సహనమే శరణ్యం | Sakshi Editorial On India Republic is with Patience | Sakshi
Sakshi News home page

సహనమే శరణ్యం

Jan 26 2026 12:20 AM | Updated on Jan 26 2026 12:20 AM

Sakshi Editorial On India Republic is with Patience

సహనం, ఓరిమి, క్షమ – ఉత్తములైన మనుషుల సహజ లక్షణాలని వేద పురాణేతి హాసాలు, వివిధ మత గ్రంథాలు, నీతిశాస్త్రాలు చెబుతున్నాయి. ‘క్షమా భూమిః క్షమా సర్వం/ క్షమయా ధార్యతే జగత్‌’ అని అధర్వణ వేదం చెబుతోంది. ‘క్షమా దానం క్షమా సత్యం క్షమా యజ్ఞః చ పుత్రికాః/ క్షమా యశః క్షమా ధర్మః క్షమాయాం విష్ఠితం జగత్‌’ అని వాల్మీకి రామాయణం చెబుతోంది. ‘క్షమా ధర్మః క్షమా యజ్ఞః/ క్షమా వేదః క్షమా శ్రుతిః/ క్షమయా ధార్యతే లోకః క్షమయా కిం న సాధ్యతే’ అని వ్యాస మహాభారతం చెబుతోంది. క్షమను మించిన సుగుణం లేదు, క్షమతో సాధ్యం కానిది లేదు అని ఈ శ్లోకాల సారాంశం.
 
‘ఖంతీ పరమం తపో తితిక్ఖా’ అని బుద్ధుని ధమ్మపదం చెబుతోంది. అంటే, సహనమే అత్యున్నత తపస్సు అని అర్థం. ‘సహన శీలః సజ్జనః/ కోపహీన సదా భవేత్‌/ కోపోహి శత్రురత్యంతం/ తస్మాత్‌ క్షమైవ శ్రేయసీ’ అని భర్తృహరి నీతి శతకం చెబుతోంది. ఇదే నీతిని ‘తన కోపమె తన శత్రువు/ తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ/ తన సంతోషమె స్వర్గము/ తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ’ అని సుమతీ శతకం చెబుతోంది.‘గర్విష్ఠుల కంటే సహనము గలవాడు మేలు’ అని బైబిల్‌ చెబుతోంది. ‘నిశ్చయంగా అల్లాహ్‌ సహనశీలురతో ఉంటాడు’ అని ఖురాన్‌ చెబుతోంది.

పురాణేతిహాసాలు, వివిధ మతాల పవిత్ర గ్రంథాలు, నీతిశాస్త్రాలు చెప్పిన ఈ మాటలను ప్రవచనాల్లోను, ఉపన్యాసాల్లోను తరచు ఉట్టంకిస్తుంటారు. అయితే, వీటిని ఆచరించడాన్నే మనుషులు మరచిపోతుంటారు. ఎదుటి మనిషి తమకు నచ్చని అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తే చాలు, ఒక్కసారిగా సహనం నశించి, కోపం కట్టలు తెంచుకుంటుంది. అప్పటి వరకు వల్లించిన నీతులన్నీ ఒక్కసారిగా మరపు మరుగున పడిపోయి, బూతుల ప్రవాహం వరదలా పోటెత్తుతుంది. తగవు మొదలై బాహాబాహీ సిగపట్ల వరకు వ్యవహారం ముదురుతుంది. మనుషుల్లో సహనం నశించినప్పుడే సమాజంలో నేరాలు, ఘోరాలు జరుగుతుంటాయి. పౌరుల్లో సహనం నశించి, తప్పటడుగులు వేస్తే, చక్కదిద్దే పనిని పాలనా వ్యవస్థలు చేపడతాయి.

దురదృష్టవశాత్తూ పాలనా వ్యవస్థలు కూడా సహనం కోల్పోయి, కక్ష సాధింపులకు తెగబడుతున్న రోజులు దాపురించాయి. సత్యం పట్ల అసహనం, ప్రశ్న పట్ల అసహనం, ధిక్కారం పట్ల అసహనం, భిన్నాభిప్రాయం పట్ల అసహనం పెచ్చుమీరిన పాలకులు సత్యాన్ని ప్రకటించే పాత్రికేయుల పట్ల, ప్రశ్నించే పౌరుల పట్ల, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే విపక్ష నేతల పట్ల కక్ష సాధింపు చర్యలకు తెగబడే ధోరణి పెరుగుతోంది. ధిక్కార స్వరాలను వినిపించే వారిని కటకటాల్లోకి నెట్టే వైఖరి ప్రబలుతోంది. పట్టించుకోవలసిన అనేక సమస్యలను పట్టించుకోకుండా, భిన్నస్వరాలపై కక్ష సాధింపు చర్యలకే ప్రాధాన్య మిస్తున్న ప్రభుత్వాలు ప్రజాస్వామ్యం మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఇవన్నీ ఇటీవలి కాలంలో మన దేశంలో కనిపిస్తున్న పరిస్థితులు.

ప్రపంచ పరిస్థితులు కూడా ఏమంత భిన్నంగా లేవు. ఆర్థికబలం, ఆయుధ బలగం దండిగా కలిగిన అగ్రరాజ్యాలు బలహీన దేశాలపై అసహనంతో యుద్ధాలకు తెగబడు తున్నాయి. బలహీన దేశాల అధినేతలను చెరబడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు దేశాలు ప్రత్యక్షంగా యుద్ధాలను ఎదుర్కొంటున్నాయి. సుమారు మరో ఇరవై దేశాలు అంతర్యుద్ధాలతో అట్టుడుకుతున్నాయి. ఇంకో పదిహేను దేశాలు ప్రచ్ఛన్న యుద్ధాలతోను, చొరబాట్లు, సైనిక హింస తదితర సమస్యలతో సతమతం అవుతున్నాయి. ఈ దారుణ దుర్భర పరిస్థితులకు మూలకారణం అసహనం. 

ప్రపంచంలో యుద్ధాలు సద్దుమణగాలన్నా; దేశాల్లో పౌరుల స్వేచ్ఛకు భద్రత దొరకాలన్నా; విభిన్న మతాలు, జాతుల మధ్య సామరస్యం పెరగాలన్నా సహనమే కీలకం. ‘క్షమా బలమశక్తానాం/ శక్తానాం భూషణం క్షమా’ అని మహాభారతం చెబుతోంది. బలహీనులకు క్షమే బలం; బలవంతులకు అది అలంకారం. మనుషుల్లో క్షమ, ఓరిమి, సహనం వంటి సహజ సుగుణాలు పెరిగినప్పుడే ప్రపంచంలో శాంతి పరిఢవిల్లుతుంది. మన గణతంత్రం ‘ఘన’తంత్రమవుతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement