తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి చాలాకాలం క్రితం అన్నమాట ‘కేంద్రం మిథ్య’ అని! అప్పటి ప్రధానులు ఇందిరగాంధీ, రాజీవ్ గాంధీ వంటి వారిని కూడా విధానపరంగా ఎదిరించిన చరిత్ర ఆయనది. అయితే... అదే తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకుని సీఎం అయిన చంద్రబాబు మార్కు రాజకీయం ఇందుకు పూర్తి వ్యతిరేకం. ఏ ఎండకు ఆ గొడుగు అనే సామెతను గుర్తు చేస్తుంది ఈయన వ్యవహారం. ఒకట్రెండుసార్లు బాబుగారు కేంద్రాన్ని విమర్శించిన సందర్భాలూ ఉన్నాయి లెండి. నిధుల పంపిణీలో దక్షిణాదికి జరుగుతున్న నష్టం గురించి ఆయన గళమెత్తారు. కానీ ఇప్పుడు అదంతా గతం. 2024లో గద్దెనెక్కింది మొదలు చంద్రబాబు నాయుడు బాగా బలహీనపడినట్లు కనిపిస్తున్నారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే నిధుల విషయంలోనే రాష్ట్రానికి భారీగా కోత పడుతున్నా కిమ్మనలేకపోతున్నారు. ఇంకా ఘోరం ఏమిటంటే.. ఈ విషయంపై జనసేనతో కలిసి కేంద్రానికి వత్తాసుపలకడం! విపక్షంలో ఉన్నప్పుడు మాత్రం చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌లు కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారని తరచూ జగన్‌ను విమర్శించిన విషయం ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాలి! పవన్ కళ్యాణ్ ఇంకో అడుగు ముందుకేసి తనకు ఇద్దరు ఎంపీలున్నా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవటీకరణను అపేసేవాడినని బీరాలు పలికారు కూడా. కానీ ఇప్పుడు టీడీపీ, జనసేనలకు ఉమ్మడిగా 17 మంది ఎంపీల మద్దతుంది. కానీ వీళ్లు ఈ అంశంపై గళమెత్తితే ఒట్టు!
కొంచెం గతంలోకి వెళదాం... నరేంద్ర మోడీతో చెడిన తరువాత 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు ఏమన్నారో గుర్తు చేసుకుందాం. అమరావతికి చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చి వెళ్లారని, ఏపీకి మరిన్ని నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా.. పనికి ఆహారం పథకం కింద ఏకంగా యాభై లక్షల టన్నుల బియ్యం తీసుకొచ్చానని బాబు చెప్పుకునేవారు. బాబుగారి పలుకుబడి అంత అని టీడీపీ ప్రచారం చేసుకునేది. ఇదే బియ్యం పార్టీ నేతల అక్రమార్జనకు దారి తీసిందన్నది వేరే సంగతిలెండి. కానీ ఇప్పుడేమైందో మరి? కేంద్రం కొత్త విధానాలు రాష్ట్రాలకు నష్టం చేస్తున్నా నోరెత్తలేకపోతుండడం స్పష్టంగా కనిపిస్తుంది. అంతంతమాత్రం నిధులే వస్తున్నా కేంద్రం బాగా సహకరిస్తోందని చెప్పుకునే దుస్థితి ఎందుకో? కేంద్రం నుంచి రూ.34 వేల కోట్ల సాయం వస్తుందని బడ్జెట్లో అంచనా వేస్తే, తొమ్మిది నెలల్లో కేవలం రూ.ఏడు వేల కోట్ల వరకే వచ్చిందని లెక్కలు చెబుతున్నాయి. నేషనల్ హెల్త్ మిషన్ వాటా 75 శాతం నుంచి 40 శాతానికి కుదించుకుంది.
