
43 ఏళ్ల చీకటి తర్వాత వెలుగు.. కానీ అంతలోనే కారుచీకట్లు! నిర్దోషిగా విడుదలైన ఆ అమాయకుడికి ఆ ఆనందం మిగల్లేదు. వేదనల ‘వేదం’ విషాదానికి అంతేలేదు. ఇది న్యాయమా? మానవత్వమా? అంటే సమాధానాలే లేవు. కళ్ల ముందు రెండు తరాలు గడిచిపోయాయి. కానీ ఆయన మాత్రం ఏం మారలేదు. చేయని నేరానికి నాలుగు దశాబ్దాలకు పైగా (43 ఏళ్లు) జైలు గోడల మధ్య నలిగిపోయిన సుబ్రహ్మణ్యం ‘సుబు’ వేదం (64), ఎట్టకేలకు న్యాయం గెలిచి, నిర్దోషిగా విడుదలయ్యాడు.
జీవితం, స్వేచ్ఛ, కుటుంబం..
ఈ బంధాల రుచి మళ్లీ చూడబోతున్నానని ఆశపడ్డాడు. కానీ ఆ ఆనందం ఎంతోసేపు లేదు. అమెరికా చట్టం అతన్ని మళ్లీ బందీగా మార్చింది.
అప్పుడు తప్పుడు శిక్ష.. ఇప్పుడు దేశ బహిష్కరణ ముప్పు
చేయని హత్య కేసులో నాలుగు దశాబ్దాలకు పైగా జైలు శిక్ష అనుభవించిన తర్వాత, సుబ్రహ్మణ్యం ‘సుబు’ వేదం ఎంతో కాలంగా ఎదురుచూసిన స్వేచ్ఛకు బదులుగా, కొత్త కష్టాలు ఎదురయ్యాయి. పెద్దగా పరిచయం లేని భారతదేశ బహిష్కరణ ముప్పు అతనికి ఏర్పడింది. తనపై ఉన్న హత్య కేసు శిక్షను రద్దు చేయడంతో, అక్టోబర్ 3న పెన్సిల్వేనియాలోని హంటింగ్‌డన్ స్టేట్ కరెక్షనల్ ఇన్‌స్టిట్యూషన్ నుండి విడుదలైన 64 ఏళ్ల సుబు వేదంను, వెంటనే అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అదుపులోకి తీసుకుంది.
చేయని హత్యకు చెరసాలలో మగ్గి..
కేవలం తొమ్మిది నెలల వయసులో భారతదేశం నుండి అమెరికాకు వచి్చన వేదం, శాశ్వత ఆమెరికా నివాసి. కానీ 1980లో పెన్సిల్వేనియాలో జరిగిన 19 ఏళ్ల థామస్ కిన్సర్ కాలి్చవేత కేసులో.. దాదాపు మొత్తం వయోజన జీవితాన్ని జైలులోనే గడిపాడు. స్టేట్ కాలేజ్ సమీపంలోని సింక్‌హోల్‌లో కిన్సర్ మృతదేహం లభించింది, అతనితో చివరిగా కనిపించిన వ్యక్తి వేదం (కిన్సర్ మాజీ హైసూ్కల్ సహ విద్యారి్థ) అని పోలీసులు ఆరోపించారు. వేదం తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. అతన్ని 1983, 1988లలో రెండుసార్లు దోషిగా నిర్ధారించారు. పెరోల్ కూడా లేకుండా జీవిత ఖైదు విధించారు.
శిక్ష రద్దు, ఎఫ్‌బీఐ నివేదిక
ఆగస్ట్ 2025లో, ఒక సెంటర్ కౌంటీ న్యాయమూర్తి అతని శిక్షను రద్దు చేస్తూ, ప్రాసిక్యూటర్లు చట్టవిరుద్ధంగా ఒక ఎఫ్‌బీఐ నివేదికను డిఫెన్స్ న్యాయవాదుల నుండి దాచిపెట్టారని తీర్పు చెప్పారు. ఈ తీర్పు తరువాత, సెంటర్ కౌంటీ జిల్లా అటార్నీ బెర్నీ కాంటోర్నా అన్ని అభియోగాలను అధికారికంగా కొట్టివేశారు. ‘కాలం గడిచిపోవడం, కీలక సాక్షుల నష్టం, వేదం దశాబ్దాల జైలు శిక్షను కారణాలుగా’ పేర్కొన్నట్లు ‘ది ఫిలడెలి్ఫయా ఎంక్వైరర్’ వెల్లడించింది.
సుదీర్ఘ అన్యాయం
‘వేదం.. పెన్సిల్వేనియా చరిత్రలో సుదీర్ఘకాలం అన్యాయంగా శిక్షకు గురైన వ్యక్తిగా, అమెరికాలో అత్యధిక కాలం శిక్ష అనుభవించిన వారిలో ఒకరిగా నిలబెట్టింది. ‘వేదం.. తన జీవితంలో అత్యంత విలువైన నాలుగు దశాబ్దాల కాలాన్ని తప్పుడు శిక్ష వల్ల కోల్పోయాడు. ఇప్పుడాయన వయసు 64. ఈ దేశంలోనే ఆయన సోదరి, మేనకోడళ్లు, మనవరాళ్లు.. కుటుంబ బంధాలు అన్నీ ఉన్నాయి. ఏ బంధుత్వం, ఏ పరిచయం లేని దేశానికి, తను ఏమాత్రం తెలియని భారత్‌కు పంపాలని నిర్ణయించడం ఏం న్యాయం?’.. అని ఆయన న్యాయవాది ఆవేదన వ్యక్తం చేశారు.
చీకటిలోనూ అక్షర దీపం
సుబు తన జైలు జీవితాన్ని దుఃఖంతో ముగించలేదు. ఆయన తన చుట్టూ ఉన్న చీకటిలో జ్ఞాన దీపాలను వెలిగించారు. జైలులో ఖైదీల కోసం అక్షరాస్యత తరగతులు, డిప్లొమా కార్యక్రమాలు నిర్వహించారు. మూడు డిగ్రీలు, 4.0 జీపీఏతో ఎంబీఏ కూడా పూర్తి చేసి, 150 ఏళ్ల జైలు చరిత్రలోనే అరుదైన ఖైదీగా నిలిచారు.
మా పోరాటం మానవత్వం కోసమే..
సుబు మేనకోడలు జోయ్ మిల్లర్ వేదం మాటలు ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తాయి. ‘43 ఏళ్ల పాటు జైలులో బంధించి వేదం జీవితాన్ని తీసేసుకున్నారు. ఇప్పుడు, ఆయనను ప్రేమించే వారందరికీ దూరంగా, ఏమీ తెలియని ప్రపంచానికి పంపడం అనేది, ఆ అన్యాయాన్ని మరింత పెంచడమే. వేదం తల్లిదండ్రులు ఆయన్ని చూసేందుకు ఏళ్ల తరబడి జైలుకు వచ్చి కన్నుమూశారు. దయచేసి, మా కుటుంబాన్ని ఇకనైనా కలవనివ్వండి. ఈ పోరాటం చట్టం గురించి కాదు... మానవత్వం కోసం’.. అని కన్నీటిపర్యంతమయ్యారు. తప్పుడు శిక్ష పడిన ఒక వ్యక్తి స్వేచ్ఛ కోసం, కుటుంబంతో కలవడం కోసం చేస్తున్న ఈ ఆఖరి పోరాటానికి న్యాయస్థానం ఎలా స్పందిస్తుందోనని యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది.