ఎన్నికల కమిషన్‌పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు
అడ్డుకుని తీరుతామని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్షా లను నాశనం చేసేందుకు ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) ముసుగులో ఎన్నికల కమిషన్(ఈసీ) కుట్ర పన్నిందని కాంగ్రెస్ ఆరోపించింది. దీనికి నిరసనగా డిసెంబర్ మొదటివారంలో ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో భారీ ర్యాలీ చేపడతామని ప్రకటించింది. ఎస్‌ఐఆర్ ప్రక్రియ అమలవుతున్న సమయంలో ఈసీ వైఖరి తీవ్ర నిరుత్సాహం కలిగించిందని పేర్కొంది. లక్షిత ఓట్లను తొలగించే ఉద్దేశంతోనే ఈ ప్రక్రియ సాగిందని ఆరోపించింది. కేంద్రంలోని బీజేపీ ఛత్రం కింద పనిచేయడం లేదని ఈసీ తక్షణమే నిరూపించుకోవాలని డిమాండ్ చేసింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ–కాంగ్రెస్ సారథ్యంలోని మహాగఠ్‌బంధన్ అనూహ్యంగా ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం సమావేశమైంది.
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సారథ్యంలో మంగళవారంజరిగిన ఈ భేటీలో రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఎస్‌ఐఆర్ జరిగే 12 రాష్ట్రాల అధ్యక్షులు, శాసనసభా పక్షాల నేతలు, పార్టీ రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల కార్యదర్శులు పాల్గొన్నారు. అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్ష పార్టీలను నాశనం చేసేందుకు ఈసీ ప్రయత్నించడం, దేశ చరిత్రలో ఇదే మొదటిసారని పేర్కొన్నారు. ‘మేం జనంలోకి వెళతాం. డిసెంబర్ మొదటి వారంలో రాంలీలా మైదాన్‌లో లక్షలాది మంది ప్రజలతో భారీ ర్యాలీ చేపడతాం.
ఈసీ బండారాన్ని బట్టబయలు చేస్తాం’అని వేణుగోపాల్ తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ..ఎస్‌ఐఆర్ ప్రక్రియ సమగ్రతపై అనుమానాలు వ్యక్తం చేశారు. నిష్పాక్షికంగా ఓటరు జాబితాను రూపొందించాల్సిన ఈసీ..రాజకీయ పక్షాలపై పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. అసలైన ఓటర్లను తొలగించేందుకే ఈ ప్రక్రియను ఈసీ హడావుడిగా చేపడుతోందన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై రాజకీయంగా, సంస్థాగతంగా, న్యాయపరంగా కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పారు.
ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడుతాం
ఎన్నికల ప్రక్రియ సమగ్రతను పరిరక్షించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని ఖర్గే ఎక్స్‌లో స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజల్లో ఇప్పటికే విశ్వాసం తగ్గిపోగా, ఎస్‌ఐఆర్ ప్రక్రియ సమయంలో ఈసీ వైఖరి మరింత నిరుత్సాహపూరితంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన, రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నట్లు, ఏ రాజకీయ పార్టీకి లోబడి పనిచేయడం లేదని తక్షణం ఈసీ నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.


