సాక్షి, ఢిల్లీ: పోలవరం-నల్లమల్లసాగర్ ప్రాజెక్ట్ విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్ట్‌పై మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి అంటూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సూచించారు. అనంతరం, కేసు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా చేశారు.
కాగా, నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై స్టే ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోరారు. ఈ ప్రాజెక్టుతో గోదావరిలో తమ వాటా తగ్గుతుందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్‌కు సంబంధించి మూడు పరిష్కారాలను సుప్రీంకోర్టు సూచించింది.
1. సమగ్ర విచారణ కోసం సివిల్ సూట్ ఫైల్ చేయమని సూచన
2. కేంద్ర ప్రభుత్వ కమిటీకి తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనలను పరిశీలించి, అవసరమైతే ప్రాజెక్టును ఆపే నిర్ణయాధికారాన్ని ఇస్తాం.
3. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుని అవకాశం ఇచ్చారు.
జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు..
అంతకుముందు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్లానింగ్ దశలోనే ఉంది కదా?. ప్లానింగ్ డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్‌కి ఏపీ నిధులే వృధా అవుతాయి కదా?. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ పిటిషన్ విచారణ అర్హతను పరిశీలిస్తున్నాం. సివిల్ సూట్ ఫైల్ చేస్తేనే సమగ్రంగా విచారణ జరపవచ్చు. ప్రాజెక్టు ఆపాలన్న మీ అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వ కమిటీ పరిశీలించేలా చూడమని ఆదేశాలు ఇస్తాం. అలాగే మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి అని అన్నారు.
ఏకపక్షంగా నిర్మాణం..
అనంతరం, తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్వి వాదనలు వినిపిస్తూ..‘వరద జలాల పేరుతో మాకు కేటాయించిన నీటి వాటాను తరలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్షంగా ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ప్రాజెక్టుపై వెంటనే సుప్రీంకోర్టు స్టే ఇవ్వాలి. గోదావరిలో తెలంగాణకు 968 టీఎంసీల నీటి వాటా ఉంది. పోలవరం-నల్లమల్లసాగర్ ప్రాజెక్టుతో మా వాటా తగ్గుతుంది. ఈ ప్రాజెక్టును ఆపాలని కేంద్ర జల సంఘం ఇచ్చిన ఆదేశాలను ఏపీ పట్టించుకోవడం లేదు. సీడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వంలో ఇటీవల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి ప్రాజెక్టును ఆపే అధికారం లేదు. సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకొని ఈ ప్రాజెక్టును ఆపాలన్నారు.
రాష్ట్ర ప్రాజెక్ట్ మాత్రమే..
మరోవైపు.. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ..‘పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టులో మేము నిబంధనలు ఉల్లంఘించలేదు. కేవలం మేము ప్లాన్ రెడీ చేసుకుంటున్నాం. సముద్ర జలాలు వృథా అవుతున్నాయి. వాటిని రాయలసీమకి అందించాలనుకుంటున్నాం. ఇది రాష్ట్ర ప్రాజెక్టు మాత్రమే జాతీయ ప్రాజెక్టు కాదు. మా రాష్ట్ర అవసరాలపైన ప్లానింగ్ చేసుకునే అధికారం ఉంది. మేము పీఎఫ్‌ఆర్, డీపీఆర్‌లను తయారు చేస్తున్నాము అని తెలిపారు.
ఈ క్రమంలో సుప్రీంకోర్టు సూచించిన పరిష్కారాలపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని తెలుసుకునేందుకు సమయం ఇవ్వాలని అభిషేక్ సింఘ్వీ కోరారు. అనంతరం, కేసు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా చేశారు.


