పేలుడు పదార్థాలు తరలిస్తుంటే పొరపాటున పేలిందన్న ఊహాగానాలు పటాపంచలు
ఉద్దేశపూర్వకంగా ఉమర్ ఆత్మాహుతి బాంబర్‌గా మారినట్లు ఆధారాలు లభ్యం
సెల్ఫీవీడియోలో విస్మయకర విషయాలు
ఇస్లాంలో ఆత్మహత్యను పాపమని పేర్కొన్నా తనది మాత్రం బలిదాన ఆపరేషన్ అంటూ సమర్థన
10 రోజుల ఎన్‌ఐఏ కస్టడీకి ఢిల్లీ పేలుడు కుట్రదారు జసీర్
న్యూఢిల్లీ: కారుబాంబు పేలుడు ప్రమాదవశాత్తు జరగలేదని డాక్టర్ ఉమర్ నబీ చారిత్రక ఎర్రకోట సమీపంలో అమాయకులపై జరిపిన ఉద్దేశపూర్వక ఆత్మాహుతి దాడి అని ఎట్టకేలకు నిర్ధారణ అయింది. వైద్యుల ముసుగులో ఉన్న తోటి ఉగ్రవాదుల అరెస్ట్‌లతో తాను కూడా పట్టుబడతానన్న భయంతో పారిపోతుండగా పేలుడుపదార్థం పేలిపోయిందన్న వాదనల్లో వాస్తవంలేదని రూఢీ అయింది. తాను ఆత్మాహుతికి తెగించబోతున్నట్లు డాక్టర్ నబీ స్వయంగా చెప్పిన సెల్ఫీ వీడియో ఒకటి మంగళవారం బయటికొచ్చింది. దీంతో ఢిల్లీ ఘటన ముమ్మాటికీ ఉగ్రవాది ఆత్మాహుతి దాడి అని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ప్రకటించింది.
తనది ఆత్మహత్య కాదని, బలిదాన ఆపరేషన్ అని ఉమర్ తన ఉగ్రదుశ్చర్యను సమర్థించుకోవడం ఆ వీడియోలో కనిపించింది. సంబంధిత వీడియో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను జమ్మూకశ్మీర్ పోలీసులు ఎట్టకేలకు సంపాదించారు. ఉమర్ నబీ సోదరుడు జహూర్ ఇలాహీని విచారించగా ఈ మొబైల్ సంగతి వెల్లడించాడు. తన గురించి వినకూడదని వార్త ఏదైనా విన్న వెంటనే ఈ ఫోన్‌ను నీటిలో పడేసెయ్ అని ఉమర్ సూచించాడని ఇలాహీ పోలీసులకు వెల్లడించాడు. పాక్షికంగా ధ్వంసమైన ఫోన్ నుంచి ఫోరెన్సిక్ నిపుణులు డేటాను వెలికితీయగా అందులో ఈ సెల్ఫీ వీడియో దొరికింది.
శ్రీనగర్ సీనియర్ ఎస్పీ సుందర్ చక్రవర్తి సారథ్యంలోని బృందం ఇలాహీని తమదైన రీతిలో ప్రశ్నించడంతో ఫోన్ సంగతి తెల్సింది. ఉమర్ అక్టోబర్ 26 నుంచి నాలుగురోజులపాటు సొంతూరిలో గడిపిననప్పుడు ఈ ఫోన్‌ను సోదరునికి ఇచ్చి వెళ్లాడు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్‌ఐఎస్), అల్‌ఖైదా ఉగ్రసంస్థలు గతంలో జరిపిన ఆత్మాహుతి దాడులకు సంబంధించిన వీడియోలను ఉమర్ విపరీతంగా చూసేవాడని ఫోన్‌డేటా విశ్లేషణతో తేలింది. ఆత్మాహుతి దాడులకు సంబంధించిన సైతం ఉమర్ గతంలో ఎన్నో సెల్ఫీ వీడియోలు తీసినట్లు వెల్లడైంది. ఆత్మాహుతి దాడులు అనేవి ఇస్లాంలో ఎన్నో ప్రశంసలను అందుకున్నాయని ఉమర్ భావించవాడు. ఈ వీడియోలు ఈ ఏడాది ఏప్రిల్‌లో రికార్డ్‌చేసినట్లు తెలుస్తోంది.
ఉమర్ ఇంట్లో ల్యాబ్
ఫరీదాబాద్ సమీపంలో ఉమర్ నివసించిన ఇంట్లో ఒక లేబొరేటరీని దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. పేలుడు పదార్థాలను అతిచిన్న మొత్తాల్లో పేల్చి వాటి తీవ్రతను అంచనావేయడానికి ఈ ల్యాబ్‌ను ఉమర్ ఉపయోగించేవాడు. టెలిగ్రామ్ యాప్ ద్వారా సత్సంబంధాలు నెరుపుతున్న పాకిస్తాన్ హ్యాండ్లర్ ద్వారా నేర్చుకున్న బాంబు తయారీ కిటుకులను ఉమర్ ఈ ల్యాబ్‌లోనే పరీక్షించేవాడని తెలుస్తోంది. ఎర్రకోట వద్ద పేల్చిన బాంబును ఇదే ల్యాబ్‌లో ఉమర్ తయారుచేసినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. రసాయనాలను పరీక్షించడం మొదలు ట్రిగ్గర్ మెకానిజంపై పట్టుసాధించేదాకా అన్నీ ఈ ల్యాబ్‌లోనే ఉమర్ నేర్చుకున్నట్లు తెలుస్తోంది. హ్యాండ్లర్లు ఫైసల్, హషీమ్, ఉకాసాలతో డాక్టర్ ఉమర్, డాక్టర్ ముజామిల్, డాక్టర్ ఆదిల్ రాఠార్‌లు టెలిగ్రామ్ యాప్‌లో దాడి ప్రణాళికపై చర్చించేవారు.
