పురుషులు గర్భం దాల్చగలరా? భారత సంతతి వైద్యురాలు ఏమన్నారంటే.. | Dr Nisha Verma Who Dodged Can Men Get Pregnant | Sakshi
Sakshi News home page

పురుషులు గర్భం దాల్చగలరా? భారత సంతతి వైద్యురాలు ఏమన్నారంటే..

Jan 16 2026 11:29 PM | Updated on Jan 16 2026 11:29 PM

Dr Nisha Verma Who Dodged Can Men Get Pregnant

అమెరికాలోని డిర్క్‌సెన్ సెనేట్ కార్యాలయంలో జరిగిన "మహిళల రక్షణ: కెమికల్ అబార్షన్ డ్రగ్స్ ముప్పు" అనే అంశంపై జరిగిన చర్చ వివాదాస్పదంగా మారింది.   మందుల ద్వారా జరిగే అబార్షన్ నుంచి మహిళలను కాపాడటం.. అనే అంశంపై సెనేట్‌లో జరుగుతున్న చర్చకు భారత సంతతి గైనకాలజిస్ట్, డాక్టర్ నిషా వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా సెనేటర్‌కు, డాక్టర్‌ మధ్య జరిగిన వాగ్వాదం  హాట్‌టాపిక్‌గా మారి చర్చనీయాంశమైంది.

ఆ ఒక్క ప్రశ్నతో దద్దరిల్లిన పార్లమెంట్‌..
చర్చలో భాగంగా సెనేటర్ జోష్ హాలే నేరుగా డాక్టర్ నిషా వర్మను ఉద్దేశించి.. " మగవారు గర్భం దాల్చగలరా ?" అని ప్రశ్నించారు. అందుకు ఆమె నేరుగా అవును లేదా కాదు అని సమాధానం చెప్పకుండా దాటవేస్తూ.. తాను మహిళలుగా గుర్తింపులేని వివిధ జెండర్ ఐడెంటిటీలు ఉన్న రోగులకు కూడా చికిత్స అందించాను అని బదులిచ్చారు. ఆ సమాధానంపై తీవ్ర అసంతృప్తికి గురైన సెనేటర్‌ హాలే తాను అడిగిన ప్రశ్న..సైన్స్, జీవశాస్త్ర వాస్తవాలకు సంబంధించినదని, దీనికి రాజకీయ రంగు పులమాల్సిన పని లేదంటూ మండిపడ్డారు. దాంతో డాక్టర్ నిషా వర్మ తన వాదనను కొనసాగిస్తూ.. ఇలాంటి ప్రశ్నలను ముమ్మాటికి రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకుంటారంటూ ధ్వజమెత్తారామె. అంతేగాదు తాను సైన్స్‌ నమ్మే వ్యక్తినని, రకరకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే రోగులకు చికిత్స అందిస్తుంటాను. 

ఆ నేపథ్యంలోనే ఈ చర్చలో పాల్గొనేందుకు వచ్చాను. కానీ ఇలాంటి ప్రశ్నలు పక్కదారి పట్టిస్తాయంటూ ఘాటుగా సమాధానమిచ్చారు నిషా. అయితే "జీవశాస్త్రపరంగా పురుషులు గర్భం దాల్చలేరనే కనీస సత్యాన్ని మీరు అంగీకరించలేకపోతున్నారు.. కాబట్టి మిమ్మల్ని సైన్స్ తెలిసిన వ్యక్తిగా ఎలా నమ్మాలి?" అంటూ హాలే ఆగ్రహం వ్యక్తం చేశారు.  

అబార్షన్ మందుల భద్రతపై ఆందోళన
కేవలం జెండర్ వివాదమే కాకుండా అబార్షన్ కోసం వాడే మందుల భద్రతపై కూడా సెనేటర్ హాలే కీలక గణాంకాలను ప్రస్తావించారు. "అబార్షన్ డ్రగ్స్ వాడటం వల్ల 11 శాతం కేసుల్లో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందని సైన్స్ చెబుతోంది. ఇది ఎఫ్‌డీఏ లేబుల్‌పై ఉన్న దానికంటే 22 రెట్లు ఎక్కువ" అని ఆయన ఆరోపించారు. 

మరోవైపు డాక్టర్ నిషా వర్మ ఈ వాదనను తోసిపుచ్చారు. 2000 సంవత్సరంలో ఆమోదం పొందిన నాటి నుంచి ఇప్పటి వరకు అమెరికాలో 75 లక్షల మందికి పైగా ఈ మందులను సురక్షితంగా వాడారని, వందకు పైగా అత్యున్నత స్థాయి సమీక్షలు ఈ మందులు సురక్షితమని నిరూపించాయని ఆమె చెప్పడం విశేషం. కేవలం రాజకీయ కారణాల వల్లే అబార్షన్ హక్కులపై ఆంక్షలు విధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారామె.  ఇంతకీ ఎవరీ భారత సంతతి వైద్యురాలు నిషా వర్మ..

ఆమె ఎవరంటే..

నిషా వర్మ నార్త్ కరోలినాలోని గ్రీన్స్‌బోరోలో భారత వలస తల్లిదండ్రులకు జన్మించారు. ఆమె జీవశాస్త్రం,మానవ శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని, కరోలినా విశ్వవిద్యాలయం నుంచి వైద్య డిగ్రీ (MD)ని పొందారు.

ఆమె బెత్ ఇజ్రాయెల్ డీకనెస్ మెడికల్ సెంటర్‌లో ఇంటర్న్‌షిప్ OB/GYN (ప్రసూతి మరియు గైనకాలజీ) రెసిడెన్సీని పూర్తి చేసింది. వర్మ ఆ తర్వాత కాంప్లెక్స్ ఫ్యామిలీ ప్లానింగ్ ఫెలోషిప్‌ను పూర్తి చేసి ఎమోరీ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (MPH) డిగ్రీని పొందారు.

ఆమె డబుల్-బోర్డ్-సర్టిఫైడ్ ప్రసూతి వైద్యురాలు, పైగా కుటుంబ నియంత్రణలో స్పెషలిస్ట్ కూడా. వర్మ ప్రస్తుతం జార్జియాలో సమగ్ర పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణపై ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఆమె ఫిజిషియన్స్ ఫర్ రిప్రొడక్టివ్ హెల్త్‌లో ఫెలో కూడా.

అంతేగాదు ఆమె అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ (ACOG)లో రిప్రొడక్టివ్ హెల్త్ పాలసీ అండ్ అడ్వకేసీకి సీనియర్ అడ్వైజర్‌గా పనిచేయడమే గాక ఎమోరీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో అనుబంధ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తోందామె. 

 

(చదవండి: అలాంటి ఇలాంటి నమ్మకం కాదు..! అడగంగానే..'బంగారుపు గాజులను'..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement