అభిప్రాయం
అమెరికా గత నవంబర్‌లో ప్రకటించిన ‘జాతీయ భద్రతా వ్యూహ’ పత్రాన్ని చది విన వారికి, ఆ తర్వాత నుంచి అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్న తీరును గమనించి నప్పుడు, ఆ వ్యూహాన్ని అమలు పరచవలసింది ఇట్లాగేనా అనే సందేహం కలుగు తుంది. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ (మాగా) అనే లక్ష్యంతో రూపొందించిన ఆ సమగ్ర వ్యూహం అమలులో చాకచక్య మైన దౌత్య నైపుణ్యాన్ని, ఓర్పును ప్రదర్శించాలి. అమెరికా ఆధిపత్యానికి 21వ శతాబ్దం ఆరంభం నుంచి అనేక సవాళ్లు ఎదురవుతున్న స్థితిలో, తమ దేశాన్ని ‘తిరిగి గొప్పదిగా’ చేయదలచుకునే నాయకత్వం అటువంటి నీతిని అనుసరించని పక్షంలో, ఉన్న సవాళ్లు పరిష్కారం కాకపోగా కొత్తవి తలెత్తక తప్పదు.
ట్రంప్ చాణక్యనీతికి బదులు ధూర్తనీతికి పాల్పడుతున్నందున ప్రస్తుతం జరుగుతున్నది అదే. అందుకు వెనిజులా, గ్రీన్‌ల్యాండ్, యూరప్, కెనడా, ఇండియా వంటి కొన్ని ఉదాహరణలను గమనించినా, ఆయన నాయకత్వాన అమెరికా ‘తిరిగి గొప్పది’ కావటం అట్లుంచి మరింత వేగంగా తన గొప్పతనాన్ని కోల్పోక తప్పదనే అభిప్రాయం కలుగుతుంది. గ్రీన్‌ల్యాండ్‌కు సంబంధించి జరుగుతున్నది ప్రపంచాన్ని ఆశ్చర్యపరచటం అట్లుంచి, అమెరికా మిత్ర ప్రపంచంలోనే కల్లోలాన్ని సృష్టిస్తున్నది.
చివరకు విషయం ఎటు తేలినా, ఆ మిత్ర ప్రపంచంతో పాటు తక్కిన ప్రపంచం దృష్టిలోనూ ట్రంప్ పట్ల విశ్వసనీయత మాత్రం తీవ్రంగా దెబ్బతింటున్నది. ఒక వ్యూహం విజయవంతం కావాలంటే కేవలం అమెరికాకు గల ఆర్థిక బలం, మార్కెట్ బలం, సైనిక బలం చాలవు. వాటితో పాటు శాస్త్ర, సాంకేతిక బలం ఉండి కూడా గత పాతికేళ్ళుగా సవాళ్ళు పెరగటం లేదా? కనుక కావలసింది దేశాలతో విశ్వసనీయత, సత్సంబంధాలు. కేవలం బలాలను ఉపయోగించి ఇతరులను బెదిరించే కాలం గతించి పోయిందని సాక్షాత్తూ ‘వ్యూహ’ పత్రమే అంగీకరిస్తున్నది. అయినప్పటికీ ట్రంప్ తన తీరును మార్చుకోక పోవటం ఆశ్చర్యకరం.
మొత్తంగా వశమైతేనే...
గ్రీన్‌ల్యాండ్ విషయం ముందు చూద్దాం. యూరప్‌లోని డెన్మార్క్‌కు చెందిన ఆ ద్వీపపు రక్షణ, అక్కడి వనరులు ఆ ప్రాంతాల కోసమో, యూరప్ కోసమో అవసరమనీ, వాటిని రష్యా, చైనాల బారిన పడకుండా కాపాడాలనీ ట్రంప్ భావిస్తున్నట్లయితే, ఆ ప్రకారం గ్రీన్‌ల్యాండ్, డెన్మార్క్, యూరోపియన్ యూనియన్‌లతో చర్చలు జరిపి తగిన ఉమ్మడి విధానాన్ని రూపొందించవచ్చు. కానీ ఆయన గ్రీన్‌ల్యాండ్ భూభాగం, అక్కడి వనరులు, దాని రక్షణ ‘అమెరికా ప్రయోజనాల కోసం తప్పక అవసర’మని బాహాటంగా ప్రకటిస్తున్నారు. అందుకు గ్రీన్‌ల్యాండ్, డెన్మార్క్, యూరప్‌లలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుండగా, ‘అంగీకరిస్తారా, సైన్యాన్ని పంపమంటారా’ అని భయపెట్టజూస్తున్నారు. ఒత్తిడి చేసేందుకు ఈ నెల 17న 10 శాతం సుంకాలు ప్రకటించి, వాటిని జూలై నుంచి 25 శాతానికి పెంచగలనని హెచ్చరించారు.
అమెరికాను ‘తిరిగి గొప్పది’ చేయగల దౌత్యనీతి, ఆర్థిక విధానం ఇవేనా అన్నది ప్రశ్న. అది కూడా ‘నాటో’ కూటమిలో తన సహచరులై, రాగల కాలంలో తమతో తప్పక నిలవవలసిన దేశాలంటూ ‘వ్యూహ పత్రం’లో తామే ప్రకటించిన వారిపట్ల చూపవలసిన వైఖరి? వాస్తవానికి గ్రీన్‌ల్యాండ్‌లో అమెరికన్ సైనిక స్థావరాల నిర్మాణం, వాటి విస్తరణ కోసం డెన్మార్క్‌తో 1951లోనే ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందపు పాఠాన్ని చూసిన వారికి, అక్కడ ఏమి చేయాలన్నా డెన్మార్క్‌తో ‘సంప్రదింపులు’ జరపాలనే నిబంధన తప్ప వారి ‘అంగీకారం’ కావాలనే షరతు కనిపించదు.
అనగా అంతటి స్వేచ్ఛ అమెరికాకు ఉందని స్పష్టమవుతుంది. అమెరికన్లు అక్కడ గతంలోనే ఒక ఉపరితల స్థావరం, ఒక భూగర్భ అణుశక్తి స్థావరం నిర్మించారు కూడా! కానీ ఇవేవీ చాలవని, గ్రీన్‌ల్యాండ్ ‘పూర్తిగా స్వాధీనమైతేనే దాని రక్షణకు తగిన మానసిక స్థితి’ తనకు కలుగుతుందని ట్రంప్ ఆశ్చర్యకరంగా వాదిస్తున్నారు. ఆ ప్రాంతంలోని రష్యా, చైనా యుద్ధ నౌకలున్నాయని, వారు మైనింగ్ జరుపుతూ వనరులను కొల్లగొడుతున్నారనే మాటలు ఎంతమాత్రం నిజం కాదని గ్రీన్‌ల్యాండ్, డెన్మార్క్‌లు స్పష్టం చేస్తున్నా లెక్క చేయటం లేదాయన.
మిత్రులు సైతం దూరం
గ్రీన్‌ల్యాండ్ విషయం అట్లుంచి కూడా, ముఖ్యంగా చైనా సవాలు గురించి ‘వ్యూహపత్రం’లో సుదీర్ఘంగా చేసిన చర్చలో, యూరప్ తిరిగి శక్తిమంతం కావటం, రష్యా–యూరప్‌ల మధ్య రాజీ, అమెరికాతో సంబంధాల అభివృద్ధి వంటి తనదైన దార్శ నికతను చూపిన ట్రంప్, ఆచరణలో అందుకు తగిన దౌత్యపరిణతిని ప్రదర్శించటానికి బదులు, అంతకుముందు వలెనే, ఈ ‘పత్రం’ ప్రకటన తర్వాత సైతం ధూర్త దౌత్యాన్నే ప్రయోగిస్తున్నారు. ఉక్రె యిన్ యుద్ధం, సుంకాల విధింపు దరిమిలా యూరోపియన్ యూని యన్‌కు అమెరికాతో ఇప్పటికే పేచీలున్నాయి.
ముఖ్యంగా వాణిజ్య వివాదాల కారణంగా వారు అమెరికా నుంచి చైనా వైపు మళ్లటం మొదలైంది. చైనాను వ్యతిరేకిస్తూ వచ్చిన కెనడా ప్రధాని మార్క్ కార్నీ... అమెరికా నమ్మదగ్గ భాగస్వామి కాదనీ, చైనా నమ్మదగ్గదనీ బహిరంగంగా ప్రకటిస్తూ, గత వారమే బీజింగ్‌కు వెళ్లి భారీ వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నారు. చైనా ఎలక్ట్రికల్ కార్ల దిగుమతిపై సుంకా లను 100 శాతం ఎత్తివేయటం వాటిలో ఒకటి. రానున్న కొద్ది నెలల్లో మరికొందరు యూరోపియన్ ప్రభుత్వాధినేతల పర్యటనలు కూడా ఖరారయ్యాయి.
అమెరికాకు అన్నివిధాలా సన్నిహితమైన యూరప్ పరిస్థితి ఇది కాగా, తక్కిన ప్రపంచ దేశాల ఆలోచనలు ఏమిటో ఊహించవచ్చు. అటు తూర్పున అమెరికాకు ఇంతే సన్నిహితమైన దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ మ్యూంగ్ కూడా ఈ నెల మొదటి వారంలో చైనా వెళ్లి ఒప్పందాలు చేసుకోవటం గమనించదగ్గది. ఇంతకూ ట్రంప్ ‘వ్యూహ పత్రం’, దాని అమలు తీరు, అమెరికా పట్ల దాని మిత్ర దేశాల విశ్వాసం పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న. తనకు ‘మాగా’, ‘అమెరికా ఫస్ట్’తో తప్ప అంతర్గతంగా గానీ, అంతర్జాతీయంగా గానీ ఏ నియమ నిబంధనలతో నిమిత్తం లేదని బాహాటంగా ప్రక టించిన ట్రంప్ 33 పేజీల ‘వ్యూహ పత్రాన్ని’ పరిశీలిస్తే అర్థమయ్యేది ఏమిటి? ఒక్క మాటలో చెప్పాలంటే, మిత్రులా, ప్రత్యర్థులా అనే దానితో నిమిత్తం లేకుండా అందరినీ అమెరికా ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలి. అందుకోసం సామ దాన భేద దండోపా యాలు అన్నింటినీ ప్రయోగించగలమనే సూచనలు కూడా ఆ పత్రంలో దండిగానే ఉన్నాయి.
వాడుకొని వదిలెయ్!
ఇండియా గురించి కూడా ‘వ్యూహ పత్రం’లో రాసిన మాట లన్నింటి సారాంశం ఇదే. ఒకవైపు వాణిజ్యం, మరొకవైపు ఇండో– పసిఫిక్‌లో సైనిక వ్యూహాల విషయంలో భారతదేశాన్ని తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేందుకు ట్రంప్ గత ఏడాదిగా చేస్తూ వస్తున్నదేమిటో చూస్తూనే ఉన్నాము. ఇపుడు ఈ ‘పత్రం’ మూలంగా అర్థం చేసుకోవలసిందేమంటే, ‘ఉపయోగించుకో – ఒత్తిడి చెయ్ – ఉపయోగించుకో – వదిలెయ్’ విధానం ఇండియాకు సంబంధించి రాగల కాలంలో కూడా కొనసాగుతుందన్నమాట. వ్యూహ పత్రాల రూపంలో ప్రకటించినా, లేకున్నా సామ్రాజ్యవాద విధానాలు ఎప్పుడూ ఇవే!
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు


