breaking news
BR Gavai
-
ప్రజల ముంగిటకే న్యాయం
ఇటానగర్: ప్రజలకు సేవ చేసేందుకు, అతి తక్కువ ఖర్చుతో సత్వరమే వారికి న్యాయం అందించేందుకు మాత్రమే న్యాయవ్యవస్థ, చట్టసభలు, అధికార యంత్రాంగం ఉన్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. అధికార వికేంద్రీకరణకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందంటూ ఆయన ప్రజల గుమ్మం వద్దకే న్యాయం చేరాలన్నారు. ఆదివారం ఆయన ఇటానగర్‌లో గౌహతి హైకోర్టు ఇటానగర్ శాశ్వత ధర్మాసనం నూతన భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ‘కోర్టులు, న్యాయవ్యవస్థ, చట్ట సభలు ఉన్నది గొప్పవారికి, న్యాయమూర్తులకు, అధికారులకు చేసే చేసేందుకు కాదు. మనమందరం ప్రజలకు న్యాయం అందించేందుకే ఉన్నాం’అని ఆయన పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో భిన్నత్వంలో ఏకత్వం మేళవించి ఉందని, రాష్ట్రంలో 26 ప్రధాన గిరిజన తెగలు, 100కు పైగా ఉప గిరిజన తెగలున్నాయని వివరించారు. ప్రతి గిరిజన తెగ సంస్కృతీసంప్రదాయాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. ప్రగతితోపాటు సంప్రదాయాలు, సంస్కతీ పరిరక్షణ కూడా ముఖ్యమైనవేనని, ప్రాథమిక విధుల్లో ఇవి కూడా ఒకటని తెలిపారు. అశాంతి నెలకొన్న మణిపూర్‌లో ఇటీవల పర్యటన సమయంలో జరిగిన ఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. ‘షెల్టర్ హోంలో ఆశ్రయం పొందుతున్న ఓ మహిళ మీ ఇంటికి వచ్చిన మీకు స్వాగతం అని నాతో అంది. ఆమె మాటలు నన్నెంతో ఆకట్టుకున్నాయి. మనది ఒకటే భారతదేశం. మనందరం భారతీయులం. భారత్ మన నివాసం’అని సీజేఐ వ్యాఖ్యానించారు. ప్రతి భారతీయుడికీ రాజ్యాంగమే అత్యున్నత గ్రంథం. ప్రతి ఒక్కరూ చదవి తీరాలని పిలుపునిచ్చారు. -
రూ.23వేల కోట్ల హవాలా సొమ్మును బాధితులకు ఈడీ అందజేసింది
న్యూఢిల్లీ: అక్రమంగా సంపాదించిన రూ.23 వేల కోట్ల డబ్బును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్వాధీనం చేసుకుని ఆయా నేరాల బాధితులకు అందజేసిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గురువారం సుప్రీంకోర్టుకు తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్(బీపీఎస్ఎల్) ఆస్తుల విక్రయానికి అనుమతిస్తూ మేలో జారీ చేసిన ఉత్తర్వులను సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లపై గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఓ న్యాయవాది బీపీఎస్‌ఎల్‌పై ఈడీ కేసు గురించి ప్రస్తావించగా సీజేఐ గవాయ్..ఇక్కడ కూడా ఈడీ ఉందా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ..‘ఇక్కడో వాస్తవ చెప్పాలి. ఇప్పటి వరకు ఈడీ మనీలాండరింగ్ కేసుల దర్యాప్తులో భాగంగా రూ.23 వేల కోట్లను స్వాధీనం చేసుకుంది. దీని ఆర్థిక నేరాల బాధితులకు చెల్లించింది’అని అన్నారు. -
3 నెలల్లో తేల్చండి
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసుకు సంబంధించి స్పీకర్‌కు ఆదేశాలు జారీచేయడం రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ లక్ష్యాన్ని నీరుగార్చుతుంది. అలాగని మేం ఇప్పుడు ఏ ఆదేశాలూ జారీ చేయకపోతే.. ‘ఆపరేషన్ సక్సెస్–పేషెంట్ డెడ్’ అన్నట్లుగా ఉంటుంది. స్పీకర్ తన ప్రస్తు త వైఖరిని పునరావృతం చేయడానికి దోహదపడినట్లు అవుతుంది.. – సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునే అధికారం శాసనసభ స్పీకర్‌కే ఉందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తెలంగాణలో పార్టీ మారి అనర్హత పిటిషన్లు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విషయంలో తీర్పు వెలువరించిన రోజు నుంచి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ సభాపతి కార్యాలయానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అనర్హత పిటిషన్లు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఎవరూ విచారణను ఆలస్యం చేయడాన్ని అనుమతించకూడదని పేర్కొంది. విచారణను ఆలస్యం చేసేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తే తీవ్రంగా పరిగణించాలని చెప్పింది. మరోవైపు అనర్హత విషయంలో స్పీకర్ నిర్ణయాధికారాన్ని పార్లమెంట్ పునః పరిశీలించాలని సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఏడు నెలలు.. 9 సార్లు విచారణ పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై త్వరగా చర్యలు తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ ఈ ఏడాది జనవరి 15న బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద్‌లు స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పి) దాఖలు చేశారు. మిగిలిన ఏడుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తదితరులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లు దాఖలైన తర్వాత దాదాపు ఏడు నెలల్లో తొమ్మిది సార్లు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఆర్యమ సుందరం, మోహిత్ రావు, స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, తదితరులు వాదనలు వినిపించారు. గత ఏప్రిల్ 3న విచారణ ముగించి తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం.. గురువారం తీర్పు వెలువరించింది. ఎంత సమయం కావాలని ముందే అడిగాం.. ‘2025 జనవరి 15న సుప్రీంకోర్టు ముందు కేసు దాఖలైన తర్వాత 16న తొలిసారిగా మేం కొందరికి నోటీసులు జారీ చేశాం. ఫిబ్రవరి 3న జరిగిన విచారణ సందర్భంగా.. ఫిబ్రవరి 4న మరికొందరికి నోటీసులు జారీ చేశాం. జనవరి 31న తొలుత ఈ కేసు విచారణకు వచ్చినప్పుడే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్‌కు ఎంత సమయం అవసరమో తెలుసుకోవాల్సిందిగా మేము సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గికి సూచించాం..’ అని ధర్మాసనం తెలిపింది. ‘ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ నాట్ డెడ్’లా ఉండాలి ‘10 షెడ్యూల్ కింద స్పీకర్ ట్రిబ్యునల్‌గా పని చేస్తున్నప్పటికీ, ఆయన ఎటువంటి రాజ్యాంగపరమైన రక్షణ (కానిస్టిట్యూషనల్ ఇమ్యూనిటీ)ను పొందలేరు. నిజానికి ఈ కేసును విచారించిన సింగిల్ జడ్జి అనర్హత పిటిషన్లపై విచారించేందుకు సమయాన్ని నిర్ణయించమని స్పీకర్‌కు సూచించారు. అందుకు నాలుగు వారాల గడువిచ్చారు. అంతేకానీ పిటిషన్లపై నిర్ణయం తీసుకోమని ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. అయినప్పటికీ.. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకుని సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పడం ద్వారా డివిజన్ బెంచ్ తప్పిదానికి పాల్పడింది. ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు లేకపోయినా తెలంగాణ శాసనసభ కార్యదర్శి సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేయడం సరైంది కాదు. ఇకపై ఈ కేసు ‘ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ నాట్ డెడ్’ లా ఉండాలి..’ అని సుప్రీంకోర్టు (నవ్వుతూ) వ్యాఖ్యానించింది. విచారణను పొడిగించేందుకు అనుమతి వద్దు ‘అనర్హత పిటిషన్లను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణను పొడిగించడానికి స్పీకర్ అనుమతించకూడదు. స్పీకర్ నిర్ణయాలపై న్యాయ సమీక్షకు అధికారాలు (కిహోటో హోల్లొహన్ (10వ షెడ్యూల్ సమర్థించిన) కేసులో తీర్పు నిష్పత్తిని ప్రస్తావిస్తూ) ఇరుకైన పరిధిలో (న్యారో కంపాస్) ఉన్నాయి. అలాగే స్పీకర్ నిర్ణయాలు న్యాయ సమీక్షకు పూర్తిగా అతీతం కాదు. స్పీకర్లు అనర్హత పిటిషన్లను ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచే పరిస్థితిని రాజ్యాంగ ధర్మాసనం ఊహించి ఉండకపోవచ్చు. అనర్హత పిటిషన్లను స్పీకర్ మూడు నెలల్లోగా నిర్ణయించాలని కీషమ్ మేఘచంద్ర సింఘ్ కేసులో తీర్పు ఉంది. శివసేన, ఎన్సీపీ ఎమ్మెల్యేల ఫిరాయింపుల పిటిషన్లను నిరీ్ణత సమయంలోగా నిర్ణయించాలని మహారాష్ట్ర స్పీకర్‌కు జారీ అయిన ఆదేశాలను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది..’ అని న్యాయమూర్తులు తెలిపారు. జాతీయ ఆందోళనకు సంబంధించిన అంశం ‘అనర్హత పిటిషన్లపై నిర్ణయాధికారం స్పీకర్‌కే ఇచ్చాం. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో స్పీకర్ తగిన సమయంలో స్పందించాల్సిన అవసరం ఉంది. అయితే అనర్హత విషయంలో స్పీకర్ నిర్ణయాధికారాన్ని పార్లమెంట్ పునఃపరిశీలించాలి. రాజకీయ ఫిరాయింపులు అనేవి జాతీయ ఆందోళనకు సంబంధించిన అంశం. మనం దీనిని ఎదుర్కొనకపోతే ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది..’ అని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. అనర్హతల విషయంలో స్పీకర్ నిర్ణయాధికారాన్ని పార్లమెంట్ పునః పరిశీలించాలి. రాజకీయ ఫిరాయింపులు అనేవి జాతీయ ఆందోళనకు సంబంధించిన అంశం. వీటిని ఎదుర్కొనకపోతే మన ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. 10 షెడ్యూల్ కింద స్పీకర్ ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తున్నప్పటికీ..ఆయన ఎటువంటి ‘‘రాజ్యాంగపరమైన రక్షణ’’ని పొందలేరు. అనర్హత పిటిషన్లను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణను స్పీకర్ పొడిగించుకుంటూ పోవడానికి వీల్లేదు..– సుప్రీంకోర్టు ధర్మాసనంబీఆర్ఎస్ నేతల అభ్యర్థన తోసిపుచ్చిన ధర్మాసనం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టే నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు చేసిన అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. కిహోటో హోల్లోహన్, సుభాష్ దేశాయ్ తదితరుల కేసులకు సంబంధించి రాజ్యాంగ బెంచ్ తీర్పును ప్రస్తావించింది. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉందని స్పష్టం చేసింది. ‘అయితే, ఫిరాయింపులు జరిగినప్పుడు అనర్హత అంశాన్ని తేల్చే ముఖ్యమైన బాధ్యతను స్పీకర్‌కు లేదా చైర్మన్‌కు అప్పగించే యంత్రాంగం వల్ల రాజకీయ ఫిరాయింపులను సమర్థవంతంగా అరికట్టగలుగుతున్నామా.. లేదా? అనే అంశాన్ని మాత్రం పార్లమెంట్ పరిశీలించాలి. ప్రజాస్వామ్య పునాదులు బలంగా ఉండాలంటే, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలంటే ప్రస్తుత యంత్రాంగం సరిపోతుందా? లేదా? అనే విషయం కూడా పార్లమెంటే తేల్చాలి..’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. అనర్హత పిటిషన్లపై తేల్చే అత్యంత ముఖ్యమైన బాధ్యతను పార్లమెంట్ స్పీకర్‌కు అప్పగించినప్పుడు ఆ హోదాలో ఉన్నవారు ఎంతవేగంగా చర్యలు తీసుకున్నారనేది ప్రధానమని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. షెడ్యూల్ 10 ఏం చెబుతోంది..ఇది పార్టీల నుంచి ఫిరాయింపులను నిరోధించడానికి రూపొందించింది. దీన్ని ఫిరాయింపుల నిరోధక చట్టం అని కూడా అంటారు. రాజకీయ స్థిరత్వం, ప్రజాస్వామ్య ప్రక్రియ పరిరక్షణ, విలువలను కాపాడటం కోసం దీన్ని ఉద్దేశించారు. ప్రజాప్రతినిధులు పార్టీలు ఫిరాయించకుండా నిరోధించడం దీని ముఖ్య ఉద్దేశం. దీని ప్రకారం..పార్టీ ఆదేశాలు చట్టసభల సభ్యులు పాటించాలి. పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా ఓటు వేసినా లేదా పార్టీ నుంచి వైదొలిగినా చట్టసభల సభ్యులను అనర్హులుగా ప్రకటించవచ్చు. ఫిరాయింపుల అంశాల్లో కోర్టులకు అధికార పరిధి ఉండదు. స్పీకర్ లేదా చైర్మన్ నిర్ణయమే అంతిమం. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరితే సభలో సభ్యుడిగా ఉండటానికి అనర్హుడు. ఒకవేళ ఒక పార్టీ మరో పార్టీలో పూర్తిగా విలీనమైతే అనర్హత వర్తించదు. సభ్యుని అనర్హతపై ఏ కోర్టుకు అధికార పరిధి ఉండదు. -
పెద్దల అనుభవంతో విద్యార్థులకు లబ్ధి
శ్రీనగర్: యూనివర్సిటీ ఆఫ్ కాశ్మీర్ నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులు బయటకు రావాలని, దేశ అభివృద్ధికి, జమ్మూకశ్మీర్ అభివృద్ధికి వారు పాటుపడాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ఆకాంక్షించారు. ఆయన ఆదివారం శ్రీనగర్‌లో యూనివర్సిటీ ఆఫ్ కాశ్మీర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ప్రసంగించారు. పూర్వ విద్యార్థుల అనుభవం, పరిజ్ఞానం నేటి యువతకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. పెద్దలు చొరవ తీసుకుంటే నేటి విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఆ దిశగా సేవలందించాలని పూర్వ విద్యార్థులకు పిలుపునిచ్చారు. యువతకు మెరుగైన భవిష్యత్తు అందించడానికి రోడ్‌మ్యాప్ రూపొందించాలన్నారు. యూనివర్సిటీ ఆఫ్ కాశ్మీర్ అత్యున్నత నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను దేశానికి అందిస్తున్న సంపూర్ణ విశ్వాసం తనకు ఉందని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. కాశ్మీర్ నిజంగా భూమిపై స్వర్గమేనని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే ఇది ఎంతో అందమైన ప్రాంతమని పేర్కొన్నారు. మనం స్వర్గం నుంచి ఇక్కడికి వచ్చామన్నారు. ఈ యూనివర్సిటీలో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకున్నారని ప్రశంసించారు. యూనివర్సిటీ పూర్వ విద్యారి్థ, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్‌ను జస్టిస్ గవాయ్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. -
రాత్రికి రాత్రే అడవులపై బుల్డోజర్లు ఎందుకు?: సుప్రీంకోర్టు
రాత్రికి రాత్రి 30–40 బుల్డోజర్లను పెట్టి అడవుల్లో చెట్లను నరికించేయాల్సిన అవసరం ఏమొచ్చింది?. అభివృద్ధి కోసం అడవులను నరకడం సమంజసం కాదు. అడవులను సంరక్షించాలా? లేదా మీ అధికారులను జైలుకు పంపాలా? అనే దానిపై నిర్ణయం తీసుకోండి. ..: సీజేఐ జస్టిస్ గవాయ్ :.. సాక్షి, న్యూఢిల్లీ: రాత్రికి రాత్రి 30–40 బుల్డోజర్లను పెట్టి అడవుల్లో చెట్లను నరికించేసి సుస్థిర అభివృద్ది కోసమేనని సమర్థించుకోలేరని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఉన్న అటవీ భూమిని అంత అత్యావశ్యకంగా ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. అటవీ సంరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనంటూ సున్నితంగా హెచ్చరించారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలో జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ జోమలయ బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ, మేనక గురుస్వామి, బీ ద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ తరపున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు, పి.మోహిత్‌రావు, మరో పిటిషనర్ తరపున ఎస్.నిరంజన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. తాజా నివేదికను దాఖలు చేశాం ప్రస్తుతం కంచ గచ్చిబౌలిలో అన్ని పనులను నిలిపివేసినట్లు ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ ధర్మాసనానికి తెలిపారు. అక్కడ ఎటువంటి పనులు జరగట్లేదని, కోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా పాటిస్తుందని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి సమగ్ర అంశాలతో కూడిన నివేదికను కోర్టులో దాఖలు చేశామన్నారు. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఈ అఫిడవిట్‌ను పరిశీలించేందుకు తమకు సమయం కావాలని అమికస్ క్యూరీ పరమేశ్వర్, దామా శేషాద్రి నాయుడు, పి.మోహిత్‌రావు, ఎస్.నిరంజన్ రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. దీంతో వచ్చే వారం వాదనలు వింటామని జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. దీనిపై స్పందించిన... ప్రతివాదులు మరింత సమయం కావాలని కోరగా.. ఆగస్టు 13కు తదుపరి విచారణను వాయిదా వేశారు. పర్యావరణ అంశాలపై సుప్రీంకోర్టుకు సహాయం చేసేందుకు కేంద్ర సాధికారక కమిటీ (సీఈసీ) స్వయంగా ఆ ప్రదేశాన్ని సందర్శించి తమకు నివేదిక సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. మేం అడవులను కాపాడాం ‘సరే ప్రస్తుతానికైతే అటవీ భూమిని కాపాడారు కదా?’అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ధర్మాసనం అడిగింది. అది అటవీ భూమా.. కాదా?’అనే అంశంపై మరోసారి విచారణ జరగాల్సిన అవసరం ఉందని సింఘ్వీ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై జస్టిస్ గవాయ్ స్పందిస్తూ.. ‘ఏదేమైనా సరే ప్రస్తుతానికి ఆ స్థలంలో చెట్లు సంరక్షించబడ్డాయి. అభివృద్ధి కోసం అడవులను నరకడం అనేది సమంజసం కాదు. సుస్థిర అభివృద్ధిని నేను వ్యక్తిగతంగా సమర్థిస్తాను. అంటే దానర్థం రాత్రికిరాత్రి 30–40 బుల్డోజర్లను పెట్టి మొత్తం అడవిని ధ్వంసం చేయడాన్ని సమర్థిస్తానని మాత్రం కాదు’అని అన్నారు. అటవీ భూమిని కాపాడకపోతే అధికారులను అక్కడే టెంపరరీ జైలుకు పంపుతామని గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అడవులను సంరక్షించాలా లేదా మీ అధికారులను జైలుకు పంపాలా అనే దానిపై నిర్ణయం తీసుకోండి అని అని జస్టిస్ గవాయ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
498(ఏ) కేసుల్లో హడావుడి అరెస్ట్‌లు వద్దు: సుప్రీం
వరకట్న వేధింపుల కేసుల విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ 498 (ఏ) కేసు దుర్వినియోగాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా 2022లో అలహాబాద్ హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను సమర్థించింది. వరకట్న వేధింపుల కేసుల్లో భర్త లేదా అతడి కుటుంబ సభ్యులను తొందరపడి అరెస్ట్ చేయరాదని స్పష్టం చేసింది.దేశంలో ఇటీవలి కాలంలో వరకట్న వేధింపుల కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. చిన్న చిన్న కారణాలతో విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కడం ఒకటైతే.. వరకట్నం కోసం వేధిస్తున్నారంటూ భర్త, అత్తమామలు, ఇతర బంధువులపై 498 (ఏ) కేసులు వేయడమూ మనం చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ఇవి తప్పుడు కేసులని న్యాయస్థానాల్లో తేలడం, పిటిషనర్లకు హెచ్చరికలు, జరిమానాలు విధించడమూ వినే ఉంటాం. దేశ సర్వోన్నత న్యాయస్థానం సైతం 498 (ఏ) దుర్వినియోగమవుతోందని, అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించింది కూడా. ఈ నేపథ్యంలో మంగళవారం చీఫ్ జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ ఎ.జి.మసీహలతో కూడిన బెంచ్ కొన్ని కీలకమైన మార్గదర్శకాలను జారీ చేసింది. వాటి ప్రకారం..- ఎఫ్ఐఆర్ నమోదైన తరువాత కనీసం రెండు నెలలపాటు ఎలాంటి అరెస్ట్‌లు చేయకూడదు. ఈ సమయం వివాద పరిష్కారానికి అవకాశం కల్పిస్తుంది.- ఎఫ్ఐఆర్ నమోదైన తరువాత ఫిర్యాదులను ముందుగా ప్రతి జిల్లాలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీలకు రిఫర్ చేయాలి. ఈ కమిటీలో శిక్షణ పొందిన మధ్యవర్తులు, న్యాయ విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, విశ్రాంత న్యాయమూర్తులు, సీనియర్ అధికారులు లేదా వారి సహచరులు ఉండాలి.- ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ సభ్యులను సాక్షులుగా న్యాయస్థానాలు పిలవకూడదు.- వివాద పరిష్కారానికి ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీలో జరిగే చర్చల్లో ఇరు పక్షాల వారు కనీసం నలుగురు బంధువులు (పెద్దవాళ్లు)లను భాగస్వాములుగా చేయాలి. ఆ తరువాత ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ తదుపరి చర్యల కోసం పోలీసులు, మేజిస్ట్రేట్లకు వివరణాత్మకమైన నివేదిక సమర్పించాలి. (ఇదంతా రెండు నెలల్లోపు పూర్తి కావాలి)- ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ చర్చలు జరుగుతున్న సమయంలో పోలీసులు ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడరాదు. అయితే సాధారణ విచారణను మాత్రం పోలీసులు కొనసాగించవచ్చు. - కమిటీ సభ్యులకు, విచారణ అధికారులకు ప్రత్యేకమైన శిక్షణ కల్పించాలి.- వివాదం ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీలోనే సమసిపోతే జిల్లా జడ్జీలు క్రిమినల్ కేసులను మూసివేయవచ్చు.దుర్వినియోగం తగ్గుతుందా?498(ఏ) దుర్వినియోగం తగ్గేందుకు ఈ కొత్త మార్గదర్శకాలు ఉపయోగపడతాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. చాలా సందర్భాల్లో ఏమాత్రం సంబంధం లేని కుటుంబ సభ్యులు తగిన పద్ధతి లేకుండానే అనవసరమైన వేధింపులకు గురవుతూంటారని, అలాంటి వాటిని ఈ మార్గదర్శకాల అమలుతో అరికట్టవచ్చునని వారు వివరిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సుప్రీంకోర్టు తాజా నిర్ణయానికి దారి తీసిన కేసులో భర్తతోపాటు అతడి తండ్రిని కూడా సుమారు వంద రోజులపాటు జైలు నిర్బంధం అనుభవించాల్సి వచ్చింది. వరకట్నం కోసం వేధిస్తున్నారంటూ భార్య వేసిన కేసులో హత్యాయత్నం, మానభంగం వంటి ఆరోపణలూ చేయడంతో ఆ పరిస్థితి ఏర్పడింది. -
జస్టిస్ వర్మ కోసం టాప్ లాయర్లు.. విచారణకు సీజేఐ దూరం
జస్టిస్ యశ్వంత్ వర్మ నోట్ల కట్టల ఆరోపణల వ్యవహారంలో శరవేగంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు పార్లమెంట్లో ఆయన్ని అభిశంసించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు.. సుప్రీం కోర్టులో ఆయన వేసిన పిటిషన్‌పై ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ విచారణ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ బుధవారం వైదొలిగారు. ఈ పిటిషన్‌ను విచారించేందుకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయిస్తామని తెలిపారాయన. ‘‘బహుశా ఈ పిటిషన్‌ను నేను విచారణ చేయలేనుకుంటా. ఎందుకంటే.. జస్టిస్ సంజీవ్ ఖన్నా(మాజీ సీజేఐ) నేతృత్వంలో జరిగిన విచారణలో నేను భాగమయ్యాను. కాబట్టి దీన్ని వేరొక బెంచ్‌కు బదిలీ చేస్తా’’ అని పిటిషన్ తరఫు న్యాయవాది కపిల్ సిబాల్‌కు సీజేఐ స్పష్టం చేశారు. మార్చి 14వ తేదీన ఢిల్లీ హైకోర్టు జడ్జిగా విధులు నిర్వహించిన జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక బంగ్లాలో అగ్నిప్రమాదం సంభవించి.. కాలిన స్థితిలో నోట్ల కట్టలు కనిపించాయి. ‘న్యాయవ్యవస్థలో అవినీతి..’ అంటూ ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన సుప్రీం కోర్టు.. ఆయన్ని హుటాహుటిన అలహాబాద్ హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేసింది. అదే సమయంలో ఈ ఘటనపై దర్యాప్తునకు ముగ్గురు జడ్జిల కమిటీని ఏర్పాటు చేయించింది. ఆ కమిటీ తన నివేదికను అప్పటి చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు అందించగా.. ఆయన దానిని లేఖ రూపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు పంపారు. ఆ నివేదిక ప్రకారం.. జస్టిస్ యశ్వంత్ వర్మ అవినీతికి పాల్పడ్డారని, స్వచ్ఛందంగా రాజీనామాకు ఆయన అంగీకరించలేదని, కాబట్టి ఆయన్ని తొలగించాలని ఇన్-హౌజ్ కమిటీ సిఫార్సు చేసింది. అయితే తన వాదన వినకుండానే చర్యలు తీసుకుంటున్నారని సుప్రీం కోర్టులో జడ్జి యశ్వంత్ వర్మ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఇవాళ(బుధవారం) ఆయన తరఫు లాయర్ కపిల్ సిబాల్ సీజేఐ బెంచ్‌ను కోరారు. జస్టిస్ వర్మ తరఫున కపిల్ సిబాల్‌తో పాటు ముకుల్ రోహత్గి, రాకేష్ ద్వివేది, సిద్ధార్థ్ లూథ్రాలాంటి టాప్ లాయర్లు వాదనలు వినిపిస్తుండడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఈ పార్లమెంట్ సెషన్లోనే ఆయనపై అభిశంసనకు చర్యలు నడుస్తున్నాయి. ఇలాంటి అభిశంసన తీర్మానం కోసం లోక్‌సభలో కనీసం 100 మంది, రాజ్యసభలో కనీసం 50 మంది సభ్యులు అభిశంసన నోటీసుపై సంతకం చేయాలి. అయితే జస్టిస్ వర్మ కేసులో ఇప్పటికే 145 మంది లోక్‌సభ సభ్యులు, 63 మంది రాజ్యసభ సభ్యులు ఇప్పటికే అభిశంసన నోటీసుపై సంతకం చేశారు. జడ్జి తొలగింపు కోసం భారత రాజ్యాంగంలోని 124, 217, 218 ఆర్టికల్స్ ప్రకారం నోటీసు దాఖలైంది. అయితే.. ఎంపీలు ఇచ్చిన అభిశంసన నోటీసును స్వీకరించిన కొన్ని గంటలకే రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి అయిన జగ్దీప్ ధన్‌ఖడ్ తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం.నెక్ట్స్ ఏంటంటే.. లోక్‌సభ స్పీకర్ , రాజ్యసభ ఛైర్మన్ సంయుక్తంగా ముగ్గురు సభ్యుల విచారణ కమిటీని నియమించనున్నారు. ఈ కమిటీలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఒకరు, ఓ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఓ ప్రఖ్యాత న్యాయవేత్త ఉంటారు. ఈ కమిటీకి నివేదిక సమర్పించడానికి మూడు నెలల గడువు ఇస్తారు. అయితే ఈ కమిటీ ముందు తన వాదనలు వినిపించేందుకు జస్టిస్ యశ్వంత్ వర్మకు అవకాశం(మూడుసార్లు) ఉంటుంది. గతంలో త్రీజడ్జి కమిటీ సమర్పించిన నివేదికతో పాటు జస్టిస్ వర్మ వాదనలు, సాక్ష్యాలను పరిశీలించాకే స్పెషల్ కమిటీ ఒక నివేదికను సమర్పిస్తుంది. ఈపై ఇరు సభల్లో ఆ నివేదికపై చర్చ జరిగాక.. అభిశంసన తీర్మానాన్నిప్రవేశపెడతారు. దానిని 2/3 మెజారిటీతో సభ్యులు ఆమోదించాక రాష్ట్రపతికి పంపిస్తారు. అప్పుడు ఆయన తొలగింపుపై రాష్ట్రపతి సంతకం చేసి ఉత్తర్వులు జారీ చేస్తారు. అయితే ప్రస్తుతం పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడుతున్నాయి. అదే సమయంలో ఆయన పిటిషన్ సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఆగష్టు 21వ తేదీతో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. ఈ తరుణంలో ఆయన్ని తొలగించడం ఈ సెషన్లో సాధ్యం కాకపోవచ్చని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
‘నెలకు రూ. కోటి భరణం’ కేసు ఏమైందంటే..
