చెన్నై: తమిళనాడులో సీఎం స్టాలిన్ సహా పలువురు ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్, పోలీసులు తనిఖీలు చేశారు. అనంతరం, అది ఫేక్ బెదిరింపు మొయిల్ అని పోలీసులు నిర్ధారించారు.
వివరాల ప్రకారం.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, నటులు అజిత్ కుమార్, అరవింద్ స్వామి, ఖుష్బు నివాసానికి ఆదివారం రాత్రి బాంబు బెదిరింపు వచ్చింది. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) కార్యాలయానికి బెదిరింపు ఈ-మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సీఎం నివాసం సహా నాలుగు ప్రదేశాలలో భద్రతా తనిఖీలు చేపట్టారు. ఇళ్లు, పరిసర ప్రాంతాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. కొన్ని గంటల పాటు సోదాలు జరిగాయి. తనిఖీ సమయంలో ఎటువంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అది ఫేక్ మొయిల్ అని నిర్దారించారు. కాగా, బెదిరింపు పంపిన వ్యక్తి గురించి ఎలాంటి వివరాలను అధికారులు వెల్లడించలేదు.
మరోవైపు.. ఇటీవలి కాలంలో తమిళనాడు ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపులు రావడం పోలీసులకు తలనొప్పిగా మారింది. కొందరు ఆకతాయిలు ఇలా ఫేక్ కాల్స్, ఫేక్ మొయిల్స్ పెట్టి బాంబు బెదిరింపులకు పాల్పడుతున్నారు. గత వారం కూడా చెన్నైలోని ఇంజంబక్కంలోని అజిత్ కుమార్ నివాసానికి గుర్తు తెలియని వ్యక్తి నుండి బాంబు బెదిరింపు వచ్చింది. అంతకుముందు.. నటుడు అరుణ్ విజయ్, ఇళయరాజా స్టూడియోకు సైతం ఇలాగే బాంబు బెదిరింపులు వచ్చాయి.
Bomb threat to Tamil Nadu Chief Minister MK Stalin and actors Ajith Kumar, Khushbu Sundar. India Today's @PramodMadhav6 with more details#TamilNadu #Bombthreat #TheBurningQuestion @anchorAnjaliP pic.twitter.com/bpuxQqwHSJ
— IndiaToday (@IndiaToday) November 17, 2025


