కమ్యూనిస్టు సంకీర్ణ సర్కారుకు కేరళలో కష్టాలు మొదలయ్యాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వారిది నల్లేరు మీద బండి నడక కాదని ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో ఇప్పుడు వీస్తున్న గాలి సంకేతాలిస్తోంది. దళిత రిజర్వు నియోజక వర్గాల్లో ఓటర్లంతా దళితులే ఉండరు.
కానీ, గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష ఫ్రంట్ (ఎల్డీఎఫ్)కు ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో లభించిన మద్దతు అటువంటిది. అసెంబ్లీకి మరో మూడు నెలల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇదీ పరిస్థితి. మరోవైపు ఎన్డీయే కూటమి ఉనికి పెంచుకుంటుంటే, కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రత్యర్థి కూటమి ‘యూడీఎఫ్’ బలపడుతోంది.
దేశంలోనే ఏకైక కమ్యూనిస్టు ప్రభు త్వాన్ని కేరళలో నడుపుతున్న వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్డీఎఫ్) పదేళ్ల పాలన తర్వాత ఎదురీదుతోంది. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు సైద్ధాంతిక మందగింపు, కులాల కుమ్ములాటలు కూటమిని బల హీనపరుస్తున్నాయి. ముఖ్యంగా రిజర్వుడు స్థానాల్లో వివిధ ప్రభా వాల వల్ల ఎల్డీఎఫ్ బలహీనపడ్డ తీరు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో పతనం తర్వాత దేశంలో మిగిలిన ఏకైక కమ్యూనిస్టు (కూటమి) ప్రభుత్వం ఇక్కడుంది. 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో గెలుపు వరించాలంటే 71 స్థానాల మేజిక్ ఫిగర్ చేరుకోవాలి. 16 రిజర్వుడ్ (పద్నాలుగు ఎస్సీ, రెండు ఎస్టీ) స్థానాలపై పట్టు కీలకం! 2011, 2016, 2021 మూడుఅసెంబ్లీ ఎన్నికల్లోనూ 14లో 12 ఎస్సీ స్థానాల్లో ఎల్డీఎఫ్ విజయ పరంపర కొనసాగించింది.
ఇతర స్థానాల్లోనూ ఎల్డీఎఫ్ దళితుల మద్దతు అపారంగా పొందుతూ వచ్చింది. కార్మికోద్యమాలు, బడు గుల సంక్షేమం, పింఛన్లు, రిజర్వేషన్లు వంటి అంశాల్లో కమ్యూని స్టుల సహజ సైద్ధాంతిక బలం, వ్యవస్థీకృత నిర్వహణ వంటివి దళితుల మద్దతు కూడగట్టడంలో కూటమికి కలిసి వచ్చిన అంశాలు. కానీ, ఇప్పుడా మద్దతు సన్నగిల్లుతోంది. ఈ పరిస్థితుల్లో... ఎన్నిక లకు సంబంధించి కేరళలో ‘పీపుల్స్ పల్స్’ సర్వే ప్రారంభించింది.
వేగంగా మార్పులు
కేరళ అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో మూడు ముఖ్య కూట ముల గెలుపోటములను ప్రధానంగా మూడంశాలు ప్రభావితం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. కమ్యూనిస్టు మూస విధానాలను వ్యతిరేకిస్తూ ఆశావహంగా పెరిగిన నగర–పట్టణ ఓటర్ ఆకాంక్షలు; కులాల కుంపట్లతో, విభిన్న సామాజిక వాదాలతో వచ్చిన చీలికల్లో ‘ఎల్డీఎఫ్ ఓటు బ్యాంకులు’ బలహీనపడటం; కొత్త ప్రాంతాలకు విస్తరిస్తూ బీజేపీ, తిరిగి పుంజుకుంటూ, యూడీఎఫ్ కిందటిఅసెంబ్లీ ఎన్నికల నుంచి బలపడుతూ రావటం... ఈ మూడంశాలు ‘ఓటు రాజకీయాల్ని’ ప్రభావితం చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
అక్కడక్కడ బీజేపీ ఎదుగుదల నేరుగా సొంతానికైనా లాభించ వచ్చు, లేదా ఓటు బ్యాంకు చీలికల వల్ల పరోక్షంగా యూడీఎఫ్‌కైనా మేలు చేయ వచ్చన్న వాదన వినిపిస్తోంది. స్థానిక ఎన్నికల్లో తిరువ నంతపురం కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకోవడం, అంతకు ముందరి అసెంబ్లీ ఎన్నికల (2021) ఫలితాలకు భిన్నంగా పలుచోట్ల యూడీఎఫ్ కొత్తగా బలపడటం ఇందుకు నిదర్శనం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే వాతావరణం కొనసాగితే.... నికరంగా నష్ట పోయేది ఎల్డీఎఫ్ అనడంలో సందేహమే లేదు.
గతంతో పోల్చి చూస్తే దేశవ్యాప్త రాజకీయ పరిణామాల ప్రభావం కేరళ రాజకీయాలపైన ఇప్పుడు అధికంగా కనిపిస్తోంది. వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గెలిచి రాజీనామా చేయడం, ఫలితంగా జరిగిన ఉప ఎన్నికలో ఆయన సోదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ గెలవడం ఓ పెద్ద పరిణామమే! పార్టీ మరో ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర నాయ కుడు కె.సి. వేణుగోపాల్‌కు ఏఐసీసీలో ప్రాధాన్యం పెరగటంవంటివి కేరళ రాజకీయాల్ని నేరుగా ప్రభావితం చేస్తున్నాయి.
2024 ఎన్నికల్లో బీజేపీ ఒక లోక్‌సభ స్థానాన్ని గెలవటం, మరుసటి యేడు (2025) జరిగిన స్థానిక ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్ ను కైవసం చేసుకోవడం బీజేపీకి కలిసివచ్చిన అంశాలే! లోక్‌సభ ఎన్ని కల్లో 11 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి ఆధిక్యత లభించగా అందులో 2 ఎస్సీ రిజర్వుడు స్థానాలున్నాయి. పరిమిత వర్గాల్లోనే అయినా దళి తుల్లో బీజేపీ బలపడటం సీపీఎంకు ఆందోళన కలిగిస్తున్న అంశం.
చీలిక విసిరిన సవాల్
దళిత ఉప కులాల్లో వచ్చిన చీలికలు అటు యూడీఎఫ్‌కు, ఇటు ఎన్డీయేకు ఎంతో కొంత మేలు చేస్తున్నాయి. ఫలితంగా రిజర్వుడు స్థానాల్లో రాజకీయ వాతావరణం వేగంగా మారుతోంది. మొత్తం కేరళలో ఎస్సీల జనాభా 9 శాతం. దళితుల్లో ప్రధానంగా ఉన్న పులియలకు తోడు పరయ, కురవ, కనక్కన్, తండన్ వంటి ఉప కులాలున్నాయి.
రెండు ఎస్టీ రిజర్వు స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తూ వస్తున్నా, 14 ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో 12 చోట్ల ఎల్డీఎఫ్ వరుస ఎన్నికల్లో గెలుస్తూ వస్తోంది. మిగిలిన రెండు స్థానాల్లో ఒకటికాంగ్రెస్ చేతిలో ఉంటే మరొక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. రాబోయే ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో యూడీఎఫ్ ఆధిక్యత 3–6 స్థానాలకు పెరిగితే, ఎల్డీఎఫ్ పట్టు 10–7 స్థానాలకు పరిమితం కావచ్చనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
దళితుల్లో అధిక సంఖ్యాకులైన పులియ సామాజికవర్గం పైన కమ్యూనిస్టులకు గట్టి పట్టుంది. ఎస్సీల్లోని ఇతర ఉపకులాలు సహజంగానే దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎన్డీయే ప్రభుత్వం సాను కూలంగా నిర్ణయం తీసుకున్న ఎస్సీ వర్గీకరణ అంశం కూడా ఎస్సీల్లో కుల వివాదాలకు, వైషమ్యాలకు, తద్వారా చీలికకు హేతువవుతోంది.
అది కూడా పరోక్షంగా కమ్యూనిస్టులు దళితుల్లో పట్టు కోల్పోవడానికి కారణంగా నిలుస్తోంది. పార్టీ సైద్ధాంతికంగా మంద గిల్లడం, ఇతరేతర కారణాల వల్ల పులియ వర్గంలోనూ కమ్యూని స్టులకు కొంత పట్టు సడలింది. కురవ సామాజికవర్గ మద్దతు పరంగా ఎల్డీఎఫ్‌కు గట్టి పట్టున్న దక్షిణాది జిల్లాలు కొల్లం, పత్తనంతిట్టలలోనూ కులాల్లో వచ్చిన చీలిక వారిని బలహీనపరిచింది.
ప్రజానాడి సంకేతాలే కీలకం
ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ స్థానిక స్వపరిపాలనను పటిష్ఠపరచుకున్న కేరళలో గత స్థానిక ఎన్నికలు జనం మనోగతాన్ని కొంతమేర వెల్లడి చేశాయి. అలా చూస్తే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పునకు భిన్నమైన ఫలితాలు 2025 స్థానిక ఎన్నికల్లో వచ్చాయి.
అవి యూడీఎఫ్, ఎన్డీయేకు కొంత ఆశావహంగానే ఉన్నాయి. వరుస రాజకీయ పరిణామాల్లో వచ్చిన మార్పు, దళిత ఉప కులాల్లో వచ్చిన చీలిక పాలక ఎల్డీఎఫ్ వ్యతిరేక వాతావరణాన్నే స్పష్టం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకున్న దాదాపు మూడు మాసాల వ్యవధిలో పరిస్థి తులు ఇంకా ఎలా మారనున్నాయో వేచి చూడాల్సిందే!
-వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,పీపుల్స్ పల్స్ రిసెర్చ్ సంస్థ డైరెక్టర్
-దిలీప్ రెడ్డి


