కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని ఐఐటీ కాన్పూర్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. క్యాంపస్‌లో గల ఒక భవనంలోని ఆరో అంతస్తు నుంచి దూకి 25 ఏళ్ల పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. కేవలం 23 రోజుల వ్యవధిలోనే ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో ఇది రెండో ఆత్మహత్య కావడం విద్యార్థులను, అధ్యాపకులను ఆందోళనకు గురిచేస్తోంది.
ఎర్త్ సైన్సెస్ విభాగంలో పరిశోధక విద్యార్థిగా ఉన్న రామ్‌స్వరూప్ ఇష్రామ్ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఘటన జరిగిన వెంటనే బాధితుడిని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. రాజస్థాన్‌లోని చురు జిల్లాకు చెందిన రామ్‌స్వరూప్ ఇష్రామ్, ఐఐటీ క్యాంపస్‌లోని న్యూ ఎస్‌బిఆర్‌ఏ రెసిడెన్షియల్ బ్లాక్‌లో ఉన్న ఏఏ-21 అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. భార్య మంజు, మూడేళ్ల కుమార్తెతో అతనితోపాటు ఉంటున్నారు.
మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే కళ్యాణ్‌పూర్ పోలీస్ స్టేషన్ బృందాలు, ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ప్రాథమిక విచారణలో మృతుడు గత కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు తెలిసింది. గతంలో ఆయన పలుమార్లు కౌన్సెలింగ్ కూడా తీసుకున్నారని డీసీపీ ఎస్.ఎం. ఖాసిం అబిది వెల్లడించారు.
ఈ ఘటనపై విచారణలో భాగంగా మృతుని భార్యను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ మనీంద్ర అగర్వాల్ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాగా ఐఐటీ కాన్పూర్‌లో వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. అంతకుముందు 2025, డిసెంబర్ 29న బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి జై సింగ్ మీనా తన హాస్టల్ గదిలో విగతజీవిగా కనిపించారు. రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన మీనా, బయోలాజికల్ సైన్సెస్ అండ్ బయో ఇంజినీరింగ్ చదువుతున్నారు. ఈ-బ్లాక్ హాస్టల్‌లోని గది నంబర్ 148లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని మీనా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మరువక ముందే మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది.
ఇది కూడా చదవండి: మందులకు ఏఐ సాయం.. ‘ఎయిమ్స్’ తీవ్ర హెచ్చరిక


