2:1 తేడాతో సీజేఐ సారథ్యంలోని ధర్మాసనం తీర్పు
తాజాగా విచారణ చేపట్టనున్న మరో ధర్మాసనం
విభేదించిన జస్టిస్ ఉజ్జల్ భుయాన్
న్యూఢిల్లీ: పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలిన ప్రాజెక్టులకు వెనుకటి తేదీ నుంచి పర్యావరణ అనుమతులు మంజూరు చేయకుండా నిషేధిస్తూ మే 16వ తేదీన ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు మంగళవారం 2:1 మెజారిటీతో వెనక్కి తీసుకుంది. ఇదే అంశంపై మరో ధర్మాసనం తాజాగా విచారణ చేపడుతుందని తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనంలో సీజేఐ, జస్టిస్ వినోద్ చంద్రన్‌లు రీకాల్‌కు అనుకూలంగా వేర్వేరు తీర్పులివ్వగా జస్టిస్ భుయాన్ మాత్రం విభేదించారు.
అప్పటి ‘వన శక్తి తీర్పు’పై దాఖలైన 40 పిటిషన్లపై ఈ ధర్మాసనం విచారణ చేపట్టింది. అక్టోబర్ 9వ తేదీన వాదనలు ముగియగా, తీర్పును రిజర్వులో ఉంచింది. కపిల్ సిబాల్, ముకుల్ రొహత్గీ వంటి సీనియర్ న్యాయవాదులతోపాటు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాలు వాదనలను వినిపించారు. వీరంతా అప్పటి తీర్పును సమీక్షించాలనే అభిప్రాయాన్నే దాదాపుగా వెలిబుచ్చడం గమనార్హం. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించిన ప్రాజెక్టులకు ముందు తేదీలతో అనుమతులు ఇవ్వరాదంటూ కేంద్ర పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖను, సంబంధిత అధికారులను సుప్రీంకోర్టు మే 16న ఆదేశించింది. అప్పటి ధర్మాసనంలో జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లు ఉన్నారు.
అనుకూలం ఎందుకంటే..
‘ముందస్తు తేదీలతో అనుమతుల నిరాకరణపై సమీక్ష చేపట్టకుంటే రూ.20 వేల కోట్లతో చేపట్టిన వివిధ ప్రజా ప్రయోజన ప్రాజెక్టులు నిలిచిపోతాయి. భారీగా ఏర్పాటు చేసిన నిర్మాణాలను ధ్వంసం చేయాల్సి ఉంటుంది. ఇందులో ఒడిశాలో ఎయిమ్స్, కర్నాటకలోని విజయనగరలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం వంటివి ఉన్నాయి. అందుకే, అలాంటి అన్ని ప్రాజెక్టులను కూల్చివేయడం, ప్రజా ధనాన్ని వృధాగా పోనివ్వడం ప్రజా ప్రయోజనం కిందకు వస్తుందా అని నేను నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను’అని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు.
వీటికోసం మళ్లీ అనుమతులు కోరాల్సి ఉంటుంది. అందుకే, న్యాయపరమైన ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకుండా వెలువరించిన ఆ తీర్పును రీకాల్ చేయాలని భావిస్తున్నాను. నా తీర్పుతో సోదరుడు జస్టిస్ భుయాన్ విభేదించారు’అని సీజేఐ తన తీర్పులో పేర్కొన్నారు. 2013 నాటి నోటిఫికేషన్‌తోపాటు 2021 నాటి ఆఫీసు మెమోరాండం నిబంధనలను ఉల్లంఘించిన సంస్థలకు భారీ జరిమానాలు విధించేందుకు వీలు కల్పిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. ముందు తేదీలతో అనుమతులను ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అప్పటి తీర్పును రీకాల్ చేయడంతోపాటు మరో ధర్మాసనం ఇదే అంశంపై తాజాగా విచారణ చేపడుతుందని పేర్కొన్నారు.
కేంద్రం ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ అంశాన్ని సీజేఐ ఎదుట ఉంచాలని ఆయన కోర్టు రిజస్ట్రీని ఆయన ఆదేశించారు. జస్టిస్ వినోద్ చంద్రన్ కూడా ఇదే రకమైన తీర్పు వెలువరించారు. ఆ తీర్పుపై సమీక్ష తప్పనిసరని పేర్కొన్నారు. పర్యావరణ అనుమతులు లేకుండా నడుస్తున్న పరిశ్రమలకు సంబంధించి, వాటిని మూసేయాల్సిన అవసరం లేకుండా బ్యాలెన్స్‌డ్ విధానాన్ని కోర్టు అనుసరించాలని తెలిపారు. అప్పటి తీర్పుతో కేంద్రం చేపట్టిన రూ.8,293 కోట్ల విలువైన 24 ప్రాజెక్టులతోపాటు రాష్ట్రాలు చేపట్టిన రూ.11,168 కోట్ల విలువైన 29 ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. ఇందులో ఆస్పత్రులు, వైద్య కళాశాలలు, ఎయిర్‌పోర్టులు తదితర నిర్మాణాలున్నాయన్నారు.
అది తిరోగమనమే: జస్టిస్ భుయాన్
పర్యావరణ చట్టంలో ముందస్తు తేదీలతో అనుమతులు ఇవ్వడమనే విధానమే లేదంటూ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తీవ్రంగా విభేదించారు. తీర్పును సమీక్షించడం తిరోగమనమేనని తన 96 పేజీల తీర్పులో తెలిపారు. ‘ఈ ఆలోచనే అనర్థదాయకం. పర్యావరణ చట్టాలకు ఒక శాపం. చెడుకు అనుకూలం’అని ఆయన పేర్కొన్నారు. ముందు జాగ్రత్త సూత్రానికి, సుస్థిర అభివృద్ధికి విరుద్ధమని తెలిపారు. ముందు తేదీలతో అనుమతులిస్తే పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో వాయు కాలుష్యం, ప్రాణాంతకమైన పొగమంచు పర్యావరణ కాలుష్యంతో కలిగే ప్రమాదాలను నిత్యం మనకు గుర్తు చేస్తోందని పేర్కొన్నారు.
పర్యావరణ పరిరక్షణ కోసం రాజ్యాంగానికి, చట్టాలకు లోబడి తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత అత్యున్నత న్యాయస్థానానికి ఉందన్నారు. పర్యావరణం, అభివృద్ధి పరస్పర విరుద్ధాలు కావని ఆయన తెలిపారు. ఇవి రెండూ రాజ్యాంగ నిర్మాణం, సుస్థిర అభివృద్ధిలో భాగాలన్నారు. ముఖ్యంగా, చట్టబద్ధత పట్ల కనీస గౌరవం కూడా చూపని వ్యక్తులు దాఖలు చేసిన సమీక్ష పిటిషన్‌పై స్పందించి తీర్పుపై సమీక్ష చేపట్టాలనడం తగదని ఆయన తెలిపారు. పర్యావరణ న్యాయ మూల సూత్రాలను ఇది విస్మరించిందని అభిప్రాయపడ్డారు. కాలుష్యానికి కారకులైన వారు చెల్లించాల్సిన పరిహారంపై ఆధారపడి, ముందుజాగ్రత్త సూత్రాన్ని సులభంగా తోసిపుచ్చలేమని జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తెలిపారు.


