ఢిల్లీ: 2026గానూ పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఇవాళ ( జనవరి 25, ఆదివారం) ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒకరోజు ముందుగానే ఈ పురస్కారాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందికి పద్మ అవార్డులు లభించాయి. తెలంగాణకు చెందిన ఏడుగురు, ఏపీకి చెందిన నలుగురికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి.
సినీ నటులు రాజేంద్రప్రసాద్(ఏపీ), మాగంటి మురళీమోహన్(ఏపీ) పద్మశ్రీ అవార్డులు లభించాయి. కళల విభాగంలో గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్(ఏపీ), దీపికారెడ్డి(తెలంగాణ) పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. వైద్య విభాగంలో గూడూరు వెంకటరావు(తెలంగాణ) పద్మశ్రీ, పాలకొండ విజయ్ ఆనంద్‌రెడ్డి(తెలంగాణ)లకు పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి.
సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో చంద్రమౌళి గడ్డమానుగు (తెలంగాణ), కృష్ణమూర్తి బాలసుబ్రమణ్యం(తెలంగాణ), కుమారస్వామి తంగరాజు (తెలంగాణ), విద్య విభాగంలో వెంపటి కుటుంబ శాస్త్రి(ఏపీ), పశుసంవర్ధక విభాగంలో రామారెడ్డి మామిడి (తెలంగాణ)కి పద్మశ్రీ పురస్కారాలు వరించాయి.


