ముంబై: మహారాష్ట్ర ఎన్‌సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య కేసులో కీలక నిందితుడు, గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణో య్‌ను అమెరికా నుంచి రప్పిస్తున్నట్లు మంగళవారం ముంబై పోలీసులు తెలిపారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వద్ద ఏప్రిల్ 2024లో జరిగిన కాల్పుల కేసులోనూ ఇతడు వాంటెడ్‌గా ఉన్నాడన్నారు. అమెరికా నుంచి ఇతడు బుధవారం ఢిల్లీకి చేరుకుంటాడని పోలీసులు వివరించారు. అన్మోల్ బిష్ణోయ్‌పై దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కేసులున్నాయని, ముందుగా అతడిని ఎవరికి అప్పగించాలనేది కేంద్రం నిర్ణయిస్తుందన్నారు. తాము కూడా అతడి కస్టడీని కోరుతామన్నారు.
అమెరికా, కెనడా మధ్య రాకపోకలు సాగిస్తున్న అన్మోల్ బిష్ణోయ్‌ను ఇటీవల కెనడా అధికారులు అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అతడి వద్ద ఫోర్జరీ చేసిన రష్యా పాస్‌పోర్టు ఉన్నట్లు సమాచారం. ఇతడి తలపై రూ.10 లక్షల రివార్డును ఎన్‌ఐఏ ప్రకటించింది. 2022లో జరిగిన పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులోనూ ఇతడి పేరు బయటకు వచ్చింది. 2024 అక్టోబర్ 12వ తేదీ రాత్రి ముంబైలోని బాంద్రా ప్రాంతంలో తన కుమారుడు జీషన్‌తో కలిసి ఉండగా మాజీ మంత్రి బాబా సిద్దిఖీని దుండగులు కాల్చి చంపడం తెల్సిందే.


