రూ. 734 కోట్లు కొల్లగొట్టినట్లు ఆరోపణలు
న్యూఢిల్లీ: రియల్ మనీ ఆన్‌లైన్ గేమింగ్ యాప్, దాని ప్రమోటర్లపై చార్జిషీట్లు వేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆదివారం తెలిపింది. కృత్రిమ మేధను ఉపయోగించుకుని ప్రజల నుంచి ప్రమోటర్లు రూ.734 కోట్లు కొల్లగొట్టారని ఆరోపించింది. ఈ మేరకు బెంగళూరులోని ఈడీ జోనల్ కార్యాలయం ఈ నెల 23న మనీలాండరింగ్ కేసుల ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.
విన్‌జో ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్లు పావన్ నందా, సౌమ్యా సింగ్ రాథోడ్‌లతోపాటు అనుబంధ సంస్థలైన విన్‌జో యూఎస్, జో ప్రైవేట్ లిమిటెడ్, విన్‌జో ఎస్‌జీల పేర్లను చార్జిషీటులో నిందితులుగా చేర్చామంది. విన్‌జో మొబైల్ యాప్‌లో ఆఫర్ చేసిన 100కు పైగా గేమ్‌లకు 25 కోట్ల మంది యూజర్లు ఉన్నారని, వీరిలో అత్యధికులు టయర్–3, టయర్–4 నగరాల పరిధిలోని వారేనని ఈడీ వివరించింది.కేంద్ర ప్రభుత్వం 2025 ఆగస్ట్‌లో ఆన్‌లైన్ గేమ్‌లను నిషేధించాక కూడా ఈ యాప్ పనిచేసిందని, ఆ సమయంలో జనం నుంచి వసూలు చేసిన సుమారు రూ.48 కోట్లను తిరిగి చెల్లించలేదని ఆరోపించింది.


