విశ్లేషణ
ముంబై మునిసిపల్ ఎన్నికలను నాలుగేళ్ళు ఆలస్యంగా నిర్వహించారు. రాజ్యాంగ ఉల్లంఘనతో సమానమైన ఈ జాప్యం భారతీయ ప్రజాస్వామ్యం గురించి చెప్పకనే చెబుతోంది. ఎన్నికైన ప్రజాప్రతినిధులు లేకుండా, పర్యవసానాలపై ధ్యాస లేకుండా భారతదేశపు సంపన్న మునిసిపాలిటీ పాలనను సస్పెన్షన్‌లో ఉంచారు. అయితే, మూడవ అంచెలోని రాజ్యాంగపరమైన స్వయం– పాలనా ప్రభుత్వం ఐచ్ఛికమైనది కాదని మనం గుర్తుంచుకోవాలి. మొత్తం 227 మంది సభ్యుల బృహన్ ముంబై పాలక సంస్థ (బీఎంసీ)లో బీజేపీ 2017 నాటి (82) స్థితిని మెరుగుపరచుకుని ఈసారి 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేనలో చీలిక దానికి బాగా ఉపయోగపడింది. మహారాష్ట్రలో ఎన్నికలు జరి గిన ఇతర పురపాలక, నగర పాలక సంస్థల ఎన్నికల్లో కూడా కమలమే ఎక్కువచోట్ల వికసించింది.
కానీ, ముంబై ఫలితం కనీసం ఒక చక్కని రాజకీయ భాష్యా నికైనా అనువైనదిగా లేదు. ఎందుకంటే, ముంబై మామూలు నగరం కాదు. అదొక నగర రాజ్యం. దాని బడ్జెట్ ముందు దేశంలోని చాలా రాష్ట్రాల బడ్జెట్లు కూడా తక్కువే. అది భారతదేశపు ఆర్థిక రాజధాని. బాలీవుడ్‌కు నెలవు. కార్మికులు పెద్ద సంఖ్యలో వచ్చి వాలే పెద్ద చెట్టు. సృజనాత్మక కళాకారుల ఆట మైదానం. ఆ విధంగా అది సాంస్కృతిక చోదక శక్తి. దాని బహుళత్వం, విస్తృత దృక్పథ స్వభావం దాని సంపదకు ఏమీ తీసిపోనంత విలువైనవి.
బాధ్యత లేని సంస్థలు
అయినా ఎందుకో నామమాత్రపు జవాబుదారీతనమనే జబ్బుతో, ఈ మహా నగరం బాధపడుతోంది. దాని పాలనా విభా గాలు సాలెగూడును తలపిస్తాయి. బీఎంసీ (పౌర సంస్థ), ఎంఎంఆర్‌డీఏ (ప్రాంతీయ ప్రణాళిక), ‘బెస్ట్’ (రవాణా), ఎంహెచ్‌ఏడీఏ (గృహ నిర్మాణం), ఎస్‌ఆర్‌ఏ (మురికివాడల వాసులకు పునరా వాసం), రైల్వేలు... ఇలా చెప్పుకొనేందుకు చాలా ఉన్నాయి. కానీ, ఏ సంస్థా పూర్తి బాధ్యత తీసుకోదు. ఒకదాని పరిధిలోకి ఒకటి చొరబడే వీలుంటుంది. నింద నుంచి తప్పించుకునే మార్గాలను అవి జాగ్రత్తగా రూపొందించుకున్నాయి. ప్రణాళిక– అమలు, రవాణా– భూవినియోగం, హౌసింగ్–కనెక్టివిటీల మధ్య సంబంధం లేదు. నగరం స్తంభిస్తే ఏ సంస్థనూ బాధ్యురాలిగా చేయడానికి లేదు. కనుక బీఎంసీ ఎన్నికలను పర్మిషన్లు, కాంట్రాక్టులు, భారతదేశపు అత్యంత విలువైన పట్టణ జాగ్రఫీని తీర్చిదిద్దగల హక్కుపై పట్టు సంపాదించ డానికి జరిగినవిగా చెప్పుకోవాలి.
ముంబైలో వైచిత్రి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అది అసాధా రణమైన సంపదను సృష్టిస్తోంది. అయినా, దాని పౌరులు దుర్బలురు. రియల్ ఎస్టేట్ బంగారం అంత విలువైనది. అయినా, పట్టణ జనాభాలో చెప్పుకోతగినంత మంది మురికి వాడల్లో నివసిస్తున్నారు. దేశం మొత్తంమీద లెక్కకు వచ్చే కుబేరుల్లో కొంతమంది ఇళ్ళు అక్కడే ఉన్నాయి. సాధారణ పౌర జీవనం బీటలువారిన ఫుట్‌పాత్‌లు, క్రిక్కిరిసిన రైళ్ళ గుండా సాగిపోతుంది. వర్షా కాలం వచ్చిందంటే, ఇంట్లోకి వరద నీరు రాదనే గ్యారంటీ లేదు.
ముంబైని అంతర్జాతీయ ఫైనాన్సియల్ కేంద్రం (ఐఎఫ్‌సీ)గా తీర్చిదిద్దుతామని 2006లో అప్పటి ప్రధాని వాగ్దానం చేశారు. సింగపూర్, దుబాయ్, హాంగ్‌కాంగ్ లేదా లండన్‌లతో పోటీ పడగలిగిన నగరం ఏదైనా ఉందీ అంటే అది ముంబయ్యే! ప్రణాళి కలు రచించారు. కమిటీలు వేశారు. రెండు దశాబ్దాలు గడిచినా, ముంబై అంతర్జాతీయ ఫైనాన్షియల్ సెంటర్ కాలేకపోయింది. అది ఇప్పటికీ భారతదేశపు ఆర్థిక రాజధానిగానే ఉంది. అది దేశం ఇచ్చిన పతకం. అంతర్జాతీయ గమ్యస్థానంగా గౌరవం దక్కనే లేదు.
అంతర్జాతీయ ఆర్థిక కేంద్రం?
ఐఎఫ్‌సీ కల సాకారం కాకపోవడానికి బ్యాంకర్లు, వ్యవస్థాపక సామర్థ్యం ఉన్నవారు, న్యాయవాదులు లేదా మూలధనం కొరవ డటం కారణం కాదు. అంతర్జాతీయ నగరాలుగా గుర్తింపు పొంద డానికి పొందికతో కూడిన పాలన, ఉత్తమ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు పెద్ద స్థాయిలో ఉండటం అవసరం. అవి కొరవడటం ముంబై వైఫల్యానికి కారణం. ఈ విషయంలో గుజరాత్ లోని ‘గిఫ్ట్’ సిటీ ముందంజ వేయగలిగింది. ముంబైకున్న సాంస్కృతిక లేదా మార్కెట్ పరిపూర్ణత దానికి ఉండబట్టి కాదు. స్నేహ పూర్వక రెగ్యులేషన్, నగదు ప్రోత్సాహకాలు, ఉన్నత స్థాయి నుంచి లభించిన ప్రోద్బలం ఇతోధికంగా తోడ్పడ్డాయి.
ముంబైకున్న ఆర్థిక స్వయం ప్రతిపత్తి పరిమితం. అక్కడి ఆస్తి పన్ను రేట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఆకర్షణీ యమైన కోస్టల్ రోడ్ ప్రాజెక్టునకు కేంద్రం నుంచో, ఇతర వనరుల నుంచో నిధులు అందాల్సిందే. మెట్రో నెట్‌వర్క్ కూడా చాలావరకు బాహ్య వనరులపైనే ఆధారపడింది. నిర్మాణం పూర్తయి, అమ్ముడుకాని ఫ్లాట్లు రెండు లక్షలకు పైగా ఉన్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. సబబైన ధరలకు గృహ సదుపాయం, వరద నియంత్రణ, ఘన వ్యర్థాల నిర్వహణ లేదా రోడ్డు మరమ్మతులు వంటివి ఎన్నికల ప్రణాళికల్లో ప్రముఖంగా కనిపించవు. రాయితీలు, ఉచిత బస్సు ప్రయాణాలు మేనిఫెస్టోలలో కనిపించాయి కానీ, వాటికి నిధులు ఎక్కడ నుంచి తెస్తారో పేర్కొన లేదు. ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉండే పాలనా వ్యవస్థ పురపాలక సంస్థే. కానీ, వాటి రాజకీయాలు కూడా రాష్ట్ర రాజకీ యాల్లా తయారయ్యాయి.
స్వయం పాలన సాగినప్పుడే...
ట్రిపుల్ (కేంద్ర, రాష్ట్ర, స్థానిక) ఇంజిన్ నినాదం 2017లో మాదిరిగానే మళ్ళీ పనిచేసింది. చీలికలు పీలికల రాజకీయ పర్వంలో ఓటర్లు సుస్థిరతనే ఎంచుకున్నట్లు సంకేతమిచ్చారు. కాస్మోపాలిట నిజంకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. ‘మరాఠీ అస్మిత’కు ముప్పు వాటిల్లుతోందంటూ చూపించబోయిన బూచి పనిచేయలేదు. ముంబై ప్రధాన సమస్య దాన్ని ఎవరు పాలిస్తున్నారు అన్నది ఒక్కటే కాదు. నికరంగా నగర–ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఏమిటన్నది! భారత పబ్లిక్ ఫైనాన్స్, గవర్నెన్సు... రెండూ కూడా నగరాలను రాష్ట్ర ప్రభుత్వాలకు అనుబంధంగానే చూస్తున్నాయి తప్ప, వాటిని స్వయం ప్రతిపత్తి అవసరమైన ఆర్థిక ఇంజిన్లుగా చూడటం లేదు.
వాటికి సామర్థ్యాన్ని సమకూర్చుకునే శక్తినిచ్చి, దీర్ఘకాలిక విస్తృత ప్రణాళికలో భాగం చేయడం లేదు. పట్టణాభివృద్ధి శాఖను ముఖ్యమంత్రే అట్టేపెట్టుకోవడం ఊహించదగిన అంశం అవుతోంది. అది బంగారు బాతు లాంటి శాఖ. అంతర్జాతీయ నగరంగా మారాలని ముంబై నిజంగా భావించే పక్షంలో, దానిలో సంస్థాగతమైన మార్పులు అవసరం. నగరంలో పరిస్థితులకు ఒకే సంస్థ బాధ్యత వహించేటట్లు చేయాలి. వివిధ ఏజెన్సీలను ఒక కోవలోకి తేవాలి. కోశ సంబంధ స్వయం ప్రతిపత్తి ఉండాలి. నియమ నిబంధనల ననుసరించి పర్మిషన్లు తప్పక లభిస్తాయనే నమ్మకం కలగాలి. ఎవరి దయాదాక్షిణ్యాల మీదనో బతికే గుమాస్తాలా మునిసిపాలిటీ పరిణమించకూడదు.
అజీత్ రానాడే
వ్యాసకర్త ప్రముఖ ఆర్థికవేత్త


