మరికొద్ది గంటల్లో.. 2025 ఏడాది కాలగర్భంలో కలిసిపోనుంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రపంచం మొత్తం ఉత్సాహంతో ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో.. చివరి సూర్యోదయం వీక్షించేందుకు తమిళనాడు కన్యాకుమారి సముద్ర తీరానికి జనం పోటెత్తారు.
ప్రతిసారిలాగే.. ఈ ఏడాది చివరి రోజు ఉదయం ప్రముఖ పర్యాటక కేంద్రం కన్యాకుమారి సందర్శకులు, భక్తులతో కిక్కిరిసిపోయింది. తిరువల్లువర్ విగ్రహం, వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికల నుంచి సూర్యోదయాన్ని వేలమంది వీక్షించారు. నారింజ రంగులో ఆకాశంలో కనిపించిన ఆ సుందర దృశ్యాలను కెమెరాలు, మొబైల్ ఫోన్లలో బంధించారు.
2025ன் கடைசி சன்ரைஸ்.. குமரியில் கண்டு ரசித்த சுற்றுலா பயணிகள் #kanyakumari #sunrise #newyear2026 #sun pic.twitter.com/f7U5H4FzpI
— Thanthi TV (@ThanthiTV) December 31, 2025
ప్రత్యేకం ఎందుకంటే..
కన్యాకుమారి భారతదేశ దక్షిణ అంచున ఉంది. ఇక్కడి సూర్యోదయం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రతి సంవత్సరం చివరి రోజు, కొత్త సంవత్సరం మొదటి రోజు ఇక్కడి సూర్యోదయాన్ని వీక్షించేందుకు వేలాది మంది భక్తులు, పర్యాటకులు చేరుతారు. అందుకు కారణం.. అరేబియా సముద్రం, బెంగాల్ ఖాతం, భారత మహాసముద్రం కలిసే అరుదైన ప్రదేశం కాబట్టి.
ఈ సంగమం వద్ద సూర్యోదయం చూడటం ఒక ప్రత్యేక అనుభవం. అలాగే సూర్యాస్తమయం కూడా. దేశంలో చాలా అరుదుగా ఒకే ప్రదేశంలో సముద్రంపై సూర్యోదయం, సూర్యాస్తమయం రెండూ వీక్షించగల అవకాశం ఇక్కడ ఉంది. అయితే అరుదైన ప్రదేశాల్లో ఒకటిగానే కాకుండా.. ఆధ్యాత్మిక ధోరణిలోనూ ఈ ప్రాంతానికి ప్రత్యేకత ఉంది. సూర్యోదయాన్ని దైవానుభూతిగా భావించే భక్తులు.. సంవత్సరాంతం, ఏడాది తొలిరోజు.. పండుగల సమయంలో ప్రత్యేకంగా సముద్ర స్నానాలు చేస్తారు.
సుందర దృశ్యాలు..
ఉదయం సూర్యుడు ఉదయించేటప్పుడు ఆకాశంలో నారింజ, బంగారు, ఎరుపు రంగులతో కాంతులు కనిపిస్తాయి. సముద్రపు అలలపై ఆ ప్రతిబింబం పడటంతో ఆ దృశ్యాన్ని మరింత అద్భుతంగా కనిపిస్తుంది. అందుకే నిత్యం ఆ సుందర దృశ్యాలను వీక్షించేందుక పనిగట్టుకుని పర్యాటకులు అక్కడికి వెళ్తుంటారు.