పద్దెనిమిది నెలల కాపురానికి రూ.12 కోట్ల విలువైన భరణం ఆశించిన భార్య సుప్రీంకోర్టులో భంగపడింది. ఆ మహిళ గొంతెమ్మ కోర్కెలకు చీఫ్ జస్టిస్ బి.ఆర్.గవాయి బ్రేకులేశారు. భర్త ఇవ్వజూపుతున్న ఫ్లాట్‌తో సరిపెట్టుకోవాలని, చదువుకున్నావు కాబట్టి ఉద్యోగంతో సొంత కాళ్లపై నిలబడే ప్రయత్నం చేయాలని చీఫ్ జస్టిస్ సుతిమెత్తగా ఆ మహిళను మందలించారు. వివరాలు ఇలా ఉన్నాయి..విడాకుల కోసం ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ బి.ఆర్.గవాయి మంగళవారం కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ బి.ఆర్.గవాయి ఆ మహిళను ఉద్దేశించి వేసిన ప్రశ్నలు.. ఆ మహిళ ఇచ్చిన సమాధానాలు ఇలా ఉన్నాయి...చీఫ్ జస్టిస్: మీ డిమాండ్ (భరణం) ఏమిటి?మహిళ: ముంబైలోని అప్పులు, తనఖా ఇబ్బందుల్లేని ఇల్లు, మెయిన్టెన్స్ కోసం రూ.12 కోట్లు.చీఫ్ జస్టిస్: ‘‘... కానీ ఆ ఇల్లు కల్పతరులో ఉంది. ఒకానొక మంచి బిల్డర్‌ది. మీరేమో ఐటీ పర్సన్. ఎంబీఏ కూడా చేశారు. మీలాంటి వాళ్లకు డిమాండ్ ఉంది.. బెంగళూరు హైదరాబాద్‌లలో.. మీరెందుకు ఉద్యోగం చేయకూడదు?’’ ‘‘పెళ్లయిన తరువాత మీ దాంపత్యం 18 నెలలు సాగింది... ఇప్పుడు మీకు బీఎండబ్ల్యూ కూడా కావాలా?’’ పద్దెనిమిది నెలల వైవాహిక జీవితానికి నెలకొ రూ.కోటి చొప్పున కావాలా?’’మహిళ: కానీ అతడు బాగా ధనవంతుడు. నాకు స్కిజోఫ్రెనియా ఉందని, వివాహం రద్దు చేయాలని అతడే కోరాడు.సీనియర్ న్యాయవాది మాధవి దివాన్ (భర్త తరఫు న్యాయవాది): ఆమె కూడా ఉద్యోగం చేయాలి. అన్నీ ఇలా డిమాండ్ చేయడం సరికాదు.మహిళ: మైలార్డ్ నేను స్కిజోఫ్రెనియా బాధితురాలి మాదిరిగా కనిపిస్తున్నానా?చీఫ్ జస్టిస్: ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయండి. అయితే ఒకటి అర్థం చేసుకోండి. మీరు అతడి తండ్రి ఆస్తి కోరలేరు!కొంత సమయం తరువాత మంగళవారం బెంచ్ మళ్లీ విచారణ చేపట్టినప్పుడు...చీఫ్ జస్టిస్: ఆదాయపన్ను పత్రాలెక్కడ? మహిళ: ఇక్కడున్నాయి.సీనియర్ న్యాయవాది మాధవి దివాన్: అన్ని పత్రాల కాపీ ఇవ్వండి... చూశారా 2015- 16లో ఆదాయం ఎక్కువ ఉంది. అప్పట్లో అతడు ఉద్యోగం చేసేవాడు.చీఫ్ జస్టిస్: 2015 - 16లో ఆదాయం ఎంత?సీనియర్ న్యాయవాది మాధవి దివాన్: రెండు కోట్ల యాభై లక్షలు, కోటి బోనస్. ఇతర వ్యాపారాలు చేసినట్లు ఆరోపణలేవీ లేవు. దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. దీని గురించి మాట్లాడేందుకు ఏమీ లేదు. తాను (మహిళ) ఆక్రమించుకున్న ఫ్లాట్‌కు రెండు కార్ పార్కింగ్లు ఉన్నాయి. వాటి ద్వారా కూడా ఆదాయం వస్తుంది.చీఫ్ జస్టిస్: అవును అవును. ముంబైలో అన్ని రకాల ప్రదేశాలతో డబ్బు చేసుకోవచ్చు. సీనియర్ న్యాయవాది మాధవి దివాన్: తాను కోరుకుంటున్న బీఎండబ్ల్యూ కారు కూడా పదేళ్ల పాతది. ఎప్పుడో పాడుపడింది. చీఫ్ జస్టిస్: మీకు (మహిళను ఉద్దేశించి) తనఖా ఇబ్బందుల్లేని ఫ్లాట్ లభిస్తుంది అంతే. బాగా చదువుకున్నా ఉద్యోగం చేయకపోవడం మీ సొంత నిర్ణయం. కేసులో తీర్పు రిజర్వ్ చేస్తున్నాం.మహిళ: నా భర్త న్యాయవాదిని ప్రభావితం చేశారు...చీఫ్ జస్టిస్: ఎవరిని? మీకు లభిస్తున్న ఫ్లాట్‌తో సంతృప్తి పడితే మేలు. లేదంటే అతడు ఇవ్వజూపుతున్న రూ.నాలుగు కోట్లు తీసుకుని మంచి ఉద్యోగం చూసుకోండి.మహిళ: వారు నాపై ఎన్నో ఆరోపణలు చేశారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. నాకు ఏ ఉద్యోగం వస్తుంది?చీఫ్ జస్టిస్:... వాటన్నింటినీ మేము రద్దు చేస్తాం! మీరు అంతంత చదువులు చదువుకున్నారు. మీ కోసం మీరు అడుక్కోకూడదు. సొంతంగా సంపాదించుకుని తినాలి! మ్యాటర్ ఎండ్స్! ఆర్డర్స్ రిజర్వ్డ్!:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
రాజకీయ పోరాటాలతో మీకేం పని?.. ఈడీపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం
జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌పై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పోరాటం ఈడీ పని కాదని.. అది ముమ్మాటికీ అధికార దుర్వినియోగం కిందికి వస్తుందంటూ పేర్కొంది. కర్ణాటక ‘మూడా స్కాం’ కేసుతో పాటు.. లాయర్లకు ఈడీ సమన్లు జారీ చేసిన వ్యవహారాలను విచారించే క్రమంలో సుప్రీం కోర్టు ఈడీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యూఢిల్లీ: మూడా స్కాం కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతికి కర్ణాటక హైకోర్టు కల్పించిన ఉపశమనాన్ని ఈడీ సుప్రీం కోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ ఈడీపై తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టు సింగిల్ జడ్జి సమర్థించారని మీకు బాగా తెలుసు. అంటే ఈ కేసులో ఇప్పటికే రెండు స్థాయిల్లో న్యాయ నిర్ణయాలు వచ్చాయి. వాటిని తిరగరాయడానికి ఈడీ ప్రయత్నించడం అనవసరం. ఇది రాజకీయ ప్రమేయంలా అనిపిస్తోంది. రాజకీయాలు పోరాటాలు అనేది ప్రజల మధ్య జరగాలి. మీరు(ఈడీ) దానిని ఎందుకు ఉపయోగిస్తున్నారు? ప్రశ్నించారు. EDను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం సరికాదు.. అది ప్రజాస్వామ్యానికి హానికరం. ఈ వైరస్‌ను దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందనివ్వకండి అని సీజేఐ వ్యాఖ్యానించారు.Let political battles be fought among the electorate.. రాజకీయ పోరాటాలు ప్రజల మధ్య జరగాలి. రాజకీయ పార్టీల మధ్య ఉన్న విభేదాలు, ఆరోపణలు, విమర్శలు కోర్టుల ద్వారా కాదు, ఓటర్ల తీర్పు ద్వారా పరిష్కరించాలి. అలాంటిది ED (Enforcement Directorate) వంటి సంస్థలు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతున్నాయా?. కోర్టులను రాజకీయ వేదికలుగా ఉపయోగించకండి. ప్రజాస్వామ్యంలో ఓటర్లు మాత్రమే రాజకీయ నాయకుల భవితవ్యాన్ని నిర్ణయించాలి, న్యాయవ్యవస్థ కాదు.