సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) దూరం కానున్నట్లు తెలుస్తోంది. మెడ నొప్పి తీవ్రంగా ఉండటంతో అతడు ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదని సమాచారం. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినా ఇంకా కనీసం మూడు, నాలుగు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు అతడికి సూచించినట్లు బీసీసీఐ వర్గాలు జాతీయ మీడియాకు వెల్లడించాయి.
ఊహించని ఆటగాడు
గిల్ ప్రస్తుతం విమానంలో ప్రయాణించే పరిస్థితి లేదు కాబట్టి.. గువాహటి వేదికగా రెండో టెస్టు (IND vs SA 2nd Test)కు అతడు దూరమయ్యే పరిస్థితి ఉందని బీసీసీఐ అధికారి ఒకరు సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తుదిజట్టులో గిల్ స్థానాన్ని మేనేజ్‌మెంట్ ఎవరితో భర్తీ చేస్తారనే చర్చ జరుగుతుండగా.. భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఊహించని ఆటగాడి పేరు తెరపైకి తెచ్చాడు.
ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad)ను టెస్టు జట్టులోకి తీసుకోవాలా? ఈ మాట వింటే మీకు ఆశ్చర్యం కలుగవచ్చు. ఇప్పటికే సౌతాఫ్రికాతో టెస్టులకు జట్టును ఎంపిక చేసిన తర్వాత రుతు పేరెందుకు? అని మీరు అడుగవచ్చు.

సాయి, పడిక్కల్ కాదు!
రెండో టెస్టులో గిల్ ఆడతాడా? లేదా? అన్న అంశంపై స్పష్టత లేదు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినా మెడ నొప్పి ఇంకా తగ్గలేదనే సమాచారం ఉంది. ఒకవేళ అతడు మ్యాచ్‌కు పూర్తిగా దూరమైతే.. సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్‌లో ఒకరిని ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకుంటారా?
ఇప్పటికే తుది జట్టులో ఆరుగురు లెఫ్టాండర్లు ఉన్నారు. మరి అలాంటపుడు మరో ఇద్దరు లెఫ్టాండర్ల (సాయి, పడిక్కల్)లలో ఒకరివైపు మొగ్గుచూపుతారా? అలాంటపుడు మొత్తంగా ఏడుగురు ఎడమచేతి వాటం ఆటగాళ్లను ఆడించాల్సి వస్తుంది.
రుతు బెస్ట్.. ఎందుకంటే?
అలాంటపుడే బెటర్ ఆప్షన్ కోసం చూడాలి. రుతురాజ్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. భారత్-‘ఎ’ తరఫున వైట్‌బాల్ క్రికెట్‌లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లలో అదరగొడుతున్నాడు. రంజీ, దులిప్ ట్రోఫీ వంటి రెడ్‌బాల్ టోర్నీల్లోనూ పరుగులు రాబడుతున్నాడు.
మిడిలార్డర్లోనూ రుతు బ్యాటింగ్ చేయగలడు. అతడి టెక్నిక్ కూడా బాగుంటుంది. నిజానికి టెస్టులకు అతడు సరైన ఆప్షన్. ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్‌లో ఇదే వేదిక (గువాహటి)పై రుతు సెంచరీ చేశాడు. కాబట్టి శుబ్‌మన్ గిల్ రెండో టెస్టుకు అందుబాటులో లేకుంటే.. రుతురాజ్‌ను తీసుకువస్తే బాగుంటుంది’’ అంటూ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
చదవండి: వైభవ్ తుపాన్ ఎలా ఆపేది?


