చెన్నై: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను విమర్శించిన బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై నమోదైన క్రిమినల్ కేసును మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఉదయనిధి స్టాలిన్ చేసిన ప్రసంగం వాస్తవానికి ‘విద్వేషపూరిత ప్రసంగం’ కిందకే వస్తుందని జస్టిస్ ఎస్. శ్రీమతి స్పష్టం చేశారు.
ఉదయనిధి వ్యాఖ్యలను ‘మారణహోమానికి పిలుపు’గా అభివర్ణిస్తూ మాల్వియా చేసిన పోస్ట్‌లో ఎటువంటి క్రిమినల్ నేరం లేదని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని పాటించే వారిని లక్ష్యంగా చేసుకుని మంత్రి ప్రసంగించారని, సనాతన ధర్మాన్ని అనుసరించే వ్యక్తిగా మాల్వియా కూడా ఆ వ్యాఖ్యల బాధితుడేనని కోర్టు పేర్కొంది. డీఎంకే అనుబంధ న్యాయవాది ఫిర్యాదుతో తిరుచ్చి పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కోర్టు రద్దు చేసింది.
ఉద్దేశ పూర్వకంగా మాల్వియాపై శత్రుత్వాన్ని ప్రేరేపించడం, ప్రజా అల్లర్లకు కారణమవడం తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేయడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విద్వేషపూరిత ప్రసంగం చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా, కేవలం ఆ ప్రసంగంపై స్పందించిన వారిపైననే కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలైన మూలకారకులను విస్మరించి, బాధితులపై చర్యలకు ఉపక్రమించడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది.
ద్రవిడ కజగం, డీఎంకే పార్టీలకు హిందూ ధర్మంపై ఉన్న వ్యతిరేకతను ఈ సందర్భంగా మాల్వియా తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురాగా, న్యాయమూర్తి దీనిని పరిగణనలోకి తీసుకున్నారు. ఉదయనిధి తన ప్రసంగంలో పదేపదే ఉపయోగించిన ‘ఒజిప్పు’ అనే తమిళ పదానికి నిర్మూలన లేదా రద్దు చేయడం అని అర్థమని కోర్టు విశ్లేషించింది. ఇది కచ్చితంగా జాతి నిర్మూలన లేదా సాంస్కృతిక విధ్వంసాన్ని సూచిస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది.
2023, సెప్టెంబర్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. ‘కొన్ని విషయాలను మనం కేవలం వ్యతిరేకించలేం.. వాటిని సమూలంగా నిర్మూలించాలి. డెంగ్యూ, మలేరియా, కరోనా వంటి వాటిని మనం ఎలాగైతే వ్యతిరేకించకుండా అంతం చేశామో, సనాతన ధర్మాన్ని కూడా అలాగే నిర్మూలించాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: ఐఐటీలో మరో విషాదం.. ఆ ఘటన మరువక ముందే..


