సందర్భం
రాజ్యాంగ పరిషత్‌లో 1949 నవంబర్ 26న ఆమోదించుకొని శాసనంగా రూపొందించుకొన్న భారత రాజ్యాంగం, 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. ప్రపంచ దేశాల్లోని రాజ్యాంగాలను అధ్యయనం చేసి రెండేళ్ల 11 నెలల 11 రోజుల సుదీర్ఘ కసరత్తు చేశాక బి.ఆర్. అంబేడ్కర్ నేతృత్వంలోని కమిటీ దేశానికి ఓ ఆదర్శ ప్రాయమైన రాజ్యాంగాన్ని అందించింది. భారత రాజ్యాంగంలో పేర్కొన్న స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమానత్వ భావనలను ఫ్రెంచ్ రాజ్యాంగం స్ఫూర్తిగా తీసుకొన్నారు. పంచవర్ష ప్రణాళికలను రష్యా నుంచి, మార్గదర్శక సూత్రాలను ఐర్లాండ్ నుంచి, సుప్రీం కోర్టు విధివిధా నాలను జపాన్ నుంచి స్వీకరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగించే పరిపాలనకు రాజ్యాంగమే మార్గదర్శి. చట్టాల రూపకల్పనకు దిక్సూచి. దేశ ప్రజలకు రాజ్యాంగం అనేక హక్కుల్ని కల్పించింది. బాధ్యతలను అందించింది. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛతోపాటు, ప్రభుత్వాలు చేసిన హామీలను, చేసిన చట్టాల అమలులో లోపాల్ని సవాలు చేసే హక్కును రాజ్యాంగం కల్పించింది.
ప్రపంచంలోని అనేక దేశాలు రాజకీయ, సామాజిక అస్థిరతలతో కుప్పకూలాయి. కానీ, ఎంతో విశాలమైనదీ, అతి పెద్ద జనాభాతో కూడి అనేక భిన్న సంస్కృతులు, భాషలు, వర్గాలు,సంప్రదాయాలు కలిగి ఉన్నప్పటికీ ‘భిన్నత్వంలో ఏకత్వం’లా సుదృఢంగా భారతదేశం 8 దశాబ్దాలుగా నిలబడగలిగిందంటే నిస్సందేహంగా మనకున్న అతి గొప్పదైన రాజ్యాంగమే కారణం. రాజ్యాంగం కేవలం ఒక నియమాల సంకలనం కాదు. సమసమాజ నిర్మాణం లక్ష్యంగా ముందుకు దారిచూపే ఓ ‘దీపం’. దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలోకి నడిపించాలో నిరంతరం గుర్తు చేసే ఓ దార్శనిక పత్రం.
ప్రవేశిక ప్రాధాన్యం
రాజ్యాంగ ప్రవేశిక భారతదేశాన్ని సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాతంత్ర, గణతంత్ర రాజ్యంగా ఉండాలని నిర్దేశించింది. ప్రవేశికలో ‘భారత ప్రజలమైన మేము’ అనే వాక్యంతో మొదలుపెట్టి ‘ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకొంటున్నాము’ అని ఉంటుంది. భారత రాజ్యాంగం దేశంలో ఏ ఒక్క వర్గానిదో, మతానిదో కాదు. కులం, మతం, వర్గం, భాష, లింగ వివక్ష, విద్య... ఇంకా ఇతర ప్రమాణాలతో నిమిత్తం లేకుండా దేశంలోని ప్రతి ఒక్కరి సమానత్వం కోసం ఏర్పరిచింది. సార్వభౌ మత్వం అంటే అర్థం ప్రజలు మాత్రమే సర్వాధికారులు. ప్రభుత్వా లన్నది ప్రజలకు సేవ చేయడానికి ఉనికిలో ఉంటాయి. ప్రభుత్వాల అధికారాలన్నీ ప్రజల చేత, ప్రజల తరఫున, ప్రజల కోసం పాలించ డానికి ఇవ్వబడేవే!
రాజ్యాగం గొప్పదైనంత మాత్రాన ఆశించిన ఫలితాలు అంద వని ముసాయిదా ప్రతిని సమర్పించి 1949 నవంబర్ 26న చేసిన చరిత్రాత్మక ప్రసంగంలోనే అంబేడ్కర్ పేర్కొన్నారు. ‘‘రాజ్యాంగం ఎలా పని చేస్తుందన్నది దాని స్వభావంపై ఆధారపడిలేదు. శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ అనే అంగాలను మాత్రమే రాజ్యాంగం ప్రసాదించింది. ప్రజలు, రాజకీయ పార్టీలు ఎలాంటి ఆకాంక్షలను, రాజకీయాలను కోరుకొంటున్నారన్న దానిపైనే వాటి పనితీరు ఆధారపడి ఉంటుంది’’ అంటూ స్పష్టం చేశారు.
మంచీ... చెడూ...
రాజ్యాంగబద్ధమైన పాలనలో దేశం కొన్ని మైలురాళ్లు చేరుకున్న మాట వాస్తవం. 1947లో దేశ ప్రజల సగటు ఆయుష్షు 32 సంవత్సరాలు మాత్రమే. ఇప్పడు అది 72 సంవత్సరాలకు పెరిగింది. అక్షరాస్యత 16% నుండి 80 శాతానికి చేరింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి 35.773 కోట్ల టన్నులకు పెరిగింది. 1947లో కేవలం 1,500 గ్రామాలకు మాత్రమే విద్యుదీకరణ జరగగా ఇప్పుడు దాదాపుగా ప్రతి గ్రామానికీ విద్యుత్ సౌకర్యాలు ఏర్పర్చు కోగలిగాము. రహదారుల నిర్మాణం కూడా 4 లక్షల కిలోమీటర్ల నుంచి నేడు 60 లక్షల కిలోమీటర్లకు చేరుకోగలిగాము. అంటరాని తనం చట్టపరంగా తొలగించబడింది. దళితులు, గిరిజనులపై జరిగే అకృత్యాల నుండి పరిరక్షించే చట్టాలు రూపొందించబడ్డాయి. వివక్షకు గురైన వర్గాల ప్రజలకు విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆహారం, సమాచారం హక్కుగా కల్పించబడ్డాయి. నిరాదరణకు గురైన సామా జిక వర్గాల నుంచి వచ్చిన వ్యక్తులు రాష్ట్రపతులుగా, ముఖ్యమంత్రు లుగా, న్యాయమూర్తులుగా నియమించబడటం చెప్పుకోదగిన మార్పు. అల్ప సంఖ్యాక వర్గాలకు చెందినవారి సంస్కృతి, మతపర విశ్వాసాలకు చట్టపరంగా రక్షణలు కల్పించడం జరిగింది.
అయితే, రాజ్యాంగం కల్పించిన మహత్తర అవకాశాలను పూర్తి స్థాయిలో ఈ 8 దశాబ్దాల రాజకీయ నాయకత్వం సద్వినియోగం చేసుకోలేకపోయిందనడం ఓ చేదు వాస్తవం. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల స్ఫూర్తి అమలు కాలేదు. ఫలితంగానే, దేశ సంపద కొద్దిమంది వ్యక్తుల గుప్పిట్లోకి పోయింది. 90 శాతం సంపద 10 శాతం మంది వద్ద పోగుపడింది. ధనికులు మరింత ధనికులు కాగా, పేదలు మరింత పేదలు అవుతున్నారు. విధానపరమైన వైఫల్యాలే దేశాభివృద్ధికి అవరోధంగా మారుతున్నాయి. రాజ్యాంగం ద్వారా రూపొందించే సంస్థలలో ప్రజా భాగస్వామ్యం, పాత్ర తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
అవగాహన పెరగాలి!
రాజ్యాంగంలో ఏర్పర్చుకొన్న సంక్షేమ రాజ్యస్థాపన లక్ష్యాలకు దూరంగా ప్రభుత్వాలు జరగడంతోనే ఈ సమస్యలు ఉత్పన్న మవుతున్నాయి. ఏటా ప్రవేశపెడుతున్న లక్షల కోట్ల బడ్జెట్లలో సంక్షేమానికి కేటాయింపులు నామమాత్రంగా ఉంటున్నాయి. ఇవి ప్రాధాన్య రంగాల స్థాయి నుంచి మొక్కుబడి స్థాయికి దిగజారి పోయాయి. ప్రభుత్వాలకు ఆదాయం ప్రజల పన్నుల ద్వారా సమకూరుతున్నదే. పన్నుల్లో ఎంతమేరకు తిరిగి ప్రజల సంక్షేమానికి ఖర్చు చేస్తున్నారో లెక్కలు తీస్తే సామాన్య ప్రజలకు జరుగుతున్న అన్యాయం అర్థం అవుతుంది.
సామాజిక న్యాయం జరగకపోతే రాజ్యాంగం ఆశించిన తీరులో అభివృద్ధి జరగదు. రాజ్యాంగ సూత్రాల స్ఫూర్తితో పని చేస్తేనే పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి సాధ్యపడతాయి. అధికార వికేంద్రీకరణ జరగాలి. అన్ని వర్గాల ప్రజలను సాధికారుల్ని చేయగలిగితేనే... భారత రాజ్యాంగం ఆశించిన మేరకు ఫలితాలు అందుతాయి. భారత రాజ్యాంగాన్ని ఓ సోషల్ డాక్యుమెంట్‌గా అమలు చేసినప్పుడే ప్రజల మధ్య ఉన్న ఆర్థిక, సామాజిక అంత రాలు తగ్గుతాయి. రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన ఏర్పర్చుకోవాలి. రాజ్యాంగం అందించిన హక్కులను ఉపయోగించుకొని ప్రభుత్వాలను నిలదీయాలి.

డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, ఏపీ శాసన పరిషత్ సభ్యులు
(నేడు గణతంత్ర దినోత్సవం)


