అమెరికా రక్షణ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఓపెన్‌ఏఐ సేవలపై వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. చాట్‌జీపీటీని బహిష్కరించాలంటూ ప్రతిజ్ఞకు పిలుపునిచ్చిన ఒక వెబ్‌సైట్.. ఇప్పటికే సుమారు 25 లక్షల మంది వినియోగదారులు చాట్‌జీపీటీని బాయ్‌కాట్ చేసినట్లు పేర్కొంది.
900 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న ఓపెన్‌ఏఐ (OpenAI) గత వారం అమెరికా రక్షణ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. రక్షణ శాఖ తన వర్గీకృత నెట్‌వర్క్‌లో ఏఐ మోడల్‌ను అమలు చేయడానికి అనుమతి లభించింది.
ఈ డీల్‌తో వినియోగదారుల అసంతృప్తి పెరుగుతోందని ఆ వెబ్‌సైట్ వెల్లడించింది. సంతకాల సంఖ్య, సోషల్ మీడియా షేర్లు, యాప్ వినియోగ డేటా ఆధారంగా ప్రజలు చాట్‌జీపీటీపై విశ్వాసం కోల్పోతున్నారని పేర్కొంది. “అమెరికన్లతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లను చాట్‌జీపీటీ నుంచి నిష్క్రమించడానికి మేము సమన్వయం చేస్తున్నాం. వినియోగదారుల చర్యల ద్వారా ఓపెన్‌ఏఐకు స్పష్టమైన సందేశం పంపవచ్చు” అని వెబ్‌సైట్ పేర్కొంది.
ఇదిలా ఉండగా, సెన్సార్ టవర్ విశ్లేషణ ప్రకారం.. పెంటగాన్ నుంచి తప్పుకొన్న ఆంథ్రోపిక్ (Anthropic) రూపొందించిన ‘క్లాడ్’ చాట్‌బాట్ యాప్, అమెరికాలో యాపిల్ యాప్ స్టోర్ చార్టుల్లో చాట్‌జీపీటీ యాప్‌ను అధిగమించి అగ్రస్థానానికి చేరినట్లు సమాచారం. అలాగే టెక్‌క్రంచ్ నివేదిక ప్రకారం.. గత శనివారం చాట్‌జీపీటీ మొబైల్ యాప్ యూఎస్‌లో అన్‌ఇన్‌స్టాల్‌ల సంఖ్య రోజుకు 295 శాతం పెరిగినట్లు వెల్లడైంది.