ఉమర్ ఉగ్రావేశ వీడియో..
ఉమర్ ఉగ్రోన్మాదంతో చేసిన సెల్పీ వీడియోలో తన సూసైడ్ అమరత్వానికి సంబంధించినదని, ఇది సమర్థనీయమంటూ తన హేయమైన చర్యను సమర్థించుకునే ప్రయత్నంచేశాడు. అయితే తన సిద్ధాంతంపై తనకే స్పష్టమైన అవగాహన లేకపోవడంతో తడబడుతూ మాట్లాడటం ఆ వీడియోలో కనిపించింది. ఉగ్రావేశంతో దాదాపు రెండు నిమిషాలపాటు ఉమర్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఎలాంటి స్పష్టమైన ముగింపు లేకుండానే రికార్డింగ్‌ను అర్ధంతరంగా ఆపేసినట్లు కన్పిస్తోంది. ‘‘ ఆత్మాహుతి బాంబు దాడులను కేవలం సూసైడ్ అనే కోణంలో చూడకూడదు. అవి అమరత్వానికి బలమైన తార్కాణాలు. నాది బలిదాన ఆపరేషన్. బలిదాన ఆపరేషన్లను వీరమరణాలుగా భావించాలి. ఇలాంటి చర్యలకు పాల్పడటం ఆమోదనీయమే.
జిహాద్ పవిత్ర యుద్దంలో ఇవి అత్యున్నతమైనవి. అందరూ అనుకుంటున్నట్లు సూసైడ్ బాంబింగ్ అనేది తప్పుడు చర్య కాదు. ఇస్లాంలోనూ సూసైడ్ ప్రస్తావన ఉంది. అయితే సూసైడ్‌పై ఇస్లాంలోనూ ఎన్నో భిన్నా భిప్రాయాలు, అభిప్రాయ భేదాలు ఉన్నాయి. అయితే ఎవరైనా వ్యక్తి ఏదో ఒక రోజు తప్పకుండా మరణించాల్సిందే ఇది తథ్యం అనే నిర్దారణకు వచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా వెళ్లాలని బలంగా నమ్ముతాడు. తనకు నచ్చినప్పుడే తనవు చాలిస్తానని ఆశిస్తాడు. అయితే ఎప్పుడు, ఎక్కడ ఎలా చనిపోతామో ఎవరికీ తెలీదు.
విధిరాత ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. చావుకు ఎప్పుడూ భయపడకూడదు. ఇస్లాంలో ఆత్మహత్య అనేది పాపం అని నాక్కూడా తెలుసు. కానీ వీరమరణం, బలిదానం, అమరత్వం కోణంలో చూస్తే ఆత్మాహుతి బాంబింగ్ అనేది ఏ రకంగానూ తప్పుకాదు’’ అని వీడియోలో ఉమర్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ వీడియోలో సామాజికమాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
అల్‌ఫలాహ్ గ్రూప్ ఛైర్మన్ అరెస్ట్
న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు ఆర్థిక సాయం ఆరోపణలపై నమోదైన మనీ లాండరింగ్ కేసులో అల్–ఫలాహ్ గ్రూప్ చైర్మన్ జావేద్ అహ్మద్ సిద్ధిఖీని ఈడీ అధికారులు మంగళవారం అరెస్ట్‌చేశారు. తర్వాత ఆయనను రిమాండ్ కోసం సంబంధిత కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు ఢిల్లీ–ఎన్‌సీఆర్ పరిధిలో అల్–ఫలాహ్ వర్సిటీకి సంబంధించిన ప్రాంగణాల్లో మంగళవారం ఈడీ ముమ్మర తనిఖీలుచేసింది. వర్సిటీ ప్రమోటర్లు, ట్రస్టీల ఇళ్లలో సోదాలు చేసింది. ఉదయం 5.15 గంటలకే 25 ప్రాంతాల్లో సోదాలు చేసి రూ.48 లక్షల నగదును స్వా«దీనంచేసుకున్నారు.
వర్సిటీకి నిధులు, డొల్ల కంపెనీల నుంచి పెట్టుబడులు, విరాళాల కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఈడీ అధికారి ఒకరు తెలిపారు. అల్‌ఫలాహ్ గ్రూప్‌తో సంబంధమున్న 9 డొల్ల కంపెనీలు ఒకే అడ్రస్‌తో నమోదయ్యాయని ఈడీ పేర్కొంది. వర్సిటీ, ట్రస్ట్‌కు సంబంధించిన కొన్ని కీలక పత్రాల్లో డైరెక్టర్లు/ఉన్నతాధికారుల సంతకాలు లేవని, సిబ్బంది వేతనాల ఈపీఎఫ్‌ఓ/ఈఎస్‌ఐ వంటి వివరాలు అప్‌డేట్ చేయట్లేదని, కేవైసీలు పూర్తిగా లేవని ఈడీ దర్యాప్తులో తేలింది. ఉమర్‌తో పాటు సహకుట్రదారుగా ఉన్న జసీర్ బిలాల్ వానీని మంగళవారం ఢిల్లీలోని ప్రధాన జిల్లా, సెషన్స్ కోర్టు జడ్జి అంజూ బజాజ్ ఛంద్నా ఎదుట ఎన్‌ఐఏ ప్రవేశపెట్టింది. మరింత లోతుగా ప్రశ్నించేందుకు బిలాల్‌ను తమకు 10 రోజులపాటు అప్పగించాలని కోర్టును ఎన్‌ఐఏ కోరగా అందుకు న్యాయమూర్తి అంగీకరించారు.


