భువనేశ్వర్: ఒడిశాలో ఓ హృదయ విదారకర ఘటన జరిగింది. తమ జీవిత చరమాంకంలో ఉన్న ఇద్దరు వృద్ధ దంపతుల అన్యోన్యత పలువురిని కంటతడి పెట్టించింది.పేరాలసిస్ వ్యాధితో బాధపడుతున్న తన భార్యను రక్షించుకోవడం కోసం 75 ఏళ్ల వృద్ధ భర్త ఏకంగా 600 కిలోమీటర్ల రిక్షా లాగాడు. తనను వెనుక కూర్చెబెట్టి కంటికి రెక్కలా కాపాడుకుంటూ తొమ్మిది రోజులు ప్రయాణించాడు. ఎట్టకేలకు తనను ఆసుపత్రిలో చేర్చి తన ప్రాణాలను కాపాడాడు.
ప్రస్తుతం దాంపత్య సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పచ్చడి పంచాయితీ కోసం కూడా విడాకులు తీసుకునే రోజులివి. అహంకారంతో చిన్నచిన్న విభేదాలకే ఒకరిని ఒకరు అర్థం చేసుకోకుండా దంపతులు విడిపోతుంటారు. పెళ్లి వెనుక పరమార్థం కానీ తాళి బొట్టుకున్న గొప్పతనం గురించి కాని వారు పట్టించుకోరు. వారికి నచ్చిందే చేస్తారు. అయితే ప్రస్తుత సమాజానికి కనుపిప్పు కలిగిస్తూ ఆలుమెుగల బంధానికి అర్థం చెప్పేలా ఒడిశాలో ఓ ఘటన జరిగింది. “ధర్మ, అర్థ, కామములు ఏనాడు నీతోడు; ఎన్నడూ నే విడిచిపోనూ” అనే ప్రమాణాన్ని నిలబెట్టడం కోసం ఓ వృద్ధ భర్త తన వయసును సైతం లెక్కచేయకుండా ఏకంగా 600 కిలోమీటర్లు రిక్షా లాగాడు. తన భార్య ప్రాణాన్ని రక్షించుకున్నాడు.
శంబలాపూర్, మెుదైపాడలో బాబులోహార్ (75),జ్యోతి (70) అనే వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. అయితే ఇటీవల జ్యోతి స్టోక్ రావడంతో తీవ్ర అనారోగ్యం పాలయ్యింది. అక్కడి స్థానిక డాక్టర్లు తనకు మెరుగైన వైద్యం అందించాలని అందుకోసం కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్ కాలేజ్‌కి తీసుకెళ్లాలని సూచించారు. అయితే కడు పేదరికంతో పూట గడవడమే కష్టంగా ఉన్న ఆ దంపతులకు అంతదూరం వెళ్లి ఆసుపత్రిలో వైద్యం చేసుకోవాలంటే చాలా కష్టం. అయితే అంత పేదరికంలోనూ బాబులోహార్ తన భార్యను రక్షించాలని సంకల్పించాడు.
రవాణా ఖర్చులకు సైతం డబ్బులు లేకపోవడంతో రిక్షాపైన తన భార్యను ఎక్కించి కటక్‌కు బయిలుదేరాడు. 300 కిలోమీటర్ల పాటు ఉదయం పూట రిక్షా లాగేవాడు. రాత్రిళ్లు ఏదైనా స్థలం వద్ద విశ్రాంతి తీసుకునే వారు. ఇలా తొమ్మిది రోజు పాటు ప్రయాణించి ఎట్టకేలకు ఆసుపత్రికి తన భార్యను చేర్చాడు. అనంతరం ఆసుపత్రి వారు తనని అడ్మిట్ చేసుకొని రెండు నెలల పాటు అత్యవసర చికిత్స అందించారు. దీంతో దంపతులిద్దరూ జనవరి 19న తిరుగు ప్రయాణమయ్యారు.
ఇంకేంటి కథ సుఖాంతం అయ్యిందనుకున్నారా? అక్కడితో విధి ఆట ఆగలేదు. తిరుగు ప్రయాణంలో వీరికి యాక్సిడెంట్ అయ్యింది. మరోసారి ఆ వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. దీంతో అక్కడే స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందించారు. ఆ దంపతుల పరిస్థితి చూసి చలించిపోయిన వికాస్ అనే డాక్టర్ వారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు కొంత డబ్బు ఇచ్చి పంపించాడు. 75 ఏళ్ల వయస్సు లోనూ తన భార్య కోసం 600 కిలోమీటర్లు రిక్షా లాగడం చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు. ఆ వృద్ధుని గొప్పతనానికి సెల్యూట్ చెబుతున్నారు


