పట్నా: రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ తన చిన్న కుమారుడు రాజకీయ వారసుడు తేజస్వీ యాదవ్ (36)కు ప్రమోషన్ కల్పించారు. తేజస్వీకి పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగించారు. ఆదివారం జరిగిన పార్టీ జాతీయ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆర్జేడీ ఎక్స్‌లో తెలిపింది.
సమావేశానికి లాలు ప్రసాద్ యాదవ్, తేజస్వీ యాదవ్‌తోపాటు లాలు పెద్ద కుమార్తె, పాటలీపుత్ర ఎంపీ మిసా భారతి తదితరులు హాజరయ్యారని పేర్కొంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసిన మహాగఠ్‌బంధన్ ఘోర పరాజయం మూటగట్టుకోవడం తెల్సిందే. తేజస్వీ, ఆయన సన్నిహితుడు సంజయ్ యాదవ్‌లే అందుకు కారణమంటూ లాలు పెద్ద కుమార్తె రోహిణీ ఆచార్య ఆరోపణలు చేయడం తెల్సిందే. మరో కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను లాలు యాదవ్ గతేడాది పార్టీ నుంచి బహిష్కరించారు.


