దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ప్రస్తుతం స్వాతంత్ర్య ఫలాలు అనుభవిస్తున్నారని ముర్ము అన్నారు. మన రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శమని ప్రజాస్వామ్యం ఎన్నో సవాళ్లను అధిగమించిందని తెలిపారు. అభివృద్ధి ఫలాలు దేశ ప్రజలకు అందుతున్నాయని విద్య, వైద్య రంగాల్లో దేశం ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని ముర్ము పేర్కొన్నారు.
మన రైతులు దేశానికి అవసరమైన పోషకాహారాన్ని సమృద్దిగా అందిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌కు ఘన విజయం అందించిన త్రివిధ దళాలను ముర్ము ప్రశంసించారు. రాజ్యాంగ నిర్మాతలు నిబంధనలు ద్వారా జాతీయవాద స్ఫూర్తికి దేశ ఐక్యతకు బలమైన పునాదిని అందించారని, ప్రస్తుతం భారత ప్రజలమైన మనము గణతంత్ర దినోత్సవాన్ని దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. భారత గణతంత్ర ఉత్సవాలు దేశ భూత, వర్తమాన, భవిష్యత్తు పరిస్థితులకు అద్దం పడుతాయన్నారు.
1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడం దేశ పరిస్థితిని పూర్తి స్థాయిలో మార్చి వేసిందని ఈ ముర్ము పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమిళ భాషలో వందేమాతరం యోన్బోమ్ అనే గీతాన్ని స్వరపరిచిన జాతీయవాద కవి సుబ్రమణ్య భారతిని ద్రౌపది ముర్ము ప్రశంసించారు.


