వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్- పాకిస్తాన్ మధ్య జరగబోయే భారీ యుద్ధాన్ని తానే నివారించానని, లేదంటే పరిస్థితి అణుయుద్ధానికి దారితీసేదని మరోమారు పేర్కొన్నారు. తన రెండో విడత పాలన ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా వైట్ హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయని, ఆ సమయంలో ఎనిమిది విమానాలు కూల్చివేశారని అన్నారు.
తాను అధికారంలోకి వచ్చిన దరమిలా కేవలం పది నెలల కాలంలో ఎనిమిది యుద్ధాలను ఆపగలిగానని, అందులో భారత్-పాక్ యుద్ధం అత్యంత ప్రమాదకరమైనదని, వారు అణుయుద్ధానికి సిద్ధమయ్యారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. గత ఏడాది మే 10న భారత్- పాక్ కాల్పుల విరమణ ప్రకటించినప్పటి నుండి, ఈ యుద్ధాన్ని ఆపింది తానేనని ట్రంప్ ఇప్పటికి 80 సార్లు పైగా చెప్పడం గమనార్హం. ఈ విషయంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనకు కృతజ్ఞతలు తెలిపారని ట్రంప్ వెల్లడించారు.
#WATCH | US President Donald Trump says, "...I ended eight unendable wars in 10 months...Pakistan and India. They were really going at it. Eight planes were shot down. They were going to go nuclear, in my opinion. The Prime Minister of Pakistan was here and he said, President… pic.twitter.com/kTDa912iLQ
— ANI (@ANI) January 20, 2026
‘పాకిస్థాన్ ప్రధాని ఇక్కడికి వచ్చినప్పుడు.. అధ్యక్షుడు ట్రంప్ సుమారు కోటి మంది ప్రాణాలను కాపాడారని చెప్పారని ట్రంప్ అన్నారు. తన కారణంగానే కోట్లాది మంది ప్రాణాలు నిలిచాయని, అయితే ఈ విషయంలో తనకు దక్కాల్సిన గుర్తింపు దక్కడం లేదని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎనిమిది యుద్ధాలను నిలువరించినప్పటికీ, ప్రపంచం ఆ విషయాన్ని గుర్తించడం లేదని వాపోయారు. నోబెల్ శాంతి బహుమతి తనకు రాకపోవడంపై ట్రంప్ మరోసారి అసహనం వ్యక్తం చేశారు. వెనెజువెలాలో సైనిక చర్య చేపట్టినందుకు అక్కడి మహిళా నేత మరియా మచాడో తన నోబెల్ బహుమతిని తనకు అంకితం చేశారని ట్రంప్ గుర్తు చేశారు.
కాల్పుల విరమణపై ట్రంప్ చేస్తున్న వాదనలను భారత్ పూర్తిగా తోసిపుచ్చింది. 2025 ఏప్రిల్‌లో జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించగా, దానికి ప్రతిస్పందనగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టి, పాక్ ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. ఈ క్రమంలో పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) మే 10న స్వయంగా భారత అధికారులను సంప్రదించి, కాల్పుల విరమణ కోరారని భారత అధికారులు స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షికంగా జరిగిందే తప్ప, ఇందులో మూడో పక్షం పాత్ర లేదని మోదీ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ట్రంప్ వాదనలను ఖండించింది.
ఇది కూడా చదవండి: లక్షల్లో ‘బిహారీ’ బందీలు.. 50 ఏళ్లుగా..


