జారిపడిన జాతీయ పతాకం
ఆటో డ్రైవర్ గొప్ప మనసు
జెండా పడిపోవచ్చు.. కానీ భారతీయుడి దేశభక్తి ఎప్పుడూ తలవంచుకోదు!.. అని ఓ ఆటో డ్రైవర్ నిరూపించాడు. గణతంత్ర దినోత్సవాల వేళ సోషల్ మీడియాను ఫిదా చేస్తున్న అద్భుత దృశ్యమిది. ఆకాశమంత దేశభక్తికి ఆస్కారం అక్కర్లేదు.. చిన్నపాటి గౌరవం చాలని చాటి చెప్పిన క్షణమది.
చిన్నారి కళ్లలో వెలుగు
అనన్య సింగ్ అనే యువతి తన రాపిడో ఆటోలో వెళ్తుండగా.. పక్కనే ఒక కారు కిటికీలోంచి ఓ చిన్నారి ఉత్సాహంగా జాతీయ జెండాను ఊపుతోంది. వేగంగా వెళ్తున్న ఆ కారు గాలికి అకస్మాత్తుగా ఆ పాప చేతిలో ఉన్న త్రివర్ణ పతాకం జారి రోడ్డుపై పడిపోయింది. క్షణం కూడా ఆలోచించకుండా ఆ రాపిడో డ్రైవర్ తన ఆటోను ఆపాడు. కిందపడిన జెండాను అత్యంత భక్తితో చేతుల్లోకి తీసుకున్నాడు. దానిపై ఉన్న ధూళిని దులిపి, ఎంతో ప్రేమగా తిరిగి ఆ చిన్నారికి అందజేశాడు. తన జెండా దక్కగానే ఆ చిన్నారి ముఖంలో విరిసిన ఆనందం, దాన్ని అందిస్తున్నప్పుడు ఆ డ్రైవర్ కళ్లలో కనిపించిన సంతృప్తి.. ‘వందేమాతరం’ ఆత్మను ప్రతిబింబించాయి.
అది అద్భుతం
‘నా రాపిడో డ్రైవర్ ఆ జెండాను తీసి, తుడిచి, అంత ప్రేమతో తిరిగి ఇచ్చిన తీరు అద్భుతం’.. అంటూ అనన్య సింగ్ వీడియోను ఎక్స్‌లో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. ఈ ఏడాది ‘వందేమాతరం – 150 ఏళ్లు’ థీమ్‌తో భారత్ గణతంత్ర వేడుకలను జరుపుకొంటోంది. కర్తవ్య పథ్‌లో సైనిక కవాతులు ఒకవైపు దేశ బలాన్ని చాటుతుంటే, రోడ్డు మీద సామాన్య ఆటో డ్రైవర్ చూపిన ఈ ‘జన భాగీదారీ’ (ప్రజల భాగస్వామ్యం) దేశపు సంస్కారాన్ని చాటిచెప్పింది.
– సాక్షి, నేషనల్ డెస్క్


