మాధవ్ శింగరాజు
దావోస్ నుండి తిరిగి వచ్చేస్తుంటే దారి మధ్యలో ట్రంప్ నా మనసులోకి వచ్చారు! నిజానికి ఆయన ఎవరి మనసులోనికైనా కొత్తగా రావటం ఉండదు. వచ్చేసి, ఇక వెళ్లకపోవటమే ఉంటుంది. ఏం మనిషి!! ప్రపంచాన్ని పిచ్చిగా షేక్ చేస్తున్నారు ఆయన. షేక్ చేయటం అంటే, కదిపేయటం మాత్రమేనా, ‘కలిపేయటం’ కూడా! ట్రంప్ పిచ్చికి ఒక పద్ధతి ఉన్నట్లుగా నాకు తోస్తోంది. పెద ఉప్పెన ఒకటేదైనా వచ్చిపడాలి... మనుషులంతా ఒకరిలోకి ఒకరు మునగదీసుకోవటానికి! దేశాలైనా అంతే, ఉపద్రవం వచ్చిపడితే హద్దులు చెరిపేసుకొని భూభాగాలన్నీ ఒకచోట చేరిపోవలసిందే. మనుషులకన్నా ఏం గొప్పవని ఈ దేశాలు!
ట్రంప్ ఇప్పుడొక ఉప్పెన. ఒక ఉపద్రవం. నాకనిపిస్తోందీ... యూరప్ చాలా కాలంగా సెలవుల్లో ఉన్నట్లుగా ఉండటం వల్ల ట్రంప్‌ను తమాయించుకోలేక పోతున్నదని! సెలవుల నుంచి తిరిగొచ్చాక, ఇంట్లో పని ఉంటుంది; ఒంట్లో బద్ధకంగా ఉంటుంది. ట్రంప్ ఆ బద్ధకాన్ని వదిలించి, మూలన ఉన్న చీపురును చేతికి అందుకునేలా చేశారు. ‘‘గ్రీన్‌ల్యాండ్‌ను కలిపేసుకుంటాం’’ అని ఆయన ఒక్కమాట అనగానే ఐరోపా దేశాలన్నీ మెలకువలోకి వచ్చేశాయి! ఆయన ఒక్కసారిగా ట్యారిఫ్‌లు పెంచేయగానే ఇండియా వంటి దేశాలతో ట్రేడ్ డీల్స్ కోసం పరుగులు పెడుతున్నాయి.
ఈయూ లీడర్లు ప్రస్తుతం ఇండియాలోనే ఉన్నారు. ‘యూరోపియన్ కమిషన్’ ప్రెసిడెంట్ మిస్ ఉర్సులా వాండర్, ‘యూరోపియన్ కౌన్సిల్’ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా... రేపు జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌కు ప్రత్యేక అతిథులు. ఆ మర్నాడే ‘ఇండియా–ఈయూ’ సదస్సు. బహుశా, సెలవుల నుంచి ఎలా తేరుకొని ఎలా పనిలో పడిపోవాలో తెలుసుకునేందుకు ఇండియాతో ఆ సదస్సులో యూరప్ ట్రేడ్ డీల్ కుదుర్చుకోవచ్చు. ఇండియాకు వర్క్ తప్ప వెకేషన్ అలవాటు లేదు కనుక ప్రతిఫలంగా యూరప్ నుంచి వర్క్ తీసుకోవచ్చు.
ట్రంప్ విషయంలో ఇండియా ‘‘ఇలా ఉండాల్సింది’’, ‘‘అలా ఉండాల్సింది’’ అని ఇండియాలోనే కొందరు విమర్శిస్తున్నారు! ‘ఉండాల్సింది’ అనే మాటను ఎప్పుడైనా సరే, భుజాల మీద బరువు లేని తేలికపాటి మనుషులు మాత్రమే అనగలరు. నేను బిజినెస్‌మేన్‌నే కావచ్చు. కానీ నేను జియోపాలిటిక్స్ స్టూడెంట్‌ని కూడా! ట్రంప్ ట్యారిఫ్‌ల శబ్దానికి ప్రతీకారంగా ఇండియా మౌనం వహించటమే దీటైన జవాబు అని నేను నమ్ముతాను. శబ్దానికి శబ్దంతో సవాలు విసిరితే అది తగాదా అవుతుంది. మౌనాన్ని అస్త్రంగా సంధిస్తే అవతలి వాళ్ల శబ్దాలు తాటాకు చప్పుళ్లుగా మాత్రమే మిగులుతాయి! ఇది కదా ప్రత్యర్థి ప్రకోపాన్ని శక్తిహీనం చెయ్యటం!
గాజాను గొప్ప రియల్ ఎస్టేట్‌గా మారుస్తానని ట్రంప్ దావోస్ ఎకనమిక్ ఫోరమ్‌లో అన్నారు! ఒక పిచ్చివాడు అనలేని మాట అది. పచ్చి వ్యాపారి మాత్రమే అలా అనగలడు. చందమామ కోసం గెడకర్రతో ఆకాశాన్ని కదిలిస్తే కనీసం చుక్కలైనా రాలకపోతాయా అని ఆలోచిస్తారు ట్రంప్. ట్రంప్ అనే అధ్యక్షుడిలో ట్రంప్ అనే అనేకమంది వ్యాపారులు ఉన్నారు. లేకుంటే ఆయన గాజాను, గ్రీన్‌ల్యాండ్‌ను పునర్నిర్మించాల్సిన నివాస ప్రాంతాలుగా కాకుండా, కట్టబోయే కమర్షియల్ కాంప్లెక్సులుగా ఎందుకు చూస్తారు?
ఎకనమిక్ ఫోరమ్‌లో ట్రంప్ 72 నిమిషాల పాటు మాట్లాడారు. ఆయన ప్రతి మాటలోనూ ‘అమెరికా ఫస్ట్’ అనే క్లాసిక్ నినాదం చాలా కఠినంగా ధ్వనించింది!
ఫస్ట్ అన్నప్పుడు పరుగెత్తి ఫస్ట్ రావాలి. కానీ ట్రంప్, అమెరికాను ఉన్నచోటనే ఉంచి, అమెరికా ఫస్ట్ అనిపించేలా ప్రపంచం ఉన్న ఆర్డర్‌ని మార్చాలని చూస్తున్నారు! ఆశ్చర్యం ఏముంది?! ఫక్తు వ్యాపారి అలాగే కదా చూస్తాడు, అలాగే కదా చేస్తాడు!


