తమిళగ వెట్రి కజగం అధినేత విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జరిగే పోరాటం కేవలం అధికారం కోసం కాదని ప్రజాస్వామ్యం కోసం జరిగే పోరని అన్నారు. ఆదివారం తమిళనాడు మహాబలిపురంలో జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో విజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్ ప్రణాళికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
తమిళనాడులో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పొలిటికల్ హీట్ పెరిగింది. ఫిల్మ్ స్టార్ విజయ్‌కు ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉండడంతో బీజేపీ టీవీకేతో పొత్తులు పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. అంతే కాకుండా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తమ పార్టీ అధినేతకు మంచి ఫ్రెండ్ అని టీవీకే, కాంగ్రెస్ పార్టీలు సిద్ధాంత పరంగా ఒకటేనని టీవీకే పార్టీనేత ప్రకటించడంతో కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందని ప్రచారం సైతం జరిగింది. ఈ నేపథ్యంలో టీవీకే అధినేత పార్టీ పొత్తులపై సంచలన ప్రకటన చేశారు.
బహిరంగ సభలో విజయ్ మాట్లాడుతూ "రాష్ట్రాన్ని పాలించే దుష్టశక్తిని (DMK) అవినీతిశక్తి( AIDMK) ఎదుర్కొనే సత్తా కేవలం టీవీకేకు మాత్రమే ఉంది. దుష్టశక్తి, అవినీతి శక్తి రెండు కూడా రాష్ట్రాన్ని పాలించకూడదు. టీవీకే పార్టీకి ఒంటరిగా నిలబడి గెలిచే సత్తా ఉంది". అని విజయ్ అన్నారు. రాష్ట్రంలోని రెండు ప్రధానమైన ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయం కేవలం టీవీకే పార్టీ మాత్రమేనని తెలిపారు. అనంతరం ఆ సమావేశంలో పార్టీకార్యకర్తలకు టీవీకే గుర్తు విజిల్‌ను చూపించారు. దీంతో కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.
రాష్ట్రంలోని AIADMK కేంద్రంలోని అధికార బీజేపీకి నేరుగా మద్దతిస్తుంటే డీఎంకే పరోక్షంగా సపోర్ట్ చేస్తుందని తెలిపారు. తనపై ప్రజలు ఉంచిన నమ్మకమే తనను రాజకీయాల్లోకి వచ్చేలా ప్రేరేపించిందని విజయ్ అన్నారు. తమిళ ప్రజలను రక్షించడానికే ఈ మట్టిని కాపాడడానికే తాము ఉన్నామని పేర్కొన్నారు.. అయితే ఇటీవల తమిళ స్టార్ విజయ్ ఇటీవల కరూర్ తొక్కిసలాట ఘటనలో సీబీఐ విచారణ ఎదుర్కొన్నారు. అంతే కాకుండా అయినా నటించిన జననాయగన్ సినిమా విడుదలకు పలు అవాంతరాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.


