డేటింగ్‌ క్యాపిటల్‌ అదే.. దేశంలో ఏ నగరమో తెలుసా? | Did You Know Worlds Best City for Dating Isnt Paris | Sakshi
Sakshi News home page

కళ్లకు గంతలు...సహా ఆ సిటీలో వెరైటీ డేటింగ్స్‌ ఎన్నో...

Jan 19 2026 11:26 AM | Updated on Jan 19 2026 11:44 AM

Did You Know Worlds Best City for Dating Isnt Paris

దేశవ్యాప్తంగా పలు నగరాల్లో శరవేగంగా డేటింగ్‌ సంస్కృతి విస్తరిస్తోంది. అవివాహితుల నుంచి మొదలుకుని వేర్వేరు కారణాల వల్ల ఒంటరిగా మిగిలిన వారి సంఖ్య భారీగా పెరుగుతుండడం వారు కూడా  తోడు కోసం తహతహలాడుతుండడంతో ఈ కల్చర్‌ ఇప్పటికే స్థిరపడడంతో పాటు రకరకాలుగా రూపాంతరం చెందుతోంది, ముఖ్యంగా ఆన్‌లైన్‌ సేవల విజృంభణ ఈ సంస్కృతికి ఆజ్యం పోస్తోంది.  

దేశవ్యాప్తంగా చూస్తే డేటింగ్‌ కల్చర్‌లో ఢిల్లీ, ముంబయి, బెంగుళూర్, పూణె, హైదరాబాద్,చెన్నై... వంటి నగరాలు దూసుకుపోతున్నాయి అయితే డేటింగ్‌ ఇష్టులు అత్యధిక సంఖ్యలోఉన్న నగరం బెంగుళూరు అని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఈ సిలికాన్‌ సిటీ వాసులు ఈ కల్చర్‌కి భారీ స్థాయిలో ఇష్టపడుతుండడంతో ఆర్గనైజర్లు వినూత్న తరహా డేటింగ్స్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. 

ఆన్‌లైన్‌ డేటింగ్‌ స్థానంలో వినూత్నమైన వ్యక్తిగత అనుభవాలు వస్తున్నాయి. డేటింగ్‌ను మరింత సరదాగా మార్చడానికి వ్యక్తుల కళ్లకు గంతలు కట్టడం నుంచి రహస్య సంకేతాల వరకు అనేక కొత్త ఆలోచనలను డేటింగ్‌ సంస్థల నిర్వాహకులు అమలు చేస్తున్నారు. బెంగుళూర్‌కి చెందిన స్మాల్‌ వరల్డ్‌ అనే సంస్థ వ్యవస్థాపకుడు సౌరవ్‌ ఆర్య మాట్లాడుతూ, కరోనా సమయంలో డిజిటల్‌ డేటింగ్‌ బాగా ఊపందుకుందని అయితే, ఇప్పుడు వ్యక్తిగత సంబంధాల కోసం ప్రజలు ఆరాటపడుతున్నారని చెప్పారు. 

జూమ్‌ మీటింగ్స్‌పై విరక్తి పెరగడంతో, ఇప్పుడు నిజ జీవిత డేటింగ్‌ ఈవెంట్‌లకు డిమాండ్‌ ఏర్పడిందనీ ఇవి భవిష్యత్తు  కాబోయే భాగస్వాముల కోసం మాత్రమే కాకుండా, సుదీర్ఘ ఒంటరితనానికి ఒక సామాజిక విరుగుడుగా కూడా ఉపయోగపడుతున్నాయని ఆయన చెబుతున్నారు.ఆయన కంపెనీ ఇప్పటివరకు 40 ఈవెంట్‌లను నిర్వహించింది, ప్రతి ఈవెంట్‌లో  30 మంది పాల్గొంటున్నారు.

ఇక  స్పీడ్‌ డేటింగ్‌ అనేది మరొక సామాజిక కార్యకలాపం, దీనిలో రొమాంటిక్‌ సంబంధాల కోసం చూస్తున్న వ్యక్తులు ఒకరినొకరు తెలుసుకోవడానికి వరుసగా చిన్న చిన్న సంభాషణలు జరుపుతారు. స్పీడ్‌ డేటింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన అన్ ఫోల్డ్‌లవ్‌ సహ–వ్యవస్థాపకుడు ఒకరు మాట్లాడుతూ, సేహేయ్‌ అనే మరో డేటింగ్‌ పద్ధతి కూడా నగరానికి ఇప్పుడిప్పుడే పరిచయం అవుతోంది అని అయన చెప్పారు. ‘‘కానీ ప్రజలు ఈ ఆలోచనకు అలవాటు పడుతున్నారు ,’’ అని ఆయన  అన్నారు.

