త్వరలోనే బిల్లు
అమెరికన్లకు తీవ్ర అన్యాయం
కాంగ్రెస్ సభ్యురాలు మర్జోరీ టేలర్
వాషింగ్టన్: వృత్తి నిపుణులకు, ముఖ్యంగా భారతీయులకు వరంగా ఉన్న హెచ్–1బీ వీసా పథకాన్ని పూర్తిగా రద్దు చేసేందుకు అమెరికా ప్రజా ప్రతినిధి ఒకరు ప్రయత్నాలు ప్రారంభించారు. హె1బీ కలిగిన వారు అనంతరం అమెరికా పౌరసత్వానికి అర్హులయ్యే అవకాశముంది. అయితే, తాజా ప్రయత్నాల కారణంగా ఈ వెసులుబాటుకు తెరపడనుంది. ఇకపై వీసా గడువు ముగిసిన వెంటనే ఎవరైనా స్వదేశానికి వెళ్లిపోవాల్సి ఉంటుంది.
‘దశాబ్దాలుగా హెచ్–1బీ ప్రోగ్రాంలో అవకతవకలు, అక్రమాలు జరుగుతున్నాయి. అమెరికన్ల అవకాశాలను విదేశీయులు ఎగరేసుకుపోతున్నారు. అందుకే, హెచ్–1బీని ఆసాంతం రద్దు చేసేందుకు బిల్లు ప్రవేశపెట్టాలనుకుంటున్నాను’అంటూ కాంగ్రెస్ మ ర్జొరీ టేలర్ గ్రీన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కీలకమైన వైద్య రంగానికి అవసరమైన వైద్యులు, నర్సుల కోసం మాత్రం ఏడాదికి 10 వేల వరకు వీసాలను మంజూరు చేసేందుకు వీ లుండేలా ప్రతిపాదనలను రూపొందిస్తున్నామన్నారు.
పదేళ్ల తర్వాత ఈ వెసులుబాటు కూడా రద్దవుతుందన్నారు. విదేశీయుల స్థానంలో అమెరికా పౌరులే వైద్యులు, నర్సు ల స్థానాలకు ఎదిగేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని వివరించారు. వివిధ వీసాలపై ఇక్కడికి వచ్చే ప్రత్యేక వృత్తి నిపుణులు నిరీ్ణత కాల పరిమితి ముగిశాక తిరిగి స్వదేశాలకు వెళ్లిపోవాలే తప్ప, శాశ్వతంగా నివాసం ఉండేందుకు అనుమతించరాదని మర్జొరీ టేలర్ అభిప్రాయపడ్డారు.
అమెరికా పౌరులు కాని వైద్య విద్యార్థుల కోసం ప్రస్తుతమున్న మెడికేర్ పథకాన్ని కూడా ఎత్తివేయాలన్నారు. ఒక్క 2023లోనే విదేశాల్లో జని్మంచిన 5 వేల మందికిపైగా డాక్టర్లకు దేశంలో అవకాశాలు దొరికాయని తెలిపారు. 2024లో అమెరికాలో వైద్యవిద్యనభ్యసించిన 9 వేల మంది మాత్రం అవకాశాల్లేక విదేశాలకు వెళ్లిపోయారని టేలర్ తెలిపారు. ఇలా అమెరికన్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలిపారు.
ఏడాదికి 65 వేల మంది వృత్తి నిపుణులతోపాటు మరో 20 వేల మంది అడ్వాన్స్‌డ్ డిగ్రీ హోల్డర్లకు రెగ్యులర్ హెచ్–1బీ వీసాలిచ్చేందుకు కాంగ్రెస్ వీలు కలి్పస్తోంది. ఈ అవకాశాన్ని ప్రైవేట్ సంస్థలు వినియోగించుకుని, విదేశీ నిపుణులను రప్పిస్తున్నాయి. హెచ్–1బీతో లాభం పొందే వారిలో భారతీయ నిపుణులు, ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, వైద్యులు అత్యధికంగా ఉన్నారు. అయితే, అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ట్రంప్ హెచ్–1బీపై తీవ్ర ఆంక్షలు విధిస్తుండటం తెల్సిందే. అర్హులైన హెచ్–1బీ దరఖాస్తుదారులు లక్ష డాలర్లు చెల్లించాలంటూ ఆయన నిబంధన తీసుకువచ్చారు.


