బంగ్లాదేశ్ 2026 సాధారణ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తరుణంలో మరోమారు ఒక కీలక అంశం తెరపైకి వచ్చింది. గత 50 ఏళ్లుగా ఆ దేశంలో అనామకులుగా మిగిలిపోయిన ‘బిహారీ’ల ప్రస్తావన ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం లభించి ఇన్లేళ్లు గడిచినా, వారి జీవితాల్లో ఇసుమంత వెలుగు కూడా కానరాలేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా వారి వెతలు తీరలేదు. ఇంతకీ ‘బంగ్లా’లో మగ్గిపోతున్న ‘బిహారీ’లు ఎవరు? వారి సమస్య ఏమిటి? పరిష్కారం ఎప్పుడు లభిస్తుంది?
బంగ్లాదేశ్‌లో అనామక పౌరులు
1971 యుద్ధానంతరం బంగ్లాదేశ్‌లోనే ఉండిపోయిన ఉర్దూ మాట్లాడే ముస్లింలు లేదా ‘బీహారీ’ (పాక్ అనుకూల వర్గాలు)ల దుస్థితి మరోమారు అందరి నోళ్లలో నానుతోంది. 1971 డిసెంబర్ 16న దేశం విడిపోయిన నాటి నుంచి వారు బంగ్లాదేశ్‌లో అనామక పౌరులుగా మిగిలిపోయారు. వీరికి ఫలానా దేశానికి చెందినవారనే గుర్తింపు కూడా లేదు. నాడు పాకిస్థాన్ కు సహకరించారన్న ఆరోపణలతో వీరిని తాత్కాలిక శిబిరాల్లో బంధించారు. నేటికీ ఆ శిబిరాలే వారికి శాశ్వత నివాసాలుగా మారాయి. పాకిస్తాన్ తమను తిరిగి తీసుకువెళుతుందని వీరంతా ఆశించినా, కేవలం 1.70 లక్షల మందిని మాత్రమే ఆ దేశం వెనక్కి తీసుకుంది. మిగిలిన లక్షలాది మంది బంగ్లాదేశ్‌లో పూర్తిగా కలవలేక, పాకిస్తాన్ కు తిరిగి వెళ్లలేక నిరంతర అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
గడచిన ఐదు దశాబ్దాల్లో..
వీరి సమస్యకు పరిష్కారంగా 2003, 2008లో వచ్చిన కోర్టు తీర్పులు కొంతమందికి పౌరసత్వం కల్పించినా, 1971 నాటికి వయోజనులుగా ఉన్నవారికి ఇంకా ఓటు హక్కు గానీ, పూర్తి పౌరసత్వం గానీ దక్కలేదు. గడచిన ఐదు దశాబ్దాల్లో బంగ్లాదేశ్ లో అనేక ప్రభుత్వాలు మారాయి. సైనిక పాలనలు, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు, ఆపద్ధర్మ ప్రభుత్వాలు ఇలా సుమారు 15 రకాల పాలనా యంత్రాంగాలు మారినప్పటికీ, ‘బీహారీ’ల తలరాత ఏమాత్రం మారలేదు. వారికి పౌరసత్వం అనేది ఒక కలగానే మిగిలిపోయింది తప్ప, నిజ జీవితంలో సమాన హక్కులు దక్కలేదు.
మరోమారు వంచన, దోపిడీ?
ఇప్పుడు 2026 ఎన్నికల్లో కూడా వీరు మరోమారు రాజకీయ వంచనకు, దోపిడీకి గురయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఇందుకు రెండు ప్రధాన కారణాలున్నాయి. మొదటిది.. వీరి విషయంలో పాకిస్తాన్ తన బాధ్యతను విస్మరించడం. పాక్ ప్రభుత్వం అప్పుడప్పుడు ఈ అంశంపై ప్రకటనలు చేస్తున్నప్పటికీ, వీరిని వెనక్కి రప్పించేందుకు ఎలాంటి నిర్మాణాత్మక చర్యలు చేపట్టడం లేదు. రెండు దేశాల మధ్య విమాన రాకపోకలు, సంబంధాలు మెరుగుపడినప్పటికీ, స్వదేశానికి రావాలనుకునే వారిని అనుమతించడంలో పాక్ జాప్యం చేస్తోంది. ఇక రెండోది.. బంగ్లాదేశ్‌లోని రాజకీయాలు చరిత్రను తమకు అనుకూలంగా మలచుకున్నాయి. ఖలీదా జియా వంటి నేతలు సైతం దేశ గత చరిత్రలోని వివాదాలను విస్మరిస్తున్నారు. ఈ రాజకీయ క్రీడలో, నాడు పాకిస్తాన్‌కు విధేయులుగా ఉండిపోయిన సామాన్యుల వెతలు ఎవరికీ పట్టడం లేదు.
నమ్మకద్రోహాలు, సామూహిక శిక్షలు
ఇరు దేశాలు దౌత్య సంబంధాల సాధారణీకరణ పేరుతో చరిత్రను తారుమారు చేయడం లేదా మౌనం వహించడం చేయడం కారణంగా ఈ వర్గాల ప్రజల హక్కులకు తీవ్ర భంగం వాటిల్లుతోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రభుత్వాలు రెండూ గతంలో చోటుచేసుకున్న నమ్మకద్రోహాలు, సామూహిక శిక్షలు, వ్యవస్థాగత నిర్లక్ష్యాలను నిరంతరం కప్పిపుచ్చుతున్నాయి. పాక్‌లోని ఇస్లామిక్ పార్టీలు సైతం ఈ అభాగ్యుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. దాదాపు 3.24 లక్షల మంది పాకిస్తానీ పౌరులు 54 ఏళ్లుగా విదేశీ గడ్డపై దిక్కులేకుండా పడి ఉంటే, ఇస్లామిక్ ఐడియాలజీ కౌన్సిల్ నుంచి కూడా ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.
దుర్భర స్థితిలో మూడో తరం ‘బీహారీ’ యువత
ప్రస్తుతం పాక్, ‘బంగ్లా’ మధ్య సంబంధాలు కేవలం వాణిజ్యం, క్రికెట్, సైనిక సహకారం మొదలైవాటి చుట్టూనే తిరుగుతున్నాయి. 2026 ఎన్నికలు బంగ్లాదేశ్‌కు ఒక నైతిక పరీక్ష లాంటివి. 1971 నాటి ద్వేషాన్ని, చరిత్రను పక్కనపెట్టి, బంగ్లాదేశ్ తన గొప్పతనాన్ని చాటుకోవాల్సిన తరుణం ఇప్పుడు ఆసన్నమయ్యింది. మురికివాడల్లో మగ్గుతున్న మూడో తరం ‘బీహారీ’ యువతను తమ దేశ పౌరులుగా ఆదరించాలి. వచ్చే ఎన్నికల్లో వీరిని కేవలం ఓటర్లుగా లెక్కించడమే కాకుండా, దేశంలో భాగస్వామ్యం చేయాలని విశ్లేషకులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: సిగరెట్ మాఫియా గుప్పిట్లోకి భారత్?


