పుట్టిన చోటే పరాభవం: కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విసుర్లు | PM Modi to lay foundation of Kaziranga elevated corridor | Sakshi
Sakshi News home page

పుట్టిన చోటే పరాభవం: కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విసుర్లు

Jan 18 2026 11:45 AM | Updated on Jan 18 2026 12:38 PM

PM Modi to lay foundation of Kaziranga elevated corridor

గౌహతి: ‘ఏ ముంబై నగరంలో కాంగ్రెస్ పార్టీ పుట్టిందో, అదే చోట నేడు ఆ పార్టీ ఐదో స్థానానికి పడిపోయింది. దేశ ప్రజలు కాంగ్రెస్ అనుసరిస్తున్న ప్రతికూల రాజకీయాలను నిరంతరం తిరస్కరిస్తూనే ఉన్నారు’ అని మోదీ ఎద్దేవా చేశారు. అస్సాంలోని కలియాబోర్‌లో జరిగే బహిరంగ సభలో  ఆదివారం ప్రసంగించిన ఆయన.. నేటి ఓటరు కేవలం మాటలు నమ్మడం లేదని, వారికి అభివృద్ధితో పాటు వారసత్వ సంపదకు తగిన గౌరవం రావాలని  కోరుకుంటున్నారని, అందుకే బీజేపీని తమ మొదటి ఎంపికగా చేసుకుంటున్నారని అన్నారు.

కజిరంగా నేషనల్ పార్క్ సందర్శన తన జీవితంలో అత్యంత మధురమైన అనుభవం అని, రెండేళ్ల క్రితం ఇక్కడ గడిపిన క్షణాలు ఇప్పటికీ గుర్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు. అస్సాంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రాష్ట్ర రూపురేఖలను మార్చేశాయని, ఇది బీజేపీ అభివృద్ధి ఎజెండాకు నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. కేవలం అస్సాం మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ సుపరిపాలనపై నమ్మకం ఉంచుతున్నారని ఆయన పేర్కొన్నారు.

 

ప్రపంచంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్లలో ఒకటైన ముంబై లో బీజేపీ చారిత్రక విజయం సాధించిందని, తొలిసారి అక్కడ అతిపెద్ద పార్టీగా అవతరించడం ప్రజల మద్దతుకు నిదర్శనమని ప్రధాని అన్నారు.కేరళలో కూడా బీజేపీ జైత్రయాత్ర కొనసాగుతోందని, తిరువనంతపురం కార్పొరేషన్‌లో తొలిసారి బీజేపీ మేయర్ పదవిని కైవసం చేసుకోవడం ఒక గొప్ప మార్పు అని అన్నారు. బిహార్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి రికార్డు స్థాయి మెజారిటీని ఇచ్చి నమ్మకాన్ని చాటుకున్నారని ప్రధాని మోదీ గుర్తు చేశారు.

ఈశాన్య ప్రాంతంతో ఇతర ప్రాంతాలకు  అనుసంధానాన్ని గణనీయంగా పెంచే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం) అస్సాంలో పలు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. గౌహతి పర్యటనలో భాగంగా రూ. 6,957 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రతిష్టాత్మక కజిరంగా ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే రెండు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. 

 

శనివారమే గౌహతి చేరుకున్న ప్రధానికి ఘన స్వాగతం లభించింది. సర్సజైలోని అర్జున్ భోగేశ్వర్ బారువా స్టేడియంలో సుమారు 10,000 మంది కళాకారులు ప్రదర్శించిన బోడో జానపద నృత్యం ‘బగురుంబా’ను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా ప్రధాని ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, ‘నాగావ్ జిల్లాలోని కలియాబోర్‌లో కీలక అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ముఖ్యంగా 35 కిలోమీటర్ల కజిరంగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం, వన్యప్రాణులను, ముఖ్యంగా వర్షాకాలంలో వరదల బారి నుండి రక్షించడంలో ఎంతో ఉపయోగపడుతుంది’ అని పేర్కొన్నారు.

పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రూపొందించిన ఈ 86 కిలోమీటర్ల  కజిరంగా ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులో 35 కిలోమీటర్ల ఎలివేటెడ్ వైల్డ్ లైఫ్ కారిడార్‌ను  కజిరంగా నేషనల్ పార్క్ మీదుగా నిర్మిస్తున్నారు. దీనితో పాటు 21 కిలోమీటర్ల బైపాస్, ఎన్‌హెచ్‌-715 జాతీయ రహదారిని రెండు లైన్ల నుండి నాలుగు లైన్లకు విస్తరించే 30 కిలోమీటర్ల పనులు కూడా ఇందులో ఉన్నాయి. నాగావ్, కర్బీ అంగ్లాంగ్,  గోలాఘాట్ జిల్లాల మీదుగా సాగే ఈ ప్రాజెక్టు ఎగువ అస్సాం, దిబ్రూగఢ్,  టిన్సుకియాలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది. జంతువుల రాకపోకలకు ఆటంకం లేకుండా చూడటం, మానవ-వన్యప్రాణుల సంఘర్షణను తగ్గించడం, మరియు జఖలబంధ, బోకాఖట్ వంటి పట్టణాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశాలు.

ఈశాన్య భారతాన్ని ఉత్తర భారతంతో అనుసంధానించే దిశగా రెండు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని ప్రారంభించారు. అవి.. గువహటి (కామాఖ్య) నుండి రోహ్‌తక్ వరకు, దిబ్రూగఢ్ నుండి లక్నో (గోమతి నగర్) వరకు నడిచే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు. ఈ కొత్త రైలు సర్వీసులు ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందిస్తాయని, తద్వారా ఈ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement