ప్రతిష్టాత్మక పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
ఈ ఏడాది మొత్తం 131 మందికి పద్మ అవార్డులు
ఐదుగురికి పద్మవిభూషణ్, 13 మందికి పద్మభూషణ్
113 మందికి పద్మశ్రీ పురస్కారాలు
ధర్మేంద్ర, వీఎస్ అచ్యుతానందన్‌లకు పద్మవిభూషణ్..
మమ్ముట్టి, అల్కా యాగ్నిక్‌లకు పద్మభూషణ్
రోహిత్ శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, మురళీమోహన్‌లకు పద్మశ్రీ
తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులకు దక్కిన గౌరవం
సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేళ కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటించింది. 2026 సంవత్సరానికి గాను ఆదివారం విడుదల చేసిన ఈ జాబితాలో వివిధ రంగాలకు చెందిన 131 మంది ప్రముఖులకు స్థానం దక్కింది. ఇందులో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ఈసారి అవార్డు గ్రహీతల్లో 19 మంది మహిళలు ఉండగా, 16 మందికి మరణానంతరం పురస్కారాలు ప్రకటించారు. అలాగే విదేశీయులు, ఎన్నారైల విభాగంలో ఆరుగురు ఎంపికయ్యారు. కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్, వైద్యం, సాహిత్యం, క్రీడలు తదితర రంగాల్లో నిష్ణాతులైన వారికి పద్మ పురస్కారాలు ప్రకటించారు.
దేశానికి అసాధారణ సేవలందించినందుకు ఇచ్చే పద్మవిభూషణ్ పురస్కారం ఈసారి బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్రసింగ్ దేవల్ (మహారాష్ట్ర), కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్.అచ్యుతానందన్‌లను మరణానంతరం వరించింది. వీరితో పాటు ప్రజా వ్యవహారాల విభాగంలో కె.టి.థామస్(కేరళ), కళల విభాగంలో ఎన్.రాజమ్(ఉత్తరప్రదేశ్), సాహిత్యం, విద్య విభాగంలో పి.నారాయణన్ (కేరళ) ఈ అత్యున్నత గౌరవానికి ఎంపికయ్యారు. ఇక విశిష్ట సేవలకుగాను ఇచ్చే పద్మభూషణ్ జాబితాలో ప్రముఖ గాయని అల్కా యాగ్నిక్, మలయాళీ నటుడు మమ్ముట్టి, మాజీ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, పారిశ్రామికవేత్త ఉదయ్ కోటక్, టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్‌రాజ్, ప్రచార రంగ దిగ్గజం పియూష్ పాండే వంటి వారున్నారు.
తెలుగు రాష్ట్రాలకు పద్మ పంట
తెలుగు రాష్ట్రాలకు ఈసారి పద్మ పురస్కారాల్లో పెద్దపీట దక్కింది. ఆంధ్రప్రదేశ్ నుంచి సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్‌ను కళల విభాగంలో పద్మశ్రీ వరించింది. అలాగే గద్దె బాబూ రాజేంద్ర ప్రసాద్(కళలు), మరణానంతరం గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్(కళలు), వెంపటి కుటుంబ శాస్త్రి(సాహిత్యం) ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి దీపికారెడ్డి(కళలు), వైద్య రంగంలో గూడూరు వెంకట రావు, పాల్కొండ విజయ్‌ఆనంద్‌రెడ్డి పద్మశ్రీ అందుకోనున్నారు. సైన్స్ రంగంలో చంద్రమౌళి గడ్డముణుగు, కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్, కుమారస్వామి తంగరాజ్, పశుసంవర్థక విభాగంలో రామారెడ్డి మామిడి (మరణానంతరం) తెలంగాణ కీర్తిని ఇనుమడింపజేశారు. అలాగే.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మాజీ చైర్మన్, తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన మామిడాల జగదీశ్ కుమార్ సాహిత్యం, విద్యా రంగంలో పద్మశ్రీ వరించింది.
క్రీడా, సినీ రంగాలకు చెందిన పలువురు ఇతర ప్రముఖులకు కూడా పద్మశ్రీ దక్కింది. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ భుల్లర్, హాకీ క్రీడాకారిణి సవితా పునియాలను పద్మశ్రీ వరించింది. సినీ రంగం నుంచి బెంగాలీ నటుడు ప్రోసెన్‌జిత్ ఛటర్జీ, మరణానంతరం నటుడు సతీష్ షా, అనిల్ కుమార్ రస్తోగి ఈ జాబితాలో ఉన్నారు. మార్చి లేదా ఏప్రిల్‌లో రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా వీరు పురస్కారాలు అందుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీకి ఎంపికైన వారు
⇒ మాగంటి మురళీమోహన్(కళల విభాగం)
⇒ గద్దె బాబూ రాజేంద్ర ప్రసాద్(కళల విభాగం)
⇒ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ (మరణానంతరం) కళల విభాగం
⇒ వెంపటి కుటుంబ శా్రస్తి(సాహిత్యం మరియు విద్య)
తెలంగాణ నుంచి పద్మశ్రీకి ఎంపికైన వారు
⇒ దీపికా రెడ్డి (కళల విభాగం)
⇒ గూడూరు వెంకట రావు (వైద్య విభాగం)
⇒ పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి (వైద్య విభాగం)
⇒ చంద్రమౌళి గడ్డముణుగు (సైన్స్–ఇంజనీరింగ్)
⇒ కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్ (సైన్స్, ఇంజనీరింగ్)
⇒ కుమారస్వామి తంగరాజ్ (సైన్స్, ఇంజనీరింగ్)
⇒ రామారెడ్డి మామిడి (మరణానంతరం)–పశుసంవర్థక విభాగం
పద్మవిభూషణ్ (5)
దేశానికి అసాధారణ సేవలందించినందుకు ఇచ్చే రెండో అత్యున్నత పురస్కారం ఐదుగురిని వరించింది.
⇒ ధర్మేంద్రసింగ్ దేవల్ (మరణానంతరం): కళలు (మహారాష్ట్ర)
⇒ కె.టి.థామస్: ప్రజా వ్యవహారాలు (కేరళ)
⇒ ఎన్.రాజమ్: కళలు (ఉత్తర ప్రదేశ్)
⇒ పి.నారాయణన్: సాహిత్యం మరియు విద్య (కేరళ)
⇒వి.ఎస్.అచ్యుతానందన్ (మరణానంతరం): ప్రజా వ్యవహారాలు (కేరళ)
పద్మభూషణ్ (13)
విశిష్ట సేవలకు గాను 13 మందిని పద్మభూషణ్ వరించింది.
⇒ అల్కా యాగ్నిక్: కళలు (మహారాష్ట్ర)
⇒ మమ్ముట్టి: కళలు (కేరళ)
⇒ ఉదయ్ కోటక్: వాణిజ్యం, పరిశ్రమలు (మహారాష్ట్ర)
⇒ భగత్ సింగ్ కోష్యారీ: ప్రజా వ్యవహారాలు (ఉత్తరాఖండ్)
⇒ విజయ్ అమత్‌రాజ్: క్రీడలు (అమెరికా)
⇒ పియూష్ పాండే (మరణానంతరం): కళలు (మహారాష్ట్ర)
‘ఆకాశ్’ మార్గదర్శకుడు
మధిర: ఖమ్మం జిల్లా మధిరకు చెందిన ఆకాశ్ క్షిపణి మాజీ డైరెక్టర్ డా.గడ్డముణుగు చంద్రమౌళి ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. 1958 నవంబర్ 9న మధిరలో గడ్డమణుగు సత్యనారాయణరావు, సరస్వతిదేవి దంపతులకు జన్మించిన చంద్రమౌళి.. ప్రాథమిక విద్య నుంచి ఇంటర్ వరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదివారు. వరంగల్ ఎన్‌ఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఢిల్లీ ఐఐటీలో ఎంటెక్, ఉస్మానియా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో డాక్టరేట్ పట్టా పొందారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)లో 34 ఏళ్ల పాటు ఉద్యోగం చేశారు.
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం టీమ్‌లో సమర్థవంతంగా పనిచేశారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ప్రఖ్యాతిగాంచిన ఆకాశ్ క్షిపణి ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేసి భారత ప్రభుత్వం మన్ననలు పొందారు. ఆకాశ్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి వ్యవస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా భారత వైమానిక దళం, సైన్యం కోసం క్షిపణి ఉత్పత్తి బాధ్యతలను నిర్వర్తించారు. ఆయన మార్గదర్శకత్వంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఆకాశ్ క్షిపణి వ్యవస్థ విజయవంతంగా అభివృద్ధి చెందింది. 60 కంటే ఎక్కువ ఆకాశ్ క్షిపణుల విజయవంతమైన ప్రయోగాలను పర్యవేక్షించి, వ్యవస్థ పనితీరుపై రక్షణ దళంలో విశ్వాసాన్ని పెంచారు. ఆకాశ్ ప్రాజెక్ట్ ద్వారా దేశీయ రక్షణ పరిశ్రమకు రూ.22 వేల కోట్లకుపైగా ఆర్డర్లు లభించాయి.
వైద్యరంగంలో విశిష్ట సేవలకు..
సాక్షి, హైదరాబాద్: ఏఐజీ ఆసుపత్రి డైరెక్టర్ డా.గూడూరు వెంకట రావును పద్మశ్రీ వరించింది. ఏఐజీ హైదరాబాద్ ఆసుపత్రి ఆర్కిటెక్చర్‌గా, సహ వ్యవస్థాపకుడిగా, అంతర్జాతీయంగా వైద్యరంగంలో అందించిన విశిష్ట సేవలకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. గ్యాస్ట్రోఎంట్రాలజీలో వెంకటరావుకు మూడు దశాబ్దాలకుపైగా క్లినికల్ అనుభవం ఉంది. సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ల్యాప్రోస్కోపిక్ సర్జన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. డాక్టర్ జీవీ రావుగా పిలిచే ఆయన ఇప్పటివరకు 12,000కు పైగా సర్జరీలు విజయవంతంగా నిర్వహించారు. ‘ట్రాన్స్ ఓరల్ ఎండోస్కోపిక్ అపెండెక్టమీ’లాంటి సంక్లిష్ట శస్త్రచికిత్సలు నిర్వహించినవారిలో ఆద్యుడు. డయాబెటిస్ చికిత్స కోసం ‘మ్యాక్రో ఎన్‌క్యాప్సులేషన్ డివైజ్’ను రూపొందించిన వైద్యనిపుణుడిగా ఖ్యాతిగడించారు.
ప్రత్యేక అనుభూతినిచ్చింది: గూడూరు వెంకట రావు
వ్యక్తిగతంగా సాధించిన విజయాలన్నింటిలోనూ పద్మశ్రీ ప్రత్యేక అనుభూతినిచ్చింది. రోగి సంరక్షణకు అంకితభావంతో పనిచేసే నా సహోద్యోగుల బృందానికి, ఏఐజీ కుటుంబ సభ్యులకు రుణపడి ఉంటాను. నా కెరీర్‌కు మద్దతుగా నిలిచిన డా. నాగేశ్వర్‌రెడ్డిని తప్పనిసరిగా ఇక్కడ గుర్తుచేసుకోవాలి. ఆపరేషన్ గదికి మించి సంస్థ నిర్మాణం, విద్యా శిక్షణ–పరిశోధన, సమాజానికి సేవ చేసే రంగంలో గుర్తించినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక కృతజ్ఞతలు. తరువాతి తరం సర్జన్లకు శిక్షణ ఇవ్వడం, ఆరోగ్య సంరక్షణ, సంస్థల బలోపేతం, నాణ్యమైన వైద్యం అందేలా చూడటం నా ప్రయాణంలో ప్రధానమైన అంశాలు.
పేదరికం నుంచి ప్రపంచ స్థాయికి..
డా.నోరి దత్తాత్రేయుడు (పద్మభూషణ్)
సాక్షి, అమరావతి: కేన్సర్ మరణ శాసనం కాదు.. సరైన సమయంలో గుర్తిస్తే ఆ మహమ్మారిని జయించవచ్చని నిరూపించి అంతర్జాతీయంగా ప్రసిద్ధిగాంచిన తెలుగుతేజం, ప్రముఖ కేన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడును ‘పద్మ’ పురస్కారం వరించింది. దత్తాత్రేయుడు కృష్ణాజిల్లా మంటాడ గ్రామంలో 1947 అక్టోబరు 21న జన్మించారు. కర్నూలు ప్రభుత్వ మెడికల్ కళాశాల నుంచి 1971లో ఎంబీబీఎస్ పట్టా తీసుకున్న ఆయన, ఉస్మానియా మెడికల్ కళాశాలలో పీజీ పూర్తిచేశారు. గాం«దీ, ఉస్మానియా ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేశారు. అనంతరం అమెరికా వెళ్లారు. తల్లిదండ్రులకు 12 మంది సంతానంలో ఆఖరివాడైన నోరి నాలుగో ఏటలోనే తండ్రిని కృష్ణా వరదల్లో కోల్పోయారు. అనంతరం.. అత్యంత పేదరికం అనుభవిస్తూ తన తల్లి కష్టాన్ని గుర్తెరిగిన ఆయన ప్రపంచంలోనే టాప్ అంకాలజిస్టుల్లో ఒకరిగా ఎదిగారు. కేన్సర్ వ్యాధిపై 4 పుస్తకాలు రాశారు.
విద్యారంగంలో కృషి..
నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాలకు చెందిన జగదీశ్‌కుమార్‌కు పద్మశ్రీ అవార్డు లభించింది. లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ విబాగానికి గాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. జగదీశ్‌కుమార్ యూజీసీ చైర్మన్‌గా, జేఎన్‌యూ వైస్ చాన్స్‌లర్‌గా పని చేశారు. ఆయన తండ్రి రంగారావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తల్లి జయప్రద పెద్దగా చదువుకోలేదు. ఇంట్లో పెద్దవాడైన జగదీశ్ 1 నుంచి 7 వరకు సొంతూరు మామిడాల ప్రాథమిక పాఠశాలలో చదివారు. ఇంటర్ వరకు మిర్యాలగూడలో, డిగ్రీ, ఎంఎస్‌సీ (ఎల్రక్టానిక్స్) హైదరాబాద్‌లో చదివారు. మద్రాస్ ఐఐటీలో ఎంఎస్ చదివి అక్కడే పీహెచ్‌డీ పూర్తి చేశారు.
కెనడాలో పోస్ట్ డాక్టరేట్ ఫెలోషిప్ చేశారు. తర్వాత ఖరగ్‌పూర్ ఐఐటీలో ప్రొఫెసర్‌గా పని చేశారు. తర్వాత ఢిల్లీ ఐఐటీలో, జేఎన్‌యూ ఢిల్లీలో విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత మూడేళ్లు గేట్ చైర్మన్‌గా పనిచేశారు. 2016లో ఢిల్లీ జేఎన్‌యూ వైస్ చాన్స్‌లర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత కేంద్రం ఆయనను యూజీసీ చైర్మన్‌గా నియమించింది. నానో ఎల్రక్టానిక్ డివైసెస్, నానో స్కేల్ డివైస్ మోడలింగ్, సిమ్యులేషన్, ఇన్నోవేటివ్ డివైస్ డిజైన్, పవర్ సెమీ కండక్టర్ డివైజ్ విభాగంలో జగదీశ్ నిష్ణాతులు. ఆయన పరిశోధనల ఆధారంగా పలు పేటెంట్లు లభించాయి.
బాధ్యతను మరింత పెంచింది: జగదీశ్
పద్మశ్రీ అవార్డు నా బాధ్యతను మరింతగా పెంచింది. ఉన్నత విద్యను మరింతగా ముందుకు తీసుకెళ్లడంతోపాటు సరళంగా అందుబాటులోకి తెచ్చేందుకు చేయాల్సిన కృషిని ఈ అవార్డు నాపై ఉంచింది. రానున్న కాలంలో మన వర్సిటీలు, కళాశాలలను బలోపేతం చేయాలి. ఉపాధ్యాయులకు మరింత శిక్షణ ఇవ్వాలి. ఆవిష్కరణలను ప్రోత్సహించాలి.

గ్రామాల్లో ఆర్థిక సాధికారతకు బాటలు
శంషాబాద్: సహకార సంఘాల బలోపేతం.. పాడిపరిశ్రమ అభివృద్ధితో ప్రజలు సాధించే ఆర్థిక సాధికారతే సామాజిక శ్రేయస్సుగా నాలుగు దశాబ్దాలు కృషి చేసిన మామిడి రామారెడ్డికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. మామిడి భోజిరెడ్డి, లీలావతి దంపతులకు 1942 ఫిబ్రవరి 24న జన్మించారు. ఆయన తండ్రి భోజిరెడ్డి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేశారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా నగరంలోని ఇందిరాసేవాదన్‌లో సంగం లక్ష్మీబాయి విద్యాసంస్థలను నెలకొల్పారు. రామారెడ్డి చాదర్‌ఘాట్ పాఠశాలలో చదివి ఆ తర్వాత నిజాం కళాశాలలో బీఎస్సీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం చేశారు. అమెరికాలోని ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో రాజకీయాంశాలపై పీజీ చేశారు.
రాజేంద్రనగర్ బ్లాక్‌లోని పంచాయతీ సమితి అధ్యక్షుడిగా, శంషాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌గా పనిచేసిన రామారెడ్డి ఆ తర్వాత తండ్రి స్థాపించిన విద్యాసంస్థల ద్వారా మహిళలకు విద్యనందిస్తూనే సహకార వ్యవస్థ బలోపేతానికి శ్రీకారం చుట్టారు. గడచిన నాలుగు దశాబ్దాలుగా ఆయన సహకార వికాస సంస్థ పేరిట వరంగల్, కరీంనగర్, హనుమకొండ తదితర జిల్లాలో మొత్తం 755 సహకార సంఘాలను ఏర్పాటు చేయించారు. ఈ సంఘాలు ప్రస్తుతం 550 కోట్ల టర్నోవర్‌తో స్వయం సమృద్ధిని సాధించాయి. ఆయనకు పద్మశ్రీ రావడంపై అతని శంషాబాద్‌వాసులు హర్షం వ్యక్తం చేశారు. రామారెడ్డి గత అక్టోబరు 26న మరణించారు.
గుర్తింపు వచ్చినందుకు సంతోషం
స్వయం సమృద్ధి, పరస్పర సహకారమనే అంశాలతోనే ఆయన సహకార సంఘాలతో ఆర్థిక చైతన్యంతోపాటు సాధికారతకు బాటలు వేశాడని రామారెడ్డి భార్య శ్యామల ‘సాక్షి’తో చెప్పారు. ఆయన సేవలను ప్రభుత్వం గుర్తించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఆయన లక్ష్యాన్ని ప్రభుత్వాలు కొనసాగించాలని ఆకాంక్షించారు.
ఐదున్నర దశాబ్దాలుగా నృత్యంలో...
తెలంగాణకు చెందిన నృత్య కళాకారిణి దీపికారెడ్డి. ఆమె 1965, సెప్టెంబర్ 15న హైదరాబాద్‌లో జన్మించారు. తండ్రి వీఆర్ రెడ్డి సొలిసిటర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు. తల్లి రాధికారెడ్డి కూచిపూడి నృత్యకారిణి. తాత నూకల రామచంద్రా రెడ్డి మాజీ మంత్రి. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ’దీపాంజలి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కూచిపూడి’ ద్వారా వేలాది మంది నృత్య దీపికలను తయారుచేశారు. ఐదున్నర దశాబ్దాలుగా నృత్య కళారంగానికి సేవ చేస్తున్నారు.
ప్రతి నెలా కొత్త కాన్సెప్ట్ : దీపికారెడ్డి
మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. కూచిపూడి నృత్యం అనేది ఒక కళ కాదు. అది భగవంతుని ఆరాధనగా భావిస్తాం. ఐదున్నర దశాబ్దాల కృషికి గుర్తింపు లభించింది. పౌరాణిక గాథలను వేదికల మీద, దేవాలయాల దగ్గర నృత్య ప్రదర్శనలు ఇచ్చినప్పుడు ఆ భగవంతుడికి దగ్గరయ్యామన్న అనుభూతిని పొందుతాం. అలాంటి అనుభూతిని ఈ రోజు పొందాను. ప్రతి నెలా ఒక కొత్త కాన్సెప్ట్ ను కూచిపూడి నృత్యం ద్వారా ప్రజల ముందుకు తెస్తున్నాం. దీంట్లో భాగంగా పర్యావరణం, మహిళలు, సామాజిక అవగాహన అంశాలూ ఉంటున్నాయి.
వెంపటి చిన సత్యం గారు గురువుగా లభించడం నాకు ఓ వరం. మా అమ్మ, నేను, నా కూతురు.. మూడు తరాలుగా నృత్య సాధన చేస్తున్నాం. ఈ కూచిపూడి నృత్య ప్రయాణంలో మా అమ్మన్నాన్నలు వీఆర్ రెడ్డి, రాధికా రెడ్డి, నా భర్త శ్యామ్‌గోపాల్, నా పిల్లలు అభినవ్, శ్లోకా.. నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. గీతాంజలి నృత్య అకాడమీ ద్వారా ఎంతోమంది దేశ విదేశాల్లో ఉన్న మా విద్యార్థులు మన భారతీయ సంస్కృతిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇన్నేళ్లుగా నన్ను ఆదరించి, ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఎంతోమంది కళాకారులు కనే అత్యుత్తమ కళ ఇది. ఎంతో సంతృప్తినిచ్చింది.
జన్యుశాస్త్ర రంగంలో సేవలకు..
లాలాపేట: హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్–సీసీఎంబీ సైంటిస్టు డా.కుమారస్వామి తంగరాజ్‌ను పద్మశ్రీ పరస్కారం వరించింది. ‘సీఎస్‌ఐఆర్ భట్నాగర్ ఫెలో’గా జన్యు శాస్త్ర రంగంలో చేసిన అత్యుత్తమ కృషికిగాను ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఆయన తమిళనాడు రాష్ట్ర చంగల్‌పట్ జిల్లా చేయుర్‌లో 1963 జూన్ 2న జన్మించారు. విద్యాభ్యాసం అంతా తమిళనాడులోనే చేశారు. భారతీయ జనాభా మూలం, అనుబంధాలు, వ్యాధి దృక్పథాలను అర్థం చేసుకోవడంలో తంగరాజ్ చేసిన పరిశోధనలు దోహదపడతాయి.
రేడియేషన్ ఆంకాలజీలో విస్తృత సేవలు
దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ స్వీకరించిన డాక్టర్ విజయానంద్ రెడ్డి 1982లో హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత పొందారు. తర్వాత రేడియేషన్ ఆంకాలజీలో ఎండీ, డీఎన్‌బీలతో ప్రస్తుతం హైదరాబాద్‌లోని అపోలో కేన్సర్ సెంటర్‌లో ప్రొఫెసర్‌గా, హెచ్‌ఓడీగా... అలాగే ఆ సంస్థకు డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. గతంలో ఆయన అసోసియేషన్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్స్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా, ఇండియన్ కాలేజ్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజీకి చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. నాలుగు దశాబ్దాలకు పైగా వైద్యరంగానికి అందించిన సేవలకుగాను ఆయనకు పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. ఆయన రాసిన అనేక వ్యాసాలకు బంగారు పతకాలూ అందాయి.
నా సేవలు నా దేశానికే: డాక్టర్ విజయానంద్ రెడ్డి
నా మాతృభూమికే నా సేవలు అంకితం కావాలనుకున్నాను.. అందుకే ఇక్కడే ఉండిపోయా. అప్పట్లో కేన్సర్‌ను ప్రాణాంతకమైన వ్యాధిగా చూసేకాలం నుంచి... క్రమంగా అది కూడా ఓ సాధారణమైన జబ్బు ‘అదీ మామూలుగానే తగ్గిపోతుందిలే’అని పేషెంట్స్‌లో భరోసా నింపేలా కేన్సర్ రోగులకు సేవలందించా. నాలుగు దశాబ్దాలకు పైగా అందించిన సేవలను దేశం గుర్తించినట్లుగా ఓ మంచి అనుభూతికి లోనవుతున్నా. నాకు వచ్చిన ‘పద్మశ్రీ’నాది మాత్రమే కాదు... రోగులకు వాళ్ల వెతలను దూరం చేయడంలో నాతోపాటు సహకరించిన నా సహాయకులు, మా ఆస్పత్రి సిబ్బందితోపాటు నా మీద నమ్మకముంచి ఆరోగ్యవంతులైన నా పేషెంట్లు అందరిదీ అని భావిస్తున్నా. ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచింది.


