బెంగుళూరు: మంగళూరులో అమానుష ఘటన జరిగింది. యువతి తండ్రి అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న కామాంధులు బాధితురాలిని లోబర్చుకొని కామవంఛతీర్చుకున్నారు. రెండు రోజులు నరకం అనుభవించిన యువతి కామాంధుల బారి నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించింది. చిక్కమగళూరు జిల్లా బీరూరు గ్రామానికి చెందిన తల్లిలేని బిడ్డ తన బంధువుల ఇంటిలో ఉంటూ పీయూసీ వరకు చదివింది.
అనంతరం తండ్రి వద్దకు వచ్చింది. గతనెలలో తన అవ్వ ఇంటికి వెళ్లి రెండు రోజులు అక్కడే ఉంది. మంగళూరుకు చెందిన భరత్‌శెట్టి అనే వ్యక్తి యువతి తండ్రి వద్దకు వెళ్లి స్నేహంగా ఉండేవాడు. మంగళూరులో తమకు ఇల్లు ఉందని, మీరిద్దరూ వస్తే ఆశ్రయం కల్పిస్తామని చెప్పడంతో యువతి, ఆమెతండ్రి, యువతి అవ్వ కలిసి భరత్‌శెట్టి వెంట వెళ్లారు. అక్కడ భరత్‌శెట్టి ఆ యువతి తండ్రిని మభ్య పెట్టి డబ్బు ఇచ్చాడు.
అనంతరం యువతిని ఒక ఇంటిలో ఉంచి కొంతమంది విటులను పంపించాడు. రెండు రోజులపాటు కామాంధులు ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. తనను వదిలేయాలని యువతి వేడుకున్నా కనికరించలేదు. భరత్‌శెట్టికి డబ్బులు ఇచ్చామని చెప్పి లైంగికదాడికి పాల్పడ్డారు. ఎట్టకేలకు యువతి తప్పించుకొని వచ్చి దక్షిణకన్నడ జిల్లాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మంగళూరుకు వెళ్లి భరత్‌శెట్టితోపాటు మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. యువతి తండ్రి, అవ్వపై కూడా కేసు నమోదు చేశారు.


