ఢిల్లీ: వచ్చే ఏడాదిలో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. భారత్‌లో తొలి హై స్పీడ్ రైల్ (బుల్లెట్ ట్రైన్) ప్రారంభం కానుంది. 2027 ఆగస్టు 15న ప్రారంభించనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ముంబై నుంచి అహ్మదాబాద్ కారిడార్‌లో బుల్లెట్ ట్రైన్ నడవనుంది. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ట్రైన్ దూసుకెళ్లనుంది. నిన్ననే(డిసెంబర్ 31, 2025) 180 కిలోమీటర్ల స్పీడుతో వందే భారత్ స్లీపర్ ట్రైన్ పరీక్ష విజయవంతమైంది. త్వరలో ఈ ట్రైన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల మధ్య 508 కిలోమీటర్ల (మహారాష్ట్రలో 156 కి.మీ, గుజరాత్‌లో 352 కి.మీ) దూరాన్ని కేవలం 2 గంటల్లో పూర్తిచేయడానికి ఈ ప్రాజెక్టును రూపొందించారు. కాగా, 2017 సెప్టెంబర్ 14న ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని షింజో అబేలు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు.
ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.1.08 లక్షల కోట్లు. డిజైన్ స్పీడ్ గంటకు 350 కి.మీ కాగా ఆపరేటింగ్ స్పీడ్ గంటకు 320 కి.మీ ఉంటుంది. ఆధునిక డిజైన్, మల్టి–మోడల్ ఇంటిగ్రేషన్ (మెట్రో, బస్సు, రైలు, బుల్లెట్ రైలు ప్రయాణాలను అనుసంధానించే) అధునాతన వసతులతో 12 స్టేషన్లు నిర్మిస్తున్నారు. సబర్మతిలో మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌ను భారీ ఎత్తున నిర్మించారు.