దురదృష్టవశాత్తూ.. మహారాష్ట్రలో ఈడీతో నాకు అనుభవం ఉంది. మాతో మీ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసేలా చేసుకోకండి అని చీఫ్ జస్టిస్ గవాయ్ హెచ్చరించారు. ఈ క్రమంలో అదనపు సోలిసిటర జనరల్ ఎస్వీ రాజు తమ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని ధర్మాసనానికి తెలిపారు. అదే సమయంలో.. భవిష్యత్తులో ఈ పిటిషన్‌ను ఇతర కేసుల్లో ఉదాహరించవద్దంటూ విజ్ఞప్తి చేశారాయన. దీంతో పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు సీజేఐ ప్రకటించారు. మరో కేసులో.. క్లయింట్లకు సలహాలు ఇస్తున్నారనే అభియోగాల కింద.. ఈడీ సీనియర్ అడ్వొకేట్లకు కొందరు సమన్లు జారీ చేసింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు .. ఇవాళ విచారణ చేపట్టింది. సుప్రీం కోర్టు బార్ అసోషియేషన్ తోపాటు మరికొన్ని లీగల్ బాడీస్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో.. చైనా, టర్కీలలో బార్ అసోషియేషన్లు రద్దైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆందోళన వ్యక్తం చేశాయి. అదే సమయంలో మార్గదర్శకాలు జారీ చేయాలని కోరాయి. దీంతో.. న్యాయపరమైన సలహాలు ఇవ్వడం తప్పెలా అవుతుంది? అని ఈడీ తీరును సుప్రీం కోర్టు తప్పుబట్టింది. అయితే గుజరాత్లో ఓ హత్య కేసులో నిందితుడికి న్యాయవాది సలహా ఇవ్వడాన్ని ఈడీ ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ వ్యవహారంలో ఈడీని నెగెటివ్‌గా చూపించే ప్రయత్నం జరుగుతోందంటూ సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. అయితే అది వేరే సందర్భమన్న సీజేఐ బెంచ్.. న్యాయవాదిని సమన్లు ఇవ్వాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలనే విషఁఆన్ని గుర్తు చేశారు. ఈ వ్యవహారంలో మార్గదర్శకాల రూపకల్పనకు అమీకస్ క్యూరీని నియమిస్తామంటూ వచ్చేవారానికి విచారణ వాయిదా వేసింది.మూడా (MUDA) కేసు నేపథ్యంకర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య B.M. పర్వతికి సంబంధించి మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) ద్వారా భూ కేటాయింపులపై అక్రమతల ఆరోపణలతో ప్రారంభమైంది. సుమారు 3.16 ఎకరాల భూమి పర్వతి పేరుతో ఉంది, ఇది MUDA ద్వారా డెనోటిఫై చేయబడిన తర్వాత రెసిడెన్షియల్ లేఅవుట్‌గా అభివృద్ధి చేయబడింది. MUDA ఈ భూమిని ఉపయోగించినందుకు పర్వతి 14 ప్లాట్లు (ప్రతి ఒక్కటి ₹2 కోట్ల విలువ) విజయనగర ప్రాంతంలో పొందారు. అయితే.. బీజేపీ, JD(S) వంటి ప్రతిపక్షాలు దీన్ని ₹4,000 కోట్ల స్కాంగా అభివర్ణించాయి. మూడా (MUDA) కేసు కోర్టు విచారణ టైం లైన్కర్ణాటక గవర్నర్ తావార్చంద్ గెహ్లాట్ 2024 ఆగస్టు 17న MUDA కేసులో ED విచారణకు అనుమతి ఇచ్చారు. తద్వారా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లైంది. ED తన Enforcement Case Information Report (ECIR) నమోదు చేసి, పర్వతి (CM భార్య) సహా ఇతరులపై ప్రీలిమినరీ విచారణ ప్రారంభించింది. ఆగస్టు 19, 2024👉 సీఎం సిద్ధరామయ్య గవర్నర్ ఆదేశాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.👉 ED విచారణకు అనుమతి ఇచ్చిన గవర్నర్ ఆదేశాన్ని రద్దు చేయాలని కోరారు.ఆగస్టు 29, 2024👉 హైకోర్టు ప్రత్యేక కోర్టును MUDA కేసులో తాత్కాలికంగా ఆదేశాలు ఇవ్వకుండా ఉండమని సూచించింది.👉 విచారణ తదుపరి తేదీకి వాయిదా వేసింది. సెప్టెంబర్ 12, 2024👉 హైకోర్టు విచారణ పూర్తిచేసి తీర్పును రిజర్వ్ చేసింది.👉 న్యాయమూర్తి M. నాగప్రసన్న రెండు పక్షాల వాదనలు ఆఖరి రోజులోనే ముగించాలని స్పష్టం చేశారు.సెప్టెంబర్ 24, 2024👉 కర్ణాటక హైకోర్టు సీఎం సిద్ధరామయ్య పిటిషన్‌ను తిరస్కరించింది.👉 గవర్నర్ అనుమతి చట్టబద్ధమైనదే అని తీర్పు ఇచ్చింది.2025 మార్చి 7కర్ణాటక హైకోర్టు సిద్ధరామయ్య సతీమణి B.M. పార్వతికి ఉపశమనంMUDA భూ కేటాయింపు కేసులో, ED జారీ చేసిన సమన్లను హైకోర్టు రద్దు చేసింది. న్యాయమూర్తి M. నాగప్రసన్న ఈ తీర్పును ఇచ్చారు, పార్వతి, మంత్రి బైరతి సురేష్ దాఖలు చేసిన పిటిషన్లను విచారించి, ED చర్యలు చట్టపరంగా నిలబడవని తేల్చారు. Money Laundering Act (PMLA) ప్రకారం, “proceeds of crime” అనే అంశం స్పష్టంగా లేకపోతే, ED విచారణ కొనసాగించలేదని కోర్టు అభిప్రాయపడింది. పార్వతి 14 ప్లాట్లు స్వచ్ఛందంగా తిరిగి అప్పగించడంతో, ఆర్థిక లాభం పొందలేదని కోర్టు గుర్తించింది. సమన్లు జారీ చేయడం చట్టబద్ధంగా కాదని తీర్పు ఇచ్చారు.జూలై 21, 2025👉 సుప్రీం కోర్టు ఈ కేసులో ED అప్పీల్‌ను తిరస్కరించింది.👉 “రాజకీయ పోరాటాలు ప్రజల మధ్య జరగాలి, కోర్టుల్లో కాదు” అని CJI BR గవాయ్ వ్యాఖ్యానించారు. -
సృజనాత్మకతతోనే ఉన్నత శిఖరాలకు..
సాక్షి, హైదరాబాద్: న్యాయవాద వృత్తిలో నైపుణ్యంతోపాటు సృజనాత్మకత అవసరమని, అవి పాటించినవారే ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ అన్నారు. వర్ణ వివక్ష, సామాజిక వివక్షపై పోరాడిన న్యాయవాదుల వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని యువ న్యాయవాదులకు పిలుపునిచ్చారు. న్యాయవాద వృత్తిలో అడ్డంకులుంటాయని, వాటిని అధిగమించి ముందుకు సాగాలని సూచించారు.న్యాయవ్యవస్థలో విశ్వాసం, నిబద్ధత, ప్రజా సేవకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. హైదరాబాద్ షామీర్పేటలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో 22వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జస్టిస్ బీఆర్ గవాయ్, గౌరవ అతిథిగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ, నల్సార్ చాన్స్‌లర్, రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సీజేఐ పలుసూచనలు, సలహాలు ఇచ్చారు.విదేశీ విద్యపై మోజు వద్దు..‘నల్సార్ అంటే విద్యా నైపుణ్యం మాత్రమే కాదు.. చట్ట విలువల పట్ల దాని లోతైన నిబద్ధత. దేశంలో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు ఇతర సంస్థల కంటే మెరుగ్గా ప్రమాణాలు పాటిస్తున్నాయి. కొత్త ప్రపంచం, సాంకేతిక పరిణామాలకు ప్రతిస్పందనగా వృత్తి అభివృద్ధి చెందుతున్నా.. ఇంకా బలమైన పునాదులు అవసరం. సహచరుల ఒత్తిడి కారణంగా విదేశీ విద్యపై మోజు పెంచుకోవద్దు. అంతర్జాతీయ అర్హతతోనే ఎదుగుదల సాధ్యమన్నది అవాస్తవం.దేశంలో నాణ్యమైన విద్యకు కొదవలేదు. కొందరు ఆర్థిక భారమైనా విదేశాలకు వెళ్లాలని భావించడం సరికాదు. అది ఆ కుటుంబాలను అప్పుల్లో మునిగేలా చేస్తుంది. ఎల్ఎల్బీతోనే ఆగిపోకుండా ఎల్ఎల్ఎం సహా ఉన్నత చదువులపై దృష్టి సారించాలి. కోర్టు, కక్షిదారుల ముందు న్యాయవాదులు తమను తాము నిరూపించుకునేందుకు నిరంతరం కష్టపడాలి. న్యాయస్థానం ఇచ్చే తీర్పులపై అవగాహన పెంపొందించుకోవాలి. అప్పుడే సమర్థవంతమైన న్యాయవాదిగా నిలబడగలుగుతారు’ అని సూచించారు.విద్యార్థులకు బంగారు పతకాలు అందజేస్తున్న సుప్రీంకోర్టు సీజే గవాయ్, జస్టిస్ పీఎస్.నరసింహ, హైకోర్టు సీజే జస్టిస్ సుజయ్‌పాల్, సీఎం రేవంత్‌రెడ్డి నిబద్ధతతో ముందుకు సాగాలి..విద్యా నైపుణ్యం, రాజ్యాంగ విలువలు, సమ్మిళిత వృద్ధికి నల్సార్ కట్టుబడి ఉందని వర్సిటీ వీసీ శ్రీకృష్ణదేవరావు అన్నారు. ఎస్సీ, ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టం కింద ప్రత్యేక కోర్టుల ఆధునీకరణపై కేంద్రంతో కలిసి పని చేశామని చెప్పారు. డిగ్రీలు అందుకుని వెళ్తున్న విద్యార్థులు నిబద్ధతతో ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా డిగ్రీలు పూర్తి చేసుకున్న పీహెచ్డీ, ఎల్ఎల్ఎం, ఎంబీఏ, ఎంఏ (పన్ను చట్టాలు), ఎంఏ (క్రిమినల్ జస్టిస్ మేనేజ్మెంట్), బీఏ ఎల్ఎల్బీ(హానర్స్), బీబీఏ (హానర్స్), బీబీఏ, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ విద్యార్థులకు పట్టాలను అందజేశారు.ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జస్టిస్ బీఆర్ గవాయ్, రేవంత్‌రెడ్డి పసిడి పతకాలు ప్రదానం చేశారు. అత్యధికంగా ఇషికా గార్గ్ 8, ఖండేకర్ సుకృత్ శైలేంద్ర 7, అర్చిత సతీశ్ 6 పతకాలు సాధించారు. రెండు వీసీ మెడల్స్‌తో కలిపి మొత్తం 58 బంగారు పతాకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శామ్‌కోషి, జస్టిస్ వినోద్‌కుమార్, జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ.నరసింహారెడ్డి, అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్‌రెడ్డి, వర్సిటీ రిజి్రస్టార్ కె. విద్యుల్లతారెడ్డి, కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత శాఖ కార్యదర్శి అమిత్ యాదవ్ (ఐఏఎస్) తదితరులు పాల్గొన్నారు. స్నాతకోత్సవం సందర్భంగా సీజేఐతో సీఎం రేవంత్‌రెడ్డి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.ఏఐతో సత్వర న్యాయం సాధ్యమే..‘ఏటా న్యాయవాద విద్యలోకి వచ్చే వారు పెరుగుతున్నారు. అయితే, వృత్తిలో నైపుణ్యం పెంచుకున్నవారే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు. దేశానికి ఉత్తమ న్యాయవాదుల అవసరం ఎంతో ఉంది. మనదేశం ఎదుర్కొంటున్న చట్టపరమైన సవాళ్లకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. న్యాయవ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను వినియోగించాల్సిన సమయం ఆసన్నమైంది. సరై న పద్ధతిలో ఉపయోగిస్తే సత్వర న్యాయం అందించేందుకు దోహదం చేస్తుంది. స్నేహితులు, కుటుంబం, పుస్తకాలు, అభిరుచులు, ఆరోగ్యం, ఊహ.. ఈ ఐదు అంశాలు ఎప్పు డూ చెక్కుచెదరకుండా చూసుకోవాలి’అని ఉద్బోధించారు. -
నేను మరాఠిలో మాట్లాడాలా.. ఇంగ్లిష్‌లోనా?: సీజేఐ