బెంగళూరులో ఒక మీమ్‌ ఆధారిత డేటింగ్‌ యాప్‌ కూడా అందుబాటులోకి వచ్చింది. స్మూజ్‌ అని పేర్కొనే ఈ యాప్‌ను విద్యా మాధవన్‌  అభినవ్‌ అనురాగ్‌ లు అమెరికాలో ప్రారంభించారు. ‘‘ఇతర యాప్‌లలో మీరు వ్యక్తులపై స్వైప్‌ చేసినట్లు కాకుండా, స్మూజ్‌లో మీరు మీమ్స్‌పై స్వైప్‌ చేస్తారు. 

మీరు స్వైప్‌ చేసే మీమ్స్‌ మీ ఇష్టాయిష్టాలను బాగా అర్థం చేసుకోవడానికి మాకు సహాయపడతాయి, ఆపై మేము మీకు తగిన భాగస్వాములను అందిస్తాం’’ అని విద్య వివరించారు. డేటింగ్‌ యాప్‌లకు అనుకూలంగా లేని సంప్రదాయవాదులు కూడా స్మూజ్‌ను ప్రయత్నించడానికి సిద్ధంగా ఉన్నారు, ఎందుకంటే వారికి ఈ కాన్సెప్ట్‌ సరదాగా అనిపించింది. ప్రతి ఒక్కరూ మీమ్స్‌ను ఇష్టపడతారు కదా’’ అని ఆమె అన్నారు.

తొలుత అమెరికాలో లాంచ్‌ అయిన ఈ యాప్‌ కు ఆన్ లైన్ లో ప్రాచుర్యం పొందడంతో, భారతదేశంలో కూడా దీనిని ప్రారంభించమని అనేక అభ్యర్థనలు వచ్చాయని ఆమె చెప్పారు. అయితే ‘‘అభ్యర్థనలలో ఎక్కువ భాగం బెంగళూరు నుంచే వచ్చాయి.  డెమో యాప్‌ను ప్రారంభించిన స్వల్ప వ్యవధిలోనే, ఒక్క బెంగళూరు నుంచే 5,000 కంటే ఎక్కువ డౌన్ లోడ్‌లు రావడం గమనార్హం.  గత కొన్ని నెలలుగా, భారతీయ భాషలలోని ఇతర డేటింగ్‌ యాప్‌లు కూడా బెంగళూరులో ప్రజాదరణ పొందుతున్నాయి. ఉదాహరణకు, నీనే అనేది కన్నడిగుల కోసం మాత్రమే నిర్వహిస్తున్న ఒక డేటింగ్‌ యాప్‌. నేను నా కమ్యూనిటీకి చెందిన వారితో మాట్లాడగలుగుతున్నాను  కన్నడ సినిమాల గురించి చర్చలు కూడా జరుపుతున్నాను, ఇది ఇంతకు ముందు సాధ్యమయ్యేది కాదు. 

టిండర్‌  బంబుల్‌ వంటి ఇతర యాప్‌లన్నీ చాలా సాధారణంగా మారిపోయాయి,  ప్రతిచోటా ఒకే రకమైన వ్యక్తులు ఉంటున్నారు, కాబట్టి సంభాషణ చాలా చప్పగా తయారైంది,’’ అని 2017 నుంచి డేటింగ్‌ యాప్‌లను ఉపయోగిస్తున్న 33 ఏళ్ల వనిత చెబుతోంది. ఏతావాతా... పెళ్లి నుంచి ప్రేమ వరకూ అలాగే జీవిత కాల సంబంధం నుంచి స్వల్పకాలిక శారీరక మానసిక అవసరాల వరకూ తీర్చుకోవడానికి అందుబాటులోకి వచ్చిన ఈ డేటింగ్‌ సంస్కృతి భారతీయ నగరాల్లో మరిన్ని కొత్త పోకడలు తీసుకురానుండడం తధ్యంగా కనిపిస్తోంది.

(చదవండి: పురుషులు గర్భం దాల్చగలరా? భారత సంతతి వైద్యురాలు ఏమన్నారంటే..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement