ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత చాట్‌బాట్‌లు ఇచ్చే సలహాలను గుడ్డిగా నమ్మి సొంత వైద్యం చేసుకోవద్దని ఢిల్లీలోని ‘ఎయిమ్స్’ రుమటాలజీ విభాగం అధిపతి డాక్టర్ ఉమా కుమార్ హెచ్చరించారు. ఇటీవల ఓ బాధితుడు ఏఐ చాట్‌బాట్ సలహాతో వివిధ మందులు వాడి, ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో డాక్లర్ ఈ అత్యవసర సలహా ఇచ్చారు.
‘హిందుస్థాన్ టైమ్స్’ నివేదిక ప్రకారం ఆన్‌లైన్ టూల్స్ ఇచ్చే సమాచారం ఆధారంగా ఆరోగ్యం విషయంలో నిర్ణయాలు తీసుకోవడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన రుజువు చేస్తున్నదని డాక్టర్ ఉమా కుమార్ సూచించారు. ఒక బాధితుడు తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతూ, డాక్టర్‌ను సంప్రదించడానికి బదులుగా.. ఒక ఏఐ టూల్ (చాట్‌బాట్) సహాయం తీసుకున్నాడు. ఆ చాట్‌బాట్ సూచించిన సాధారణ నొప్పి నివారణ మందులను దుకాణంలో కొనుగోలు చేసి వాడటం మొదలుపెట్టాడు.
అయితే ఆ భాధితుని మెడికల్ హిస్టరీ వైద్య చరిత్ర గానీ, అతనికి కడుపు లేదా పేగుల్లో సమస్యలు వచ్చే అవకాశం ఉందన్న విషయం గానీ ఆ ఏఐ వ్యవస్థకు తెలియదు. ఫలితంగా ఆ మందుల వికటించి, బాధితునికి తీవ్రమైన అంతర్గత రక్తస్రావం మొదలైంది. సాధారణ నడుము నొప్పి నివారణ కోసం బాధితుడు చేసిన ప్రయత్నం చివరకు ప్రాణాల మీదకు తెచ్చిందని డాక్టర్ ఉమా కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యాధి నిర్ధారణ అనేది కేవలం డేటాను సరిపోల్చడం కాదని, వైద్యులు రోగిని భౌతికంగా పరీక్షించడం, రక్త పరీక్షలు, స్కానింగ్‌లు చేసి, రోగి పూర్వపు ఆరోగ్య చరిత్రను పరిశీలించడం ద్వారా చికిత్సను నిర్ణయిస్తారని డాక్టర్ తెలిపారు. అయితే ఏఐ మోడల్స్ కేవలం అందుబాటులో ఉన్న డేటాలోని ప్యాట్రన్లను మాత్రమే గుర్తిస్తాయి. అవి రోగిని చూడలేవు, శరీరంలోని హెచ్చరిక సంకేతాలను గమనించలేవు. ఈ కేసులో కూడా సరైన వైద్య పరీక్షలు జరిగి ఉంటే, పేషెంట్‌కు రక్తస్రావం అయ్యేది కాదన్నారు. అలాగే ప్రమాదకరమైన మందులను వాడేవాడు కాదన్నారు.
చాట్‌బాట్‌లు ఎంత నమ్మకంగా సమాచారాన్ని అందించినప్పటికీ, వాటిలో లోపాలు ఉండే అవకాశం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాట్‌జీపీటీ లాంటి ప్లాట్‌ఫామ్‌లు ఇది వైద్య సలహా కాదని సూచనలు చేస్తున్నప్పటికీ, బాధితులు అదే సరైన వైద్యమని భ్రమపడుతున్నారన్నారు. ఏఐ టూల్స్ కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమేనని, వాటిని వ్యక్తిగత వైద్య చికిత్స కోసం వాడకూడదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే, ఏఐ వాడకంపై స్పష్టమైన నిబంధనలు ఉండాలని ఎయిమ్స్ వైద్యులు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: ‘అణుయుద్ధం ఆపా.. కోటి మందిని కాపాడా’


