తెలుగు సినీ నటి పింకీ సుదీప (Pinky Sudeepa) తల్లిగా ప్రమోషన్ పొందింది. తనకు కొడుకు పుట్టాడన్న శుభవార్తను ఆలస్యంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా బాబు బారసాల ఫంక్షన్ ఘనంగా చేసింది. ఈ మేరకు ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. అందులో బాబును నవమోసాలు మోసిన సుదీప పొట్టను ఆమె భర్త శ్రీరంగనాథ్ ఆప్యాయంగా ముద్దాడాడు. తర్వాత దంపతులిద్దరూ బాబును ఎత్తుకుని చూపించారు. ఇది చూసిన అభిమానులు ఆమెకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
సినిమా
సుదీప.. 1994లో ధర్మరాజు ఎం.ఏ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. మా అన్నయ్య, అల్లుడుగారు వచ్చారు, బొమ్మరిల్లు, స్టాలిన్, బిందాస్, మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రాల్లో నటించింది. నువ్వు నాకు నచ్చావ్ మూవీతో పింకీగా పాపులారిటీ తెచ్చుకుంది. తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్‌లోనూ పాల్గొంది. షోలో ఉన్నప్పుడు... తనకు గర్భ స్రావం అయిన విషయాన్ని చెప్తూ ఎమోషనలైంది. తాను 2015లో తొలిసారి గర్భం దాల్చానని, కానీ థైరాయిడ్ ఎక్కువవడం వల్ల బిడ్డను కోల్పోయానని కన్నీళ్లు పెట్టుకుంది. మళ్లీ పదేళ్ల తర్వాత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.


