పెళ్లి పేరుతో బెంగళూరుకు చెందిన ఐటీ ఉద్యోగి దారుణంగా మోసపోయింది. నకిలీ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో పరిచయమైన వ్యక్తిని నమ్మి ఏకంగా రూ. 1.52 కోట్లు నష్టపోయింది. ఆనక విషయం తెలిసి లబోదిబోమంటూ పోలీసులు ఆశ్రయించింది. వివరాలు ఇలా ఉన్నాయి.
బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ నివాసి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నవ్య శ్రీ (29) గత ఏడాది మార్చిలో, ఒక్కలిగ మ్యాట్రిమోని ద్వారా విజయ్ రాజ్ గౌడ అలియాస్ విజేత్ బి కలిసింది. తనకు వ్యాపారం ఉందని, తనకు రూ. 715 కోట్ల ఆస్తులు ఉన్నాయంటూ నవ్యను బాగా నమ్మించాడు. దీంతోఆమె కుటుంబం, స్నేహితులు కూడా లక్షల కొద్దీ పెట్టుబడులు పెట్టారు. మరో విధంగా చెప్పాలంటే వారితో ఆ పెట్టుబడులు పెట్టేలా వారిని మభ్య పెట్టాడు. ఇలా రూ. 66 లక్షల దాకా పెట్టుబడి పెట్టాడు. వారినుంచి అప్పులు కూడా చేశాడు. వాటిని చెల్లించమని అడిగినపుడు మరో నాటకానికి తెరలేపాడు.
కోర్టు కేసు కారణంగా తన బ్యాంకుఖాతాలు సీజ్ అయ్యాయంటూ నకిలీ కోర్టు పత్రాలు చూపించాడు. అలా నవ్యశ్రీ తల్లిదండ్రులను కూడా ఒప్పించి మరో రూ. 23 లక్షలు కొట్టేశాడు. ఎంతకీ తీసుకున్న డబ్బులు చెల్లించక పోవడం, పెళ్లి ఊసు ఎత్తక పోవడంతో అనుమానం వచ్చిన నవ్యశ్రీ అతని ఇంటికి వెళ్లడంతో అతని నిజస్వరూపం బైట పడింది. విజయ్‌కి ఇప్పటికే వివాహమై ఒక బిడ్డ కూడా ఉన్నాడు. అంతేకాదు భార్య,కుటుంబంతో కలిపి ఈ మ్యాట్రిమోనియల్ కమ్ ఇన్వెస్ట్‌మెంట్ మోసానికి తెగబడ్డాడు. దీంతో నివ్వెర పోయిన ఆమె పోలీసులను ఆశ్రయించింది.
FIR ప్రకారం విజయ్ తనకు రూ.715 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని , నవ్య శ్రీని వివాహం చేసుకుంటానని నమ్మించి భారీ మోసానికి పాల్పడ్డాడు. బెంగళూరులోని రాజాజీనగర్ ,సదాశివనగర్‌లలో క్రషర్లు, లారీలు, భూమి , నివాస ఆస్తులతో పాటు VRG ఎంటర్‌ప్రైజెస్ ఉన్నాయని తానొక బిజినెస్ మేన్ అని విజయ్ తనను తాను పరిచయం చేసుకున్నాడని బాధితురాలు నవ్యశ్రీ ఆరోపించింది. 2019 ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కేసుకు సంబంధించిన బెయిల్ ఆర్డర్ కాపీని చూపించి మోసం చేశాడు. తండ్రి బిగౌడ అలియాస్ బోరే గౌడయుజె రిటైర్డ్ తహసీల్దార్ (రెవెన్యూ ఆఫీసర్) అని, తల్లి నేత్రావతి, సోదరిలను కూడా పరిచేశాడు. ఇక ఇంకో ట్విస్ట్ ఏంటీ అంటే సోదరి అని పరిచయం చేసుకున్న మహిళే అతని భార్య. మూడేళ్ల క్రితమే వీరికి పెళ్లి అయింది.
కష్టాల్లో ఉన్నానని చెప్పడంతో డిసెంబర్ 2024 , ఫిబ్రవరి 2025 మధ్య, శ్రీ తండ్రి రూ. 10.5 లక్షలు ఇచ్చాడని, ఆమె తల్లి తన పదవీ విరమణ నిధితో సహా రూ. 18 లక్షలు ఇచ్చిందని నవ్యశ్రీ తన ఫిర్యాదులో పేర్కొంది. అలాగే ఆభరణాలపైరుణం ద్వారా రూ. 10 లక్షలు, తోబుట్టువుల నుండి మరో రూ. 5 లక్షలు ఇచ్చింది. మొత్తం రూ. 1,75,66,890 తీసుకొని, కేవలం రూ. 22వేలు మాత్రమే తిరిగి ఇచ్చాడని, రూ. 1,53,15,090 చెల్లించ లేదని ఆరోపించింది. విజయ్, అతని కుటుంబం మోసం చేశారని, ఈ విషయాన్ని బైటికి చెపితే, స్నేహితులను చంపేస్తారని నవ్య తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదు మేరకు విజయ్, మరో ఇద్దరిపై మోసం, నేరపూరిత కుట్ర మరియు బెదిరింపుల కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.


