‘ఏం తమ్మీ మంచి గున్నవా?’..
‘మంచిగున్న అన్నా.. నిన్నిట్టా సీఎం పోస్టులో జూస్తాంటే బలే హేపీగా ఉన్నదన్నా’..
‘మీ బాపూ చూపించిన దారే గద తమ్మీ. అందుకే గద తమ్మీ.. సార్ని నేను దేవుడంటా వుంటా’..
‘నీ అసుంటి మంచోడు దునియాలోనే వుండడన్నా.. మంచి జేసినా గూడా యెనకాల గోతులు తవ్వేటోల్లే తప్ప.. ఇలా యాది పెట్టుకునేటోళ్లు యెవరుంటున్నారన్నా’..
‘అరె ఛుప్. అలా గట్టిగా అనకురా తమ్మీ.. నీ బాపు గురించి నువ్వే సీక్రెట్స్ బయటపెట్టేస్తన్నావని.. అందరూ క్రిటిసైజ్ చేస్తారు మల్ల’..

‘అర్రర్రె పాయింటు మర్చిపొయినా! అది మన హిస్టరీనే గదా.. బలే గుర్తుచేశావ్ రేవంతన్నా. మనలో మనం మురిసిపోవచ్చు గానీ.. బయటకు అనగూడదు కరక్టే.’
‘నీ బాపు ఎక్కడ తమ్మీ.. కానొస్తలేడు. అందరం దావోస్ లోనే ఉన్నం. ఒకే చోట తిరుగుతున్నం. ఒకే పంచాయతీలు పెడుతున్నాం. పుటో దిగుతున్నం. డప్పు గొట్టిపిచ్చుకుంటున్నం.. అయినా మీ నాయిన కానొస్తలేడేంది తమ్మీ’..
‘ఊకో అన్నా.. దావోస్ ల నువ్వు ఉన్నావంటేనే మా నాయినకు జొరమొచ్చేట్టుంది. దూరం నుంచి నువ్వు గనిపిస్తే చాలు.. తప్పించుకు తిరుగుతున్నాడు పాపం..’
‘గదేంది తమ్మీ.. నీ బాపు గనిపిస్తే క్లోజ్డ్ రూంల సిటింగేసి ముచ్చట బెట్టాలనుకుంటి’

‘ఊర్కో అన్నా. ఒక క్లోజ్డ్ రూం ముచ్చటనే బరాబర్ బజార్ల పెట్టేశావు. దునియా అంతా మా మొహాన దుమ్మెత్తి పోస్తాంటే లాక్కోలేక పీక్కోలేక నానా యాతన అవుతాంది. మా మినిస్టర్లను జూసినవా. నిన్ను ఒక్క మాటైన అననీకి, నువు జెప్పింది అబద్దం అననీకి దైర్యం లేదు. కానీ.. మా నాయిన మీద బురదని మాత్రం కడిగెయ్యాలి.. అందుకోసం ఎన్ని పాట్లు పడుతున్నారో జూసినవా..’
‘మరైతే బాపును క్లోజ్డ్ రూం ల కలవడం కుదరదంటవా..’
‘నువ్వింకోపాలి ఆ క్లోజ్డ్ రూం మాటెత్తితే దావోస్ నుంచే పారిపోయేట్టున్నాడన్న మా నాయిన’
‘చల్ తియ్.. అయితే మాన్లె. నిన్నయినా ఇట్ట ఓపెన్ రూం కల్సులు అయ్యె ఈ తానకి’
‘అయినా రేవంతన్నా.. ఏడాదికి మించి కుర్సీలో ఉండవేమో అనుకుంటినే’
‘గట్లెట్ల అవుతది తమ్మీ.. నాదేమైనా గసుమంటి గిసుమంటి ట్రెయినింగనుకుంటివా? మీ బాపు దగ్గర నేర్చుకుంటినని యాద్ మరిసితివా? ఎవులైతే మన కుర్సీ మీద కన్నేసిన్రో.. ఆల్లందరూ ఇప్పుడు అవినీతి కంప్లయింట్ల బురదలో పడి కొట్టుకుంటున్నరు.. జూసినవా’

‘అరె.. ఏం వుషారున్నవ్ రేవంతన్నా.. ఈ లెక్కన నీకు అయిదేళ్లూ కుర్సీ గ్యారంటీ స్కీముంటదేమో నన్నా’
‘తప్పదు గద తమ్మీ.. వుషారుండాలె. దునియా అందరికీ నీ బోంట్ల కుర్సీలో కూర్సోబెట్టే బాపు వుండడు గద తమ్మీ’
‘ఎక్కడన్నా.. కూర్సొనుడు కూర్సొనుడ అనుకోడమే గానీ.. ఎప్పుటికి గూర్సుంటనో ఏమో’
‘నీకు మించి నీ బాపుకి మస్తు కోరికున్నది గానీ.. ఫికరు జెయ్యకు తమ్మీ.. జరూరు కుర్సీ నీదే..’
‘మా సోపతోల్లు ఊకుంటరో లేదో నని చిన్న గుబులున్నది అన్నా’
‘చల్ తియ్.. గింత బేకారున్నవేంది తమ్మీ. నీ సోపతుల్లో పవన్ కల్యాణు నీ కుర్సీ మోసేటందుకే ఎగబడుతోంటే నువ్వు ఫికరౌతవేంది. బేఫికరుండు.. అంతగైతే నేనున్న గద. మంత్లీ మంత్లీ డిల్లీకి జమాయిస్తన్నది కాస్తా ఓపాలి నీకు జమాయిస్త. గంతె. జబర్దస్త్ నువు కుర్సీలో కొస్తవ్.. నాదీ గేరంటీ’
‘ఆ మాట అనబోకు రేవంతన్నా.. నీ ఆరు గేరంటీల్లోనే యిది గూడా కలిపేస్తావేమో’
‘ఇంత పిచ్చోనివి ఎలా బతుకుతవ్ రా బై. మందికిచ్చేటిది.. నా దేముని కొడుకైన తమ్మీకిచ్చేటిది వొకటే అవుతదా’
‘ఆ మాటన్నావ్.. దైర్యంగా వుందన్నా’
‘చల్ పోదం పా. ఉన్నూర్లో ముచ్చట్లాడుకోవాలంటే.. గాలికి గూడా సెవులు మొలుస్తయ్.. యింటా వుంటయ్.. యింత కష్టపడి స్పెషలు గాలిమోటర్లేసుకుని దావోసు కొచ్చినం. యిక్కడైనా మన మనసులో ముచ్చట్లు పంచుకోకుంటే గెట్ల? యింక పోదాం తియ్’
::రాజేశ్వరి