ముంబై: మహారాష్ట్రలో మరాఠీ ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన తరుణంలో ఇప్పుడు ఆ భాష తప్పనిసరిగా మాట్లాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇదే విషయంపై సీజేఐ బీఆర్ గవాయ్ సరదాగా స్పందించారు. ఈ రోజు(ఆదివారం, జూలై 6) ముంబైలోని తాను చదువుకున్న చిన్ననాటి స్కూల్‌ను సందర్భించిన గవాయ్.. స్కూల్ పిల్లలతో సరదాగా గడిపారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడే క్రమంలో మరాఠీ భాషలో మాట్లాడాలా? లేక ఇంగ్లిష్‌లో మాట్లాడాలా? అనే సందిగ్ధత ఆయనకు కూడా ఏర్పడింది. ‘ఇప్పుడు నేను మరాఠీలో మాట్లాడాలా?, లేక ఇంగ్లిష్‌లోనా?’ అని అక్కడున్న టీచర్‌ను అడిగారు. మేడమ్ అయితే మరాఠిలో చక్కగా మాట్లాడారు. కానీ తాను మరాఠీలో మాట్లాడితే అంతా అర్థం చేసుకుంటారు కదూ..? అని విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారుదీని తరువాత సీజేఐ గవాయ్.. తన ప్రసంగంలోని మిగిలిన భాగాన్ని మరాఠీలో కొనసాగించారు. తాను మాతృభాషలో మాట్లాడటంతో ఆయన అందరి దృష్టిని ఆకర్షించడమే కాదు .. ప్రశంసల సైతం అందుకున్నారు. గవాయ్ తన ప్రసంగంలోని మిగిలిన భాగాన్ని మరాఠీలో కొనసాగించారు, తన మాతృభాషలో మాట్లాడటానికి ఎంచుకున్నందుకు అందరి దృష్టిని మరియు ప్రశంసలను పొందారు.మహారాష్ట్రలో మరాఠీ వాడకాన్ని అమలు చేయడం లేదా ప్రోత్సహించడం చుట్టూ రాజకీయాలు వేడెక్కుతున్న సమయంలో, ముఖ్యంగా ప్రముఖులు మరియు రాజకీయ నాయకులతో కూడిన ఇటీవలి వివాదాల తర్వాత ఆయన వ్యాఖ్యలు వచ్చాయి. తాను చదువుకున్న చికిత్సక్ సముహ్ శిరోద్కర్ పాఠశాలలోని తరగతి గదులను కూడా సందర్శించారు. ఇక్కడ తన పూర్వ విద్యార్థులతో సమావేశమయ్యారు సీజేఐ. ఈ క్రమంలోనే మాతృభాషలో చదువుకోవడం వల్ల విషయం లోతైన అవగాహన ఏర్పడుతుందని, అది జీవితాంతం మనతో పాటే ఉండే అత్యంత అమూల్యమైనదిగా ఆయన అభివర్ణించారు. -
రాజ్యాంగమే సుప్రీం, పార్లమెంట్ కాదు: CJI జస్టిస్ గవాయ్
-
పార్లమెంట్ కాదు.. రాజ్యాంగమే సర్వోన్నతం
మన దేశంలో కొంతమంది పార్లమెంటే సుప్రీం అని అంటారు. కానీ, నావరకైతే రాజ్యాంగమే దేశానికి సర్వోన్నతం అని భారత ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయ్(CJI BR Gavai) అన్నారు. పార్లమెంట్‌కు రాజ్యాంగాన్ని సవరణ చేసే అధికారం మాత్రమే ఉందన్న ఆయన.. రాజ్యాంగపు మౌలిక నిర్మాణాన్ని మార్చే హక్కు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం తన స్వస్థలం అమరావతి(మహారాష్ట్ర)లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కొంత మంది దేశానికి పార్లమెంటే అత్యున్నతమైందని భావిస్తారు. కానీ, నా వరకైతే న్యాయ(judiciary), శాసన(legislature), కార్యనిర్వాహక (executive) వ్యవస్థల్లో ఏదీ గొప్పది కాదు. రాజ్యాంగమే సర్వోన్నతం. ఎందుకంటే..పార్లమెంట్‌కు రాజ్యాంగంలో సవరణలు చేసే హక్కు మాత్రమే ఉంది. కానీ, మౌలిక నిర్మాణాన్ని మార్చే హక్కు మాత్రం లేదు’’ అని అన్నారాయన.జడ్జి ఎలా ఉండాలంటే..ఒక న్యాయమూర్తి కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదేశాలు ఇవ్వడం వల్ల స్వతంత్రుడు అవ్వలేడు. తాము కేవలం అధికారం ఉన్నవాళ్లం అని మాత్రమే కాకుండా, పౌర హక్కులు, రాజ్యాంగ విలువలను సంరక్షించాల్సిన బాధ్యతగల వాళ్లమని న్యాయమూర్తులు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ప్రజలు తమ తీర్పుల గురించి ఏమనుకుంటారో? ఎలా స్పందిస్తారో? అనే విషయాలపై ప్రభావితం కాకూడదు. స్వతంత్రంగా ఆలోచించాలి. ప్రజలు ఏమంటారన్నది నిర్ణయ ప్రక్రియలో భాగం కావాల్సిన అవసరం లేదు.బుల్డోజర్ జస్టిస్ తీర్పు గురించి..నా పని గురించి నా తీర్పులతోనే మాట్లాడుకునేలా చేస్తాను. రాజ్యాంగంలో స్థిరపరిచిన మూల హక్కుల పట్ల గౌరవంగా నిలబడతా. ఈ సందర్భంగా.. బుల్డోజర్ జస్టిస్ తీర్పును(కిందటి ఏడాది నవంబర్ 13న ఇచ్చిన తీర్పును) ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ప్రజలకు ఆశ్రయం (నివాసం) హక్కు అత్యున్నతమైనది అని పేర్కొన్నారాయన.భారత సుప్రీంకోర్టు బుల్డోజర్ జస్టిస్‌పై 2024 నవంబర్ 13న కీలక తీర్పు వెల్లడించింది. నేరారోపణలు ఉన్న వ్యక్తుల ఇళ్లను విచారణ లేకుండానే కూల్చడం చట్ట విరుద్ధం అని జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన బెంచ్ స్పష్టం చేసిందిఆర్కిటెక్ట్ కావాలనుకున్నా..అలాగే.. తన బాల్యంలో జరిగిన సంఘటనలను ఆయన గుర్తుచేసుకున్నారు. తాను నిజానికి ఆర్కిటెక్ట్ అవ్వాలనుకున్నప్పటికీ, తన తండ్రి మాత్రం న్యాయవాదిగా అవ్వాలని ఆకాంక్షించారని గవాయ్ చెప్పారు. నిజానికి నా తండ్రికి కూడా న్యాయవాది అవ్వాలన్న ఆశ ఉండేది. కానీ ఆయన స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని అరెస్టు కావడంతో అది సాధ్యపడలేదు’’ అని తెలిపారాయన. గవాయ్ తండ్రి సూర్యభాన్ గవాయ్ అంబేద్కర్‌వాదిగా రాజకీయాల్లో రాణించారు. బిహార్, సిక్కిం, కేరళ రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు కూడా.రాజ్యాంగంపై బీఆర్ గవాయ్ చేసిన తాజా వ్యాఖ్యలు భారత ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ ప్రాముఖ్యతను, పార్లమెంట్ సహా అన్ని వ్యవస్థలు రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.