గ్రామీణ సడక్ యోజన, ఐసీడీఎస్, మధ్యాహ్న భోజన పథకాల్లోనూ రాష్ట్రం వాటాను నలభై శాతానికి పెంచారు.పి.ఎమ్. ఫసల్ భీమా స్కీమ్ లో గతంలో ఏభై శాతం చొప్పున కేంద్ర,రాష్ట్రాలు భరించేవి.కాని ఇప్పుడు రాష్ట్రమే 75 శాతం ఖర్చు చేయవలసి ఉంటుంది. దీని ఫలితంగా రాష్ట్రాలపై ఆ మేరకు అధిక బరువు పడుతుంది. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మగాంధీ పేరును తొలగించడంపై.. కొత్త నిబంధనల ప్రకారం కేంద్రం వాటా తగ్గడంపై కాంగ్రెస్, ఇతర పక్షాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో బాబు మౌనం పలు సందేహాలకు కారణమవుతోంది. ఈ మార్పుల వల్ల ఏపీకి మాత్రమే ఏటా సుమారు రూ.4500 కోట్ల వరకూ భారం పడుతుందని అంచనా. అయినాసరే.. టీడీపీ, జనసేనలు ఈ మార్పులను వ్యతిరేకించలేదు. కాకపోతే టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్‌సభలో అభ్యంతరం మాత్రం చెప్పారట. మార్పులు స్వాగతిస్తూనే ఆర్థిక పరిస్థితి రీత్యా ఏపీకి వెసులుబాటు కల్పించాలని ఆయన కోరారట. జాతీయ పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం ఇలా కోరడం సమంజసమేనా? జనసేన ఎంపీ బాలశౌరి కేంద్ర ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్లు తెలిపారట. వైసీపీ ఎంపీ వైసిపి అవినాశ్ రెడ్డి మాత్రం ఉపాధి స్కీమ్ ఎత్తివేతకు కుట్ర జరుగుతోందని ధైర్యంగా విమర్శించారు.కొత్త చట్టం పేదల పొట్ట కొడుతుందని హెచ్చరించారు. బిల్లును జేపీసీకి పంపించాలని డిమాండ్ చేశారు. ఎవరు రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా మాట్లాడింది స్పష్టంగా తెలుస్తోంది కదా!
విశాఖ స్టీల్, ఇతర అంశాల విషయంలోనూ టీడీపీ, జనసేనల తీరు ఇలాగే ఉంది. మోడీగారికి చాలా పనులు ఉంటాయని, అన్నిటికి ఆయనను ఇబ్బంది పెట్టలేమని పవన్ కళ్యాణ్ అంటున్నారు. జగన్ ప్రభుత్వ కాలంలో బీజేపీకి అంశాల వారీగా మద్దతు ఇచ్చినా, ఏపీకి నష్టం జరుగుతుందనుకుంటే ప్రధానికి, కేంద్ర మంత్రులకు నిర్మొహమాటంగా తెలిపే వారు. విశాఖలో జరిగిన ఒక సభలో ప్రధాని మోడీ సమక్షంలోనే విశాఖ ఉక్కును ప్రైవేటీకరించవద్దని గట్టిగా కోరిన విషయం తెలిసిందే. విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని కోరారు. కానీ ఇప్పుడు జీఎస్టీ రేట్ల తగ్గింపుతో రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం రూ.ఎనిమిది వేల వరకూ తగ్గుతుందన్న అంచనాలు వచ్చినా కిమ్మనలేదు ఈ పార్టీలు. ఈ అంశాన్ని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రస్తావించి రాష్ట్రాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ ఎంతో సీనియర్ అయిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాత్రం ఈ డిమాండ్ చేయలేకపోయారు. పైగా మోడీ మెప్పుదల కోసం అన్నట్టు.. రేట్ల తగ్గింపు తరువాత కూడా ఏపీలో జీఎస్టీ ఆదాయం బాగా పెరిగిందంటూ సభలు పెట్టారు.
తాజాగా తగ్గిన ఆదాయాన్ని భర్తీ చేసుకునేందుకు సెస్‌ల భారం వేసే ప్రయత్నం చేస్తున్నారు. వాహానాల లైఫ్‌ట్యాక్స్‌పై పది శాతం అదనపు సెస్ అలాంటిదే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు మౌనం ఎందుకన్న ప్రశ్న వస్తోంది. డిమాండ్లు పెడితే బీజేపీ పెద్దలు అవమానిస్తారన్న సందేహమా? లేక... తనపై ఉన్న కేసుల భయమా? అదీ కాదంటే పుత్రరత్నం భవిష్యత్తు కోసం రాజీ పడుతున్నారా? ఇదీ కాదంటే.. ఎలాగూ అమరావతి కోసం అప్పులు చేసుకునేందుకు ఉదారంగా అనుమతిస్తున్నారు కాబట్టి.. అలా ముందుకెళదాం అనుకుంటున్నారా?

కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారల వ్యాఖ్యాత.


