సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఎస్‌ఐ రవితేజకు కోర్టు కఠిన శిక్ష విధించింది. దీంతో, ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వివరాల ప్రకారం.. ఎస్‌ఐ రవితేజ నగరంపాలెంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడు. దీంతో, బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును గుంటూరు నాలుగో జిల్లా అదనపు న్యాయస్థానం విచారించింది. ఈ నేపథ్యంలో నిందితుడి చేసిన మోసం రుజువు కావడంతో అతడికి 10 సంవత్సరాల జైలు శిక్షను ఖరారు చేసింది. కాగా, ఎస్‌ఐ రవితేజ ప్రస్తుతం అమృతలూరు పనిచేస్తున్నాడు. అయితే, చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యతలో ఉన్న పోలీస్ అధికారి ఇలా ప్రవర్తించడం అత్యంత దురదృష్టకరమని.. బాధిత యువతికి న్యాయం జరిగిందని స్థానికులు మాట్లాడుకుంటున్నారు.


