెటర్లు బరిలో
దీప్తి శర్మ, శ్రీచరణిల కోసం ఫ్రాంఛైజీలు పోటీపడే చాన్స్
మధ్యాహ్నం గం. 3:30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 సీజన్ మెగా వేలానికి రంగం సిద్ధమైంది. న్యూఢిల్లీ వేదికగా గురువారం ఈ ప్రక్రియ సాగనుంది. మొత్తం ఐదు ఫ్రాంచైజీల్లో 73 స్థానాలు ఖాళీ ఉండగా... వీటి కోసం 277 మంది ప్లేయర్లు పోటీ పడుతున్నారు. ఇందులో 194 మంది భారత ప్లేయర్లు ఉన్నారు.
వారిలో 52 మంది క్యాప్డ్ (జాతీయ జట్టుకు ఆడినవారు) ప్లేయర్లు కాగా... 142 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు. ఇక విదేశాల నుంచి 83 మంది పోటీ పడుతున్నారు. ఇందులో 66 మది క్యాప్డ్ ప్లేయర్లు... 17 మంది అన్ క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. ఒక్కో జట్టు కనిష్టంగా 15 మంది, గరిష్టంగా 18 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.
» ఇటీవల జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ చేజిక్కించుకున్న భారత ప్లేయర్లకు వేలంలో భారీ డిమాండ్ ఉండే అవకాశాలున్నాయి. వరల్డ్‌కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచిన టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ కోసం ఫ్రాంఛైజీలు పోటీ పడొచ్చు. గతంలో యూపీ వారియర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన దీప్తిని వేలంలో ఎవరు దక్కించుకుంటారో చూడాలి. దీప్తితో పాటు రేణుక సింగ్, సోఫీ డివైన్, అమెలియా కెర్ (న్యూజిలాండ్), ఎకిల్‌స్టోన్ (ఇంగ్లండ్), అలీసా హీలీ, మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా), వాల్‌వర్ట్ (దక్షిణాఫ్రికా) మార్క్యూ ప్లేయర్ల జాబితాలో ఉన్నారు.
» వన్డే వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులోని క్రాంతి గౌడ్, శ్రీ చరణి, హర్లీన్ డియోల్, ప్రతీక రావల్‌కు కూడా భారీ ధర దక్కే అవకాశాలున్నాయి. స్నేహ్ రాణా, పూజ వస్త్రకర్, ఉమా ఛెత్రీ కోసం కూడా ఫ్రాంచైజీలు పోటీ పడొచ్చు. విదేశీ ప్లేయర్ల జాబితాలో డిక్లెర్క్, లిచ్‌ఫీల్డ్, అలానా కింగ్ కూడా ఉన్నారు.
» 5 ఫ్రాంచైజీలు కలిసి ఈ వేలంలో రూ. 41.1 కోట్లు ఖర్చు చేయనున్నాయి. అందులో అత్యధికంగా యూపీ వారియర్స్ దగ్గర 14.5 కోట్లు ఉన్నాయి. వేలానికి ముందు ఆ జట్టు కేవలం ఒక్క ప్లేయర్‌ను మాత్రమే రీటైన్ చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద అతి తక్కువగా రూ. 5.70 కోట్లు ఉన్నాయి. ఢిల్లీతో పాటు ముంబై ఇండియన్స్ జట్లు వేలానికి ముందు ఐదుగురు ప్లేయర్లను రీటైన్ చేసుకున్నాయి. దీంతో వేలంలో ఈ రెండు జట్లకు ‘రైట్ టు మ్యాచ్‘ అవకాశం లేదు.
వేలంలో నలుగురు అసోసియేట్ ఆటగాళ్లు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తీర్థ సతీశ్, ఇషా ఓజా (యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్), తారా నోరిస్ (అమెరికా), థిపట్చా పుథవాంగ్ (థాయ్‌లాండ్) వేలం బరిలో ఉన్నారు. వచ్చే ఏడాది జనవరి 7 నుంచి డబ్ల్యూపీఎల్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.


