ఆ పెద్దాయన్ని పాము కాటేసింది. స్థానికులు సకాలంలో స్పందించి ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. హమ్మయ్యా.. అనుకుంటున్న టైంలో వారం వ్యవధిలోనే మరోసారి పాము కాటుకు గురయ్యాడు. ఈసారి ఆస్పత్రికి వెళ్లడం బాగా ఆలస్యమై ప్రాణం పోయింది. అయితే కొడుకుల దొంగ చూపులు.. పొంతన లేని సమాధానాలు.. వాళ్ల కాల్ డాటా.. తండ్రి ఇన్సూరెన్స్ సొమ్ము కోసం పడ్డ తాపత్రయం.. ఇది పక్కా స్కెచ్చేసి చేసిన హత్య అని బయటపెట్టాయి.
తండ్రికి రూ.3 కోట్ల దాకా బీమా చేయించి.. ఆపై పాము కాటుతో చంపించిన అమానవీయ ఘటన తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో జరిగింది. రకరకాల వ్యాపారాలు చేసి.. అప్పుల పాలైన ఇద్దరు తనయులు తమ స్నేహితుల సాయంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టారని పోలీసులు నిర్ధారించారు. ఒకసారి స్థానికులు తండ్రిని రక్షించగా.. మరోసారి ఎలాంటి ఆటంకం లేకుండా తమ ప్లాన్‌ను అమలు పరిచారు ఈ దుర్మార్గులు. ఈ ఘోరం వివరాల్లోకి వెళ్తే..
పొదటూర్‌పేట్ గ్రామానికి చెందిన ఈపీ గణేశన్(56).. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. అక్టోబర్ 22వ తేదీన పాము కాటుతో ఇంట్లోనే ఆయన చనిపోయారు. అయితే.. వారం తిరగకుండానే కుటుంబం ఇన్సూరెన్స్ కోసం క్లెయిమ్ చేయడంతో ఆ కంపెనీ వాళ్లకు అనుమానం వచ్చింది. పోలీసులకు ఈ విషయం చేరవేయడం.. వాళ్లు దర్యాప్తును ముమ్మరం చేయడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది.
గణేష్ కొడుకు మోహన్‌రాజ్(26), హరిహరన్(27) ప్రైవేట్ ఉద్యోగులు. అయితే ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, ఇతర విలాసాల కోసం అడ్డగోలుగా అప్పులు చేసి ఉన్నారు. ఈ క్రమంలో తండ్రి పేరిట ఇన్సూరెన్స్‌లు చేయించి హతమార్చాలనే దుర్మార్గపు ఆలోచన చేశారు. దీనికి నలుగురు స్నేహితుల సాయం కోరారు.
అక్టోబర్ 15వ తేదీన ఒక పామును గణేశన్ మీదకు వదిలారు. అది కాలి మీద కాటేయడంతో.. ఆయన నొప్పితో అరిచారు. దీంతో స్థానికులు ఆస్పత్రికి తరలించి రక్షించారు. వారం తర్వాత ఈసారి మరింత విషపూరితమైన పామును తెచ్చి మెడ మీద కాటు వేయించారు. ఈసారి ఆయన అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కారు. తలుపులు వేసి ఉండిపోయారు. ఆపై చాలా ఆలస్యంగా ఆస్పత్రికి తరలించారు. దీంతో పాము పగ బట్టి చంపిందంటూ స్థానికంగా ప్రచారం జరిగింది.
అయితే.. వారం తిరగకుండానే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కొడుకులు క్లెయిమ్‌కు దిగడంతో ఓ ఇన్సూరెన్స్ కంపెనీకి అనుమానం వచ్చింది. ఏజెంట్‌తో దర్యాప్తు చేయించే క్రమంలో వరుసగా పాము కాటుకు గురికావడం, ఆస్పత్రికి ఆలస్యంగా వెళ్లడం లాంటి విషయాలు తెలిశాయి. దీంతో పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు.
డిసెంబర్ 6వ తేదీన నార్త్ జోన్ ఐజీ అస్రా గార్గ్.. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఆ ఇద్దరు కొడుకుల ఫోన్ కాల్స్ రికార్డింగులు.. ఆర్థిక లావాదేవీల ఆధారంగా తండ్రిని పాము కాటుతో హత్య చేయించినట్లు నిర్ధారించుకున్నారు. నిందితులిద్దరితో పాటు వాళ్లకు సహకరించిన నలుగురిని శుక్రవారం అరెస్ట్ చేశారు.


