జైపూర్: గణతంత్ర దినోత్సవం ముందు రోజు దేశంలో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. రాజస్థాన్‌లో 10వేల కిలోల పేలుడు పదార్థాలు, డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ తరహా పేలుడు పదార్థాలను ఇటీవల ఢిల్లీ ఎర్రకోట కారు పేలుళ్లకు ఉపయోగించినట్లు పోలీసులు నిర్ధారించారు.
హార్సౌర్ గ్రామంలో శనివారం రాత్రి పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో 9,550 కిలోల అమోనియం నైట్రేట్‌ను 187 సంచుల్లో నింపి ఒక పొలంలో దాచినట్లు గుర్తించారు. నాగౌర్ జిల్లా జిల్లా ఎస్పీ మృదుల్ కచ్చావా ఈ వివరాలను వెల్లడించారు.
అమోనియం నైట్రేట్ గతంలో అనేక పేలుళ్లలో ఉపయోగించినట్లు తెలిపారు. ముఖ్యంగా, 2025 నవంబర్‌లో ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు కేసులో ఈ రసాయనం కీలక పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తుచేశారు. హార్సౌర్ గ్రామానికి చెందిన సులేమాన్ ఖాన్ను పోలీసులు సంఘటనా స్థలంలోనే అరెస్ట్ చేశారు. అతనిపై ఇప్పటికే మూడు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు.
అమోనియం నైట్రేట్‌తో పాటు పోలీసులు భారీగా పేలుడు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు.తొమ్మిది కార్టన్ల డిటోనేటర్లు,12 కార్టన్లు, 15 బండిల్స్ బ్లూ ఫ్యూస్ వైర్లు, 12 కార్టన్లు, ఐదు బండిల్స్ రెడ్ ఫ్యూస్ వైర్లు ఉన్నట్లు తేలింది. ప్రాథమిక విచారణలో సులేమాన్ ఖాన్ అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు పేలుడు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ఎక్స్‌ప్లోజీవ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
గణతంత్ర దినోత్సవానికి ముందు ఇంత భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడటం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన ఉగ్రకుట్రలపై భద్రతా సంస్థలు మరింత అప్రమత్తంగా ఉన్నాయని సూచిస్తోంది.


