న్యూయార్క్: కొందరు టాయిలెట్‌కు వెళితే ముక్కు మూసుకుని వెళ్తారు. కానీ ఈ టాయిలెట్ వార్త తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. 18 కేరట్ల స్వచ్ఛత ఉన్న బంగారంతో తయారుచేసిన ఈ టాయిలెట్‌ను బుధవారం అమెరికాలో ప్ర ఖ్యాత సోత్‌బే వేలంపాట సంస్థ వేలంవేయగా ఏకంగా 106 కోట్ల రూపాయల ధర పలికింది. ఈ టాయిలెట్ బరువు 101 కేజీలు. ఇది సాధారణ టాయిలెట్ కమోడ్ మాదిరే ఫ్లష్‌తోసహా పూర్తిస్థాయిలో పనిచేస్తుంది.
2016లో తొలిసారిగా అమెరికాలో దీనిని న్యూయార్క్ గుగెన్‌హామ్ మ్యూజియంలోని పబ్లిక్ బాత్రూమ్‌లో అమర్చారు. దీనిని చూసేందుకు లక్షలాది మంది జనం ఎగబడ్డారు. గతంలో ఒక అరటిపండుకు టేప్‌ను అతికించి ఇది కూడా కళాఖండమే అని ప్రకటించి కోట్ల రూపాయలకు అమ్ముడుపోయేలా చేసిన ఇటాలియన్ వ్యంగ్య కళాకారుడు మారీజియో క్యాటెలాన్ ఈ టాయిలెట్‌ను రూపొందించారు.
ఈ టాయిలెట్‌కు వినూత్నంగా ‘అమెరికా’ అని పేరు పెట్టారు. అమెరికాలో అపార సంపద దాగుందని వెటకారంగా దీనికి ఈ పేరు పెట్టానని మారీజియో గతంలో వ్యాఖ్యానించారు. 2019లో అచ్చం ఇలాంటి మరో బంగారు టాయిలెట్‌ను తయారు చేశారు. బ్రిటన్‌లో విన్‌స్టన్ చర్చిల్ జన్మించిన బ్లెన్‌హామ్ ప్యాలెస్‌లో ఉంచగా దొంగలు దీనిని సుత్తితో పగలగొట్టి ముక్కలుగా ఎత్తుకుపోయారు.


