తమిళనాడు ఎన్నికలకు పట్టుమని ఆరు నెలల సమయం లేదు. దీంతో ప్రధాన పార్టీల నడుమ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నెలాఖరుకల్లా లేదంటే సంక్రాంతి లోపే ఏయే పార్టీలు, ఎవరెవరితో పొత్తులో కొనసాగుతాయో ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగానే..
కరూర్ ఘటన తర్వాత టీవీకే అధినేత విజయ్.. అధికార డీఎంకేపైనే ఫుల్ ఫోకస్ పెడుతూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మొన్న పుదుచ్చేరి.. నిన్న ఈరోడు బహిరంగ సభల్లో ఆయన చేసిన విమర్శలే అందుకు నిదర్శనం. ఈ క్రమంలో.. గురువారం ఈరోడులో జరిగిన టీవీకే ‘మక్కల్ సందిప్పు’బహిరంగ సభలో విజయ్ మాట్లాడుతూ.. డీఎంకే ఓ దుష్ట శక్తి అని, టీవీకే స్వచ్ఛమైన శక్తి అని వ్యాఖ్యానించారు. 2026 ఎన్నికల్లో ఈ రెండింటి మధ్యే పోటీ అన్నారు. అయితే..
‘‘ఎంజీఆర్, జయలలిత డీకేంను తీవ్రంగా విమర్శించారని, వారు ఎందుకు అంతగా విమర్శించారో అప్పట్లో నాకు తెలియలేదు. వారు చెప్పిందే నేనిప్పుడు చెబుతున్నా. డీఎంకే దుష్టశక్తి, టీవీకే స్వచ్ఛమైన శక్తి. టీవీకే అంటే డీఎంకేకు భయం పట్టుకుంది. నా గురించి 24 గంటలూ ఆలోచిస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. కానీ డీఎంకే ప్రభుత్వం దానిని మూసి పెడుతోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత నేనేంటో తెలుస్తుంది. సెంగోట్టైయ్యన్ మనతో కలిసిపోవడం గొప్ప బలం’’ అని విజయ్ ప్రసంగించారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా చెన్నై ఎయిర్‌పోర్టులో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది.

‘‘విజయ్‌ని ఏనాడైనా ఇలా అడిగారా?.. ముందు అసలు ఆయన్ని మీ ముందు మాట్లాడించండి’’.. అని మీడియాకే చురక అంటించారాయన. ఈలోపు.. ఆయన మరో దారిలో విజయ్‌ను దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ జోరందుకుంది.
ఖాకీ ఫేమ్ వినోద్ డైరెక్షన్‌లో విజయ్ ‘జన నాయగన్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఇది ఆయన చివరి చిత్రంగా ఓ ప్రచారం సాగుతోంది. దీంతో.. అభిమానులు ఈ సినిమాను గ్రాండ్ హిట్ చేసి విజయ్‌కు సెండాఫ్ ఇవ్వాలని భావిస్తున్నారు. పొంగల్ కానుకగా జనవరి 9వ తేదీన ఈ చిత్ర రిలీజ్‌కు ముహూర్తం ఖరారైంది కూడా. అయితే..
ఎలాంటి క్లాష్ లేకుండా.. మిగతా చిత్రాలు రిలీజ్ అవుతాయనుకున్న టైంలో కోలీవుడ్‌లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అప్పటికే రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకున్న ‘పరాశక్తి’.. జనవరి 14వ తేదీ నుంచి 10వ తేదీకి ముందుకు జరిగింది. ఈ ప్రీపోన్ నిర్ణయం విజయ్ అభిమానులకు పెద్ద షాకే ఇచ్చింది. ఇది చాలదన్నట్లు.. మరో స్టార్ నటుడు అజిత్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ మంకత్త (తెలుగు డబ్ మూవీ గ్యాంబ్లర్)ను దాదాపుగా ఆ టైంలోనే రిరీలీజ్ కాబోతోంది. అయితే.. ఈ రెండు నిర్ణయాల వెనుకా ఉదయ్‌నిధి హస్తం ఉందనే ప్రచారం ఇప్పుడు జోరుగా నడుస్తోంది అక్కడ..

సుధా కొంగర డైరెక్షన్‌లో తెరకెక్కిన పరాశక్తిలో శివకార్తీకేయన్, జయం రవి, అధర్వ, శ్రీలీల, రానా దగ్గుబాటి లాంటి స్టార్‌కాస్టింగ్ ఉంది. ఈ చిత్ర నిర్మాత ఆకాశ్ భాస్కరన్ ఉదయ్‌నిధికి అత్యంత సన్నిహితుడు కూడా. ఈ కారణంగానే ఆకాశ్‌పై ఈడీ దాడులు జరిగాయని అప్పట్లో జోరుగా చర్చ నడిచింది.

కాబట్టి.. ఉదయ్‌నిధి కోరిక మేరకే పరాశక్తి ప్రీపోన్ జరిగిందనే బలమైన ప్రచారం మొదలైంది. అలాగే.. అజిత్ మంగథాను నిర్మించింది సన్ పిక్చర్స్. అది స్టాలిన్ కుటుంబానికి చెందిన నిర్మాణ సంస్థ అని తెలిసిందే. అలా విజయ్ చివరి సినిమా కలెక్షన్లకు గండికొట్టేందుకు.. ఉధయ్‌నిధి ఆధ్వర్యంలో డీఎంకే ఇలాంటి మాస్టర్‌స్ట్రోక్ ఇచ్చారని చర్చించుకుంటున్నారు. అయితే ఈ ప్రచారంలో వాస్తవమెంత అనేది పక్కన పెడితే.. దానికి విజయ్ అభిమానులు ఇస్తున్న కౌంటర్లతో సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోందక్కడ.


