దగ్గు మందు విషయంలో తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 'ఆల్మండ్ కిట్' దగ్గు సిరప్‌ను నిషేధించింది. దీని తయారీ, అమ్మకం, పంపిణీ , వినియోగాన్ని నిషేధించిందని రాష్ట్ర ఔషధ నియంత్రణ సంస్థ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. నిషేధాన్ని ఉల్లంఘించినట్లు తేలితే, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
బిహార్‌లో తయారయ్యే ఈ సిరప్‌లో తీవ్రమైన , కొన్నిసార్లు ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్యలను కలిగించే ఇథిలీన్ గ్లైకాల్ అనే కలుషిత పదార్థం ఉందని అధికారులు తెలిపారు. ఈ సిరప్ తీసుకోవడం వల్ల తీవ్రమైన మూత్రపిండాల వైఫల్యం, మెదడు, ఊపిరితిత్తులకు నష్టం, కొన్ని సందర్భాల్లో మరణం సంభవించవచ్చని తమిళనాడు ఔషధ నియంత్రణ డైరెక్టరేట్ హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని మెడికల్ షాపులు, డిస్ట్రిబ్యూటర్లు, ఆసుపత్రులు, ఫార్మసీలు వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలని డ్రగ్ కంట్రోల్ డైరెక్టరేట్ ఆదేశించింది. ప్రత్యేకంగా బ్యాచ్ నంబర్ AL24002ని తనిఖీ చేయాలని, ఈ సిరప్‌ను అస్సలు వాడకూడదని తెలిపింది.
ఈ సిరప్‌ను తయారు చేస్తున్నా, విక్రయిస్తున్నా, వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఫార్మసీలు, ఆసుపత్రులలో తనిఖీలు, నిఘాను ముమ్మరం చేసింది. అంతేకాదు దీనికి సంబంధించిన, సమాచారం ఫిర్యాదులు లేదా తదుపరి సూచనల కోసం, ప్రజలు డైరెక్టరేట్‌ను 94458 65400 నంబర్‌లో వాట్సాప్ ద్వారా సంప్రదించాలని అధికారులు కోరారు. ఔషధాల కొనుగోలు సమయంలో అప్రమత్తంగా ఉండాలని, లేబుల్‌లు మరియు బ్యాచ్ నంబర్‌లను జాగ్రత్తగా పరిశీలించుకోవాలని, ఏదైనా అనుమానాస్పదంగా. లేదా నాణ్యత లేని మందులను గుర్తిస్తే, వెంటనే తమకు నివేదించాలని డ్రగ్ కంట్రోల్ డైరెక్టరేట్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
ఇదీ చదవండి: రూ. 50 నుంచి రూ. 100 కోట్లకు : ఆ సినిమానే ప్రేరణ
కాగా ఇటీవలి సంవత్సరాలలో, దేశంలో కలుషితమైన ఔషధ సిరప్‌లు,ఇథిలీన్ గ్లైకాల్ లేదా డైథిలీన్ గ్లైకాల్ కలిగిన సిరప్‌ల కాలరణంగా పిల్లల మరణాలు సంభవించిన నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా నిరోధించేందుకు, సురక్షితమైన, నాణ్యమైన మందులు మాత్రమే రోగులకు చేరేలా పర్యవేక్షణ విధానాలను బలోపేతం చేస్తామని ప్రభుత్వం తెలిపింది.
ఇదీ చదవండి: మ్యాట్రిమోనియల్ స్కాం : కోట్లు నష్టపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్